ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: కైలాస్ విజయవర్గీయ

ABN , First Publish Date - 2021-05-02T20:10:17+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 200కు పైగా సీట్లలో..

ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: కైలాస్ విజయవర్గీయ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ 200కు పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండటం, మమత బెనర్జీ నందిగ్రామ్‌లో లీడింగ్‌లో కొనసాగుతుండటం బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడం, ప్రచార సభలకు భారీగా జనం రావడం తమ గెలుపును ఖాయం చేసిందంటూ ఊదర గొట్టిన బీజేపీ అగ్రనేతలు తాజా ట్రెండ్స్‌ చూసి అవాక్కవుతున్నారు. దీనిపై ఆ పార్టీ పార్టీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ ఆచితూచి స్పందించారు.


''ఇలాంటి ఫలితాలను మేము ఊహించలేదు. అయితే ఊహించనిదే జరుగుతోంది. బయట వ్యక్తులంటూ మమతా బెనర్జీ పదేపదే ప్రస్తావించిన అంశం, ఆమె కాలికి గాయం కావడం టీఎంసీకి ఎక్కువ సీట్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాయి'' అని కైలాస్ విజయవర్గీయ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 147 సీట్ల మేజిక్ ఫిగర్‌ను టీఎంసీ ఆలవోకగా దాటేసి భారీ మెజారిటీ దిశగా దూసుకువెళ్లడంతో టీఎంసీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. ఎన్నికల విజయానంతర సంబరాలు జరపవద్దంటూ పార్టీలకు ఈసీ ఆదేశాలిచ్చినా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సందడి చేస్తున్నారు.

Updated Date - 2021-05-02T20:10:17+05:30 IST