Abn logo
Apr 22 2021 @ 15:49PM

ఇద్దరు ఢిల్లీ గూండాలకు లొంగేది లేదు : మమత బెనర్జీ

కోల్‌కతా : ఢిల్లీలోని ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్‌ను అప్పగించేది లేదని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ చెప్పారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లో జరిగిన టీఎంసీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, తాను క్రీడాకారిణిని కాదని, అయితే ఆడటం ఎలాగో తనకు తెలుసునని చెప్పారు. లోక్‌సభలో అంతకుముందు తాను ఉత్తమ క్రీడాకారిణినని తెలిపారు. ఇద్దరు ఢిల్లీ గూండాలకు బెంగాల్‌ను అప్పగించబోమన్నారు. ఆమె పరోక్షంగా బీజేపీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.


శాసన సభ ఎన్నికల్లో ఆరో దశలో నాలుగు జిల్లాల్లోని 43 నియోజకవర్గాలకు  పోలింగ్ గురువారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 57.30 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. 306 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 27 మంది మహిళలు. కాగా 1.03 కోట్ల మంది ఓటర్లు ఓటు వేసేందుకు అర్హులు. వీరిలో 50.65 శాతం మంది మహిళా ఓటర్లు, కాగా 256 మంది థర్డ్ జండర్ ఓటర్లు. గురువారం పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,071 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ఒక్కొక్క కంపెనీలో 100 మంది సిబ్బంది ఉంటారు. 


పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో ఈ నెల 26న ఏడో దశ పోలింగ్, ఈ నెల 29న ఎనిమిదో దశ పోలింగ్ జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.


Advertisement
Advertisement