Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 10 Aug 2022 00:02:41 IST

దేశమంతా తిరుగుతూ బాంబులు బట్వాడా చేశాం

twitter-iconwatsapp-iconfb-icon
దేశమంతా తిరుగుతూ బాంబులు బట్వాడా చేశాం

స్వాతంత్య్ర పోరాట చరిత్రలో నమోదుకాని యోధులు, త్యాగధనులు ఎందరో.! అందులో ఒకరు రాంపిళ్ళ నరసాయమ్మ. విజయవాడకు చెందిన వీరి కుటుంబం జాతీయోద్యమంలో సాహసోపేతమైన పాత్ర పోషించింది. భర్త చాటు భార్యగా స్వాతంత్ర్యోద్యమ క్షేత్రంలోకి అడుగుపెట్టినా, ఆపై తీర్థయాత్రలపేరుతో దేశమంతా తిరుగుతూ బాంబులు బట్వాడా చేసిన ధీర నరసాయమ్మ. స్వాతంత్య్ర భారతాన్ని ఆకాంక్షించినందుకు జైలు నిర్బంధాన్నీ అనుభవించారు. 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా... ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుసలిపిన నరసాయమ్మను ‘నవ్య’ పలకరించింది. అప్పుడు ఆమె పోరాట స్మృతులను, జ్ఞాపకాలను చెప్పుకొచ్చారిలా...


  స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాలు చూస్తుంటే, నాకు 1947, ఆగస్టు 14 అర్థరాత్రి నాటి జ్ఞాపకాలు కళ్లముందు మెదులుతున్నాయి. ఆ వేళ యువతీ, యువకుల ఆనందోత్సాహాలతో, పిల్లల కేరింతలతో బెజవాడ వీధులన్నీ కళకళలాడాయి. రోడ్డు మీద ఎక్కడ చూసినా జాతరకు మల్లే జనసందోహమే.! ప్రతి ఒక్కరిలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే సంతోషమే.! ఇదంతా నాకు నిన్నగాక మొన్న జరిగినట్టే ఉంది. 


భారతదేశానికి పట్టిన ఆంగ్లేయుల పీడ వదిలిపోవాలని పోరాడిన కొన్నివేలమందిలో నేనూ ఒకరిని అయినందుకు గర్విస్తున్నాను. పెద్దగా చదువుకోని నేను, స్వాతంత్య్ర పోరాటంలో నా భర్త సర్దార్‌ రాంపిళ్ళ సూర్యనారాయణతో కలిసి నడిచాను. సాయుధ దళాలకు పరోక్షంగా సహాయపడ్డాను. ఆ కారణంగా కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించాను. కృష్ణా జిల్లా కొత్తపేటలోని ఓ హమాలీ ఇంట పుట్టిన నేను స్వాతంత్ర్యోద్యమంలోకి ఎలా వెళ్లానంటే...మా తాత (మాతామహుడు) సయ్యద్‌ రాంపిళ్ళ అప్పలస్వామి వందేళ్ల కిందటే బెజవాడ హమాలీ సంఘాలకు నాయకుడు. పైగా ఆయన పెద్ద పహిల్వాను కూడా. ఎలుగుబంటితో పోరాడి గెలిచినందుకు, ఒక సాహెబులాయన మా తాతకు ‘సయ్యద్‌’ అనే బిరుదు ఇచ్చాడు. అలా ఆయన పేరు సయ్యద్‌ అప్పలస్వామి అయింది. కూలీల హక్కుల కోసం బ్రిటీషు ప్రభుత్వంతో ఎన్నోసార్లు కొట్లాడారు. అప్పట్లోనే కొత్తపేటలో ‘కార్మిక ధర్మ గ్రంథాలయం’ ప్రారంభించారు. తర్వాత కాలంలో జాతీయోద్యమానికి అదొక కేంద్రం అయింది. భగత్‌సింగ్‌ ఉద్యమ సహచరుడు ఒకరు (అతని పేరు గుర్తులేదు)కొన్నాళ్లు అక్కడే తలదాచుకున్నాడు కూడా.! కూలీలకు తలలో నాలుకలా ఉండే మా తాతయ్య, తన కొడుకు సూర్యనారాయణ(నా భర్త)ను దేశభక్తుడిగా చూడాలని పరితపించేవాడు. 


ఆర్‌ఎస్‌పీ ప్రభావం...

నాకు పదకొండవ ఏటే మా మేనమామ సూర్యనారాయణతో పెళ్లి అయింది. అప్పుడు ఆయనకూ 17ఏళ్లు ఉంటాయి. మా తాతయ్య ప్రోద్బలంతో పదేళ్ల వయసు నుంచే నా భర్త స్వాతంత్ర్యోద్యమ కార్యక్రమాలకు హాజరయ్యేవాడు. తర్వాత తాను బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్‌లో చేరాడు. అక్కడే రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎ్‌సపీ) నాయకుడు కేశవ ప్రసాద్‌ శర్మ వంటి పెద్దల పరిచయంతో సాయుధ పంథా ద్వారా మాత్రమే దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని బలంగా నమ్మాడు. అంతటితో చదువు ఆపేసి, విజయవాడ తిరిగి వచ్చి పూర్తిస్థాయి ఆర్‌ఎ్‌సపీ కార్యకర్తగా స్వాతంత్య్ర పోరాటంలోకి దిగాడు. ఇదంతా 1943కి ముందు మాట. అదే సమయంలో ఆచార్య ఎన్జీ రంగా, భారతీదేవి, భయంకరాచారి వంటి జాతీయోద్యమ నాయకుల రాకపోకలతో మా ఇల్లు సందడిగా ఉండేది. మద్రాసు శాసనసభ మీద పొగబాంబులు విసిరిన వాళ్లలో నా భర్త కూడా ఒకరు. నేతాజీ సుభాష్‌ చంద్రబో్‌సతోనూ ఆయనకు మంచి సంబంధాలుండేవి. బోస్‌ను సుంకర సత్యనారాయణ అనే వ్యక్తి ద్వారా ఏలూరులోని ఒక స్వాతంత్య్ర సమరయోధుడి(అతని పేరు జ్ఞాపకం రావడం లేదు. కానీ వాళ్ల అబ్బాయి బాల సుబ్బారావు తర్వాత ఎంపీగా చేశాడు) వద్దకు తీసుకెళ్లడంలోనూ సూర్యనారయణ ప్రధాన పాత్ర పోషించాడు. దేశమంతా తిరుగుతూ బాంబులు బట్వాడా చేశాం

బాంబులు తయారు చేస్తూ...

విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఈశాన్య భాగంలోని విద్యాధరపురం కొండ మీద నా భర్త నాయకత్వంలో సుమారు నలభై మంది బృందం కలిసి బాంబులు తయారుచేసేవాళ్లు. ఇరుగుపొరుగుకి అనుమానం రాకుండా, వాళ్లంతా గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి అక్కడికి వెళుతున్నట్లుగా నమ్మబలికేవారు. దాంతో పోలీసులూ అటువైపు వచ్చేవాళ్లు కాదు. అలా బ్రిటీషు దొరల కళ్లుగప్పి, మా వాళ్లు తయారుచేసిన బాంబులను నా భర్త ట్రంకు పెట్టెల్లో నా పట్టుచీరల కింద దాచేవాడు. వాటిని  తీసుకొని, ఇద్దరం కలిసి తీర్థయాత్రల పేరుతో ఒక్కోప్రాంతానికి వెళ్లి, ఆర్‌ఎ్‌సపీ కార్యకర్తలకు అందించేవాళ్లం. అలా ఒకటా, రెండా...కాశీ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని నెలల తరబడి ఆయన వెంట ప్రయాణించాను. ఒక్కోసారి పడవల్లో పెట్టి మరీ బాంబులను ఇతర ప్రాంతాలకు బట్వాడా చేసిన రోజులున్నాయి. ఇలా వేర్వేరు ప్రాంతాల్లోని స్వాతంత్ర్యోద్యమకారులకు బాంబులను చేరవేయడంలో ఆయనతో పాటు నేనూ కీలకంగా పనిచేశాను.! అయినా, నాకెన్నడూ భయమేయలేదు. 


నన్ను హింసించారు...

మిగతా రోజుల్లో... నా భర్త స్వాతంత్య్ర పోరాటంలో తిరుగుతూ ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడెళతాడో తెలిసేది కాదు. పోలీసులు మాత్రం ఎప్పుడూ మా ఇంటిమీద ఓ కన్నేసి ఉంచేవాళ్లు. ఒక్కోసారి అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఇంటి తలుపులు దబదబ బాదిమరీ, భయపెట్టేవాళ్లు. ఇక సోదాలంటే షరామామోలే.! కొన్ని కుట్రకేసుల్లోనూ ఆయన నిందితుడు కావడంతో, ఒకరోజు రాత్రి ఇంటికొచ్చి ‘మీ ఆయన ఎక్కడ’ అని పోలీసులు నన్ను నిలదీశారు. ‘ఏమో నాకు తెలియదు’ అని బదులిచ్చాను. ‘అలాగా! అయితే, నడువు’ అంటూ నన్ను విజయవాడ సబ్‌ జైలుకి తీసుకెళ్లి యక్ష ప్రశ్నలతో హింసించారు. అయినా, నేను నోరు విప్పలేదు. అప్పుడు నాకు నాలుగేళ్ల అమ్మాయి, పాలుతాగే పసోడు ఉన్నారు. అయినా, కనికరం చూపకుండా 42రోజులు నన్ను జైల్లోనే బంధించారు. 


జైల్లోనే బిడ్డను కన్నాను...

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా, గోవా, పాండిచ్చేరీలు ఇంకా పరాయి పాలనలోనే మగ్గటాన్ని సహించలేకపోయాను. ఇద్దరు పిల్లలను ఇంట్లో వదిలి, నిండు గర్భిణీతో ఉన్న నేను గోవా విముక్తి పోరాటంలో పాల్గొన్నాను. అక్కడే నా భర్తతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తూ పోర్చుగీసు పోలీసులకు దొరికాం. దాంతో మమ్మల్ని అరెస్టు చేసి గోవా జైల్లో బంధించారు. అరెస్టు అయిన, పదిరోజులకు అంటే, 1958, ఏప్రిల్‌10వ తేదీన  జైల్లోనే మగబిడ్డను ప్రసవించాను. లోక్‌నాయక్‌ మీద ఉన్న అభిమానంతో మా అబ్బాయికి జయప్రకాష్‌ అని పేరు పెట్టాం. ఆరునెలల వరకు జైల్లోనే పసిబిడ్డతో నరకయాతన అనుభవించాను. ఇదంతా నేను నా భర్త కోసం చేయలేదు. నా దేశానికి స్వాతంత్య్రం రావాలనే ఆకాంక్షతోనే పోరాటంలో పాల్గొన్నాను.తద్ఫలితంగా నన్ను భారత ప్రభుత్వం తర్వాత స్వాతంత్య్ర సమరయోధురాలిగా గుర్తించింది. నా భర్త పోరాట స్ఫూర్తిని గుర్తించిన కొందరు పెద్దలు ఆయన్ను ‘సర్దార్‌’ బిరుదుతో సత్కరించారు. నన్ను ‘విజయవాడ ఉక్కు మహిళ’ అనేవాళ్లు. 


జమ్మూ యోధురాలికి సాయం...

అఖిల భారత స్వాతంత్య్ర సమరయోధుల సంఘం కార్యవర్గ సభ్యురాలిగా పని చేశాను. తన తల్లికి పింఛను రావడం లేదని ఓ స్వాతంత్య్ర సమరయోధురాలి కూతురు ఫోన్‌ ద్వారా నన్ను సంప్రదించారు. ఒక్కరోజులో పరిష్కరించాను. 


ఇప్పటి పరిస్థితులు...

ఇప్పుడు నా వయసు 94ఏళ్లు. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఆరోగ్యసమస్యలంటూ ఏమీ పెద్దగా లేవు. కాకపోతే, జ్ఞాపకశక్తి బాగా తగ్గింది. భాగవత, రామాయణాలు వినడం, చదవడంతో కాలక్షేపం అవుతుంది. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే, అసలు స్వాతంత్య్రం ఎవరికుంది అనిపిస్తుంది. ఆడపిల్లలమీద అఘాయిత్యాల గురించి విన్నప్పుడల్లా, ఇదేనా మేమంతా ఆనాడు పోరాడి సాధించిన స్వాతంత్య్రమని బాధేస్తుంటుంది.దేశమంతా తిరుగుతూ బాంబులు బట్వాడా చేశాం

స్వాతంత్య్ర పోరాటంలో నాది నాయకత్వ స్థానం కాకపోవచ్చు. కానీ సూర్యనారాయణ భార్యగా కాకుండా, నిబద్ధత కలిగిన ఓ కార్యకర్తగా ఉద్యమంలో పనిచేశాను. కుటుంబ పెద్దను దేశానికి అప్పగించి, ఓ ఇల్లాలుగా ఇంటి బాధ్యతను భుజాన వేసుకోవడమంటే మాటలు కాదు. అదొక పెద్ద పోరాటం.


నమోదుకాని మా పోరాట చరిత్ర....

మా కుటుంబమంతా స్వాతంత్ర్యోద్యమానికి, హమాలీ హక్కుల ఉద్యమానికి అంకితమైంది. కానీ ఆ జ్ఞాపకాలను మా వాళ్లెక్కడా నమోదు చేయలేదు. ఉద్యమ రహస్యాలను ప్రాణం పోయినా, పెదవి దాటనివ్వకూడదని పోరాట సమయంలో వాగ్ధానం చేయడమే అందుకు కారణం. మా తాతయ్య బతికుండగానే, ఆయన అభిమానులంతా కలిసి కాళేశ్వరం మార్కెట్‌ వద్ద విగ్రహం ఏర్పాటుచేశారు. దాన్ని ఆనాటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు ఆవిష్కరించారు. ఇప్పటికి బెజవాడలోని చాలామంది హమాలీలు, కార్మికులు మా తాతయ్యను దైవంతో సమానంగా ఆరాధిస్తారు. హమాలీల పిల్లల అభ్యున్నతి కోసం నా భర్త 1974లో విద్యాధరపురంలోనే సయ్యద్‌ అప్పలస్వామి జూనియర్‌, డిగ్రీ కాలేజీని ప్రారంభించాడు. ఆయన తదనంతరం మా చిన్నబ్బాయి జయప్రకాశ్‌ ఆ బాధ్యతలు చూస్తున్నాడు. దాంతో పాటు గాంఽధేయ మార్గాన్ని ప్రచారం చేస్తున్నాడు. మహాత్ముడికి ఆలయం కట్టి, కళాశాల విద్యార్థులకు ప్రతియేటా 21రోజుల పాటు గాంధీ దీక్షలను ఇస్తుంటాడు. 


కె. వెంకటేశ్‌

ఫొటో: చందన వెంకట గంగాధర్‌, విజయవాడ

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

రెడ్ అలర్ట్Latest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.