Abn logo
Sep 20 2021 @ 02:24AM

మేమూ బడికి వెళ్లం

అఫ్ఘాన్‌లో బాలికలకు మద్దతుగా బాలుర సంఘీభావం 

స్కూళ్లలోకి అనుమతించాలని డిమాండ్‌


కాబూల్‌, సెప్టెంబరు 19: అఫ్ఘానిస్థాన్‌లో బాలికల విద్యకు బాలురు అండగా నిలిచారు. అమ్మాయులను బడుల్లోకి అనుమతించే వరకు తామూ పాఠశాలకు వెళ్లబోమన్నారు. ఈ మేరకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘అఫ్ఘాన్‌లో సగం జనాభా మహిళలే. బాలికలకు స్కూళ్లు పునఃప్రారంభించే వరకూ నేను బడికి వెళ్లను. బాలురకు పురుష టీచర్లు, బాలికలకు మహిళా టీచర్లు ఉన్నప్పుడు ఏంటి సమస్య? బా లికల కోసం బడులు ఎందుకు తెరవడం లేదు?’’ అని రోహుల్లా అనే 12వ తరగతి విద్యార్థి ప్రశ్నించాడు. ‘‘బా లికా విద్యతో ఓ తరం బాగుపడుతుంది. బాలురు చదువుకుంటే వాళ్ల కుటుంబాలకే మంచి జరుగుతుంది. కానీ బాలికలు విద్యావంతులైతే సమాజమంతా ముందుకెళ్తుంది’’ అని మొహమ్మద్‌ రెజా అనే స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చెప్పారు. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి మహిళల పరిస్థితి దారుణంగా మారిన విషయం తెలిసిందే. ఇక.. అఫ్ఘాన్‌లో మహిళలపై రోజురోజుకు ఆంక్షలు పెరుగుతున్నాయి. మహిళా ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని కాబూల్‌ మునిసిపాలిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాబూల్‌ తాత్కాలిక మేయర్‌ హమ్‌దుల్లా నమోనీ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతానికి మునిసిపాలిటీ మహిళా ఉద్యోగులను ఇంట్లోనే ఉండాలని ఆదేశించాం. పురుషులతో భర్తీ చేయలేని స్థానంలో ఉన్న మహిళలకు మాత్రమే మినహాయింపు ఇచ్చాం’’ అన్నారు. మరోవైపు తమ హక్కులను పునరుద్ధరించాలని కోరతూ ఆదివారం కాబూల్‌లో కొంతమంది మహిళలు ధర్నా చేశారు. కాగా, నన్‌గర్హార్‌ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌లో ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. ఉదయం బస్టాండుకు సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పౌరులు చనిపోయారు. ఓ తాలిబాన్‌ కూడా గాయపడ్డాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. 


నేడు ప్రధానితో సౌదీ మంత్రి భేటీ

అఫ్ఘాన్‌లో తాజా పరిణామాలపై భారత్‌, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు చర్చించారు. సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్‌ బిన్‌ ఫర్హాన్‌ అల్‌ సౌద్‌ తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్న సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. సౌదీ మంత్రి ఫైజల్‌ సోమవారం ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు.


ఓట్ల కోసమే అఫ్ఘాన్‌, పాక్‌ అంశం: ముఫ్తీ 

తాలిబన్లు, అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ వంటి వివాదాలను వాడుకుని ఓట్ల కోసం బీజేపీ రాజకీయాలు చేస్తోందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. లద్దాఖ్‌లో చొరబడ్డ చైనా గురించి మాత్రం బీజేపీ మాట్లాడబోదని ఆమె విమర్శించారు. 


మానవ బాంబులతో దాడికి ఐఎస్‌ కుట్ర

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థకు చెందిన మానవ బాంబులు దాడికి తెగబడొచ్చనే నిఘా విభాగాల హెచ్చరికతో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై ఈనెల ప్రారంభంలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారాన్ని అందజేసింది. ప్రముఖ వ్యక్తులు, కార్యాలయాలు లక్ష్యంగా దాడులకు ఐఎస్‌ కుట్రపన్నిందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయాలు, ఆ దేశస్థులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.