మేం చేయం.. మీరూ చేయొద్దు..!

ABN , First Publish Date - 2022-08-17T06:19:55+05:30 IST

పేరూరు డ్యాం కింద ఉన్న కాజ్‌వే పూర్తిగా దెబ్బతిని 15 రోజులు అవుతోంది. ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు.

మేం చేయం.. మీరూ చేయొద్దు..!
దెబ్బతిన్న కాజ్‌వేను పరిశీలిస్తున్న మాజీమంత్రి పరిటాలసునీత

పేరూరు డ్యాం కాజ్‌వే వద్ద హైడ్రామా

కాజ్‌వే దెబ్బతిన్నా పట్టించుకోని అధికారులు

ప్రజల వేదన విని.. పనులు చేపట్టిన పరిటాల సునీత

పోలీసుల ద్వారా అడ్డుకున్న  వైసీపీ నాయకులు


పేరూరు డ్యాం కింద దెబ్బతిన్న కాజ్‌వే వ్యవహారం నాటకీయ పరిణామాలకు దారితీసింది. ఆ మార్గంలో ఇసుక అక్రమ రవాణాతో రోడ్డు బాగా దెబ్బతింది. దీనికితోడు డ్యాం గేట్లు ఎత్తడంతో క్యాజ్‌వే దెబ్బతింది. అధికారులు మరమ్మతు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సమస్యను పరిష్కరించాలని పలు గ్రామాల ప్రజలు మాజీ మంత్రి పరిటాల సునీతను కలిశారు. ఆమె స్పందించి, సొంత డబ్బుతో మరమ్మతు పనులను ప్రారంభించారు. విషయం తెలియగానే వైసీపీ నాయకులు, పోలీసులు అడ్డు తగిలారు. ఆ తరువాత ఇరిగేషన అధికారులు వచ్చి, వెంటనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ‘మీరు చేయరు.. ఎవరైనా స్పందించి చేస్తామంటే చేయనివ్వరు. ఇదేం తీరు..?’ అని వైసీపీ నాయకులపై ప్రజలు మండిపడ్డారు.


రామగిరి, ఆగస్టు 16: పేరూరు డ్యాం కింద ఉన్న కాజ్‌వే పూర్తిగా దెబ్బతిని 15 రోజులు అవుతోంది. ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. దీంతో కొందరు ఈ సమస్యను మాజీ మంత్రి పరిటాల సునీత దృష్టికి తీసుకువెళ్లారు. శిథిలమైన రోడ్డు గురించి, తాము పడుతున్న ఇబ్బందుల గురించి ఏకరవు పెట్టారు. కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు డ్యాం నిండటంతో ఒక్కసారిగా ఆరుగేట్లు ఎత్తారు. దీంతో కాజ్‌వే దెబ్బతింది. పేరూరు నుంచి కంబదూరు, ఏడుగుర్రాలపల్లి, పావగడవైపు వెళ్లే వాహనాలకు ఇబ్బంది కలుగుతోంది. పొలాల్లోకి వెళ్లేందుకూ దారి లేకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మరమతు చేయిస్తానని గ్రామస్థులు హామీ ఇచ్చారు. దగ్గరుండి పనులు చేయించుకోవాలని వారికి సూచించారు. దెబ్బతిన్న కాజ్‌వేను మంగళవారం ఉదయం పరిటాల సునీత పరిశీలించారు. రోడ్డు వేయించడానికి వాహనాలను వెంటబెట్టుకుని వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ‘పనులు చేయడానికి మీరెవరు..? వాహనాలను ఇక్కడే వదిలి వెళ్లిపోండి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం’ అని హుకుం జారీ చేశారు. అవే వాహనాలతో వైసీపీ నాయకులు కాసేపు పనులు చేయించి, తరువాత వెళ్లిపోయారు. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చేయరు. చేసేవారినీ చేయనివ్వరు..’ అని వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 


ఏ రాజ్యంలో ఉన్నాం..?

అసలు మనం ఏ రాజ్యంలో ఉన్నామో అర్థంకావడంలేదని మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. మరమతు పనులను వైసీపీ నాయకులు, పోలీసులు అడ్డుకోవడంతో ‘ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా?’ అని ప్రశ్నించారు.  వైసీపీ నాయకులు ధనదాహంతో వందలాది టిప్పర్లతో రాత్రిరాత్రికే ఇసుకను కర్ణాటకకు తరలిస్తున్నారని, ఈ కారణంగా రోడ్డు దెబ్బతినిందని అన్నారు. భూగర్భజలాలు కూడా లేకుండా పోతున్నాయని అన్నారు. దేవుని దయ వల్ల కర్ణాటకలో భారీ వర్షాలు కురిసి, డ్యాం నిండిందని, కానీ వాటిని ఎలా వినియోగించాలి, ఏ సమయంలో వదలాలన్న ఆలోచన చేయడం లేదని వైసీపీ ప్రజాప్రతినిధులను విమర్శించారు. వైసీపీవారు చేసిన పనికి రోడ్లు దెబ్బతింటే, ఇరిగేషన అఽధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించలేదని అన్నారు. 15 రోజుల క్రితం కాజ్‌వే కూలిపోయినా, ఎమ్మెల్యేకు పట్టడంలేదని విమర్శించారు. తాము వాహనాలను తెప్పించి మరమతు చేయిస్తుంటే పోలీసులచేత అడ్డుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంకు నీళ్లు తెప్పించామని గొప్పలు చెప్పే ఎమ్మెల్యే, జలాశయం నీరు వృథా అవుతుంటే ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. జైకా నిధులు రూ.24 కోట్లతో పనులు చేస్తే, గేట్లు కూడా సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. అధికారులు, ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె వెంట టీడీపీ నాయకులు రామ్మూర్తినాయుడు, రంగయ్య, సుధాకర్‌ తదితరులు ఉన్నారు.


మరమ్మతు చేస్తాం: ఈఈ

పేరూరు డ్యాం కింద దెబ్బతిన్న కాజ్‌వే మరమతు పనులు వెంటనే చేపడుతామని ఆర్‌అండ్‌బీ ఈఈ సంజీవయ్య తెలిపారు. కాజ్‌వేను మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మాజీమంత్రి పరిటాల సునీత తనసొంత డబ్బుతో పనులు చేయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆగమేఘాలమీద వచ్చి పనులు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పైపులు వేసి రాళ్లు, మట్టితో తాత్కాలికంగా రోడ్డు వేస్తామని, నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతామని ఈఈ తెలిపారు. ఈఈ వెంట ఏఈ హారిక ఉన్నారు.




Updated Date - 2022-08-17T06:19:55+05:30 IST