ఎప్పటి వరకూ ఎదురుచూడాలి.. మాకు ఐపీఎల్ కావాలి: మిథాలీ

ABN , First Publish Date - 2020-03-26T22:50:10+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా

ఎప్పటి వరకూ ఎదురుచూడాలి.. మాకు ఐపీఎల్ కావాలి: మిథాలీ

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ఐపీఎల్‌ను నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. తొలుత ఐపీఎల్‌ను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసినప్పటికీ.. ఆ తర్వాత కూడా టోర్నమెంట్ జరుగుతుందనే విషయం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది పురుషులతో పాటు మహిళలకు కూడా ఐపీఎల్ నిర్వహించాలని తొలుత ఐపీఎల్ కౌన్సిల్ భావించింది. కానీ, వైరస్ కారణంగా మొత్తానికే ఐపీఎల్ వాయిదా పడటంతో మహిళా క్రికెటర్లలో కూడా కాస్త నిరుత్సాహం నెలకొంది. 


అయితే దీనిపై టీం ఇండియా మహిళ వన్డే జట్టు కెప్లెన్ మిథాలీ రాజ్ స్పందించింది. కనీసం వచ్చే ఏడాది అయినా సరే తమకు ఐపీఎల్ నిర్వహించాలని మిథాలీ ఐపీఎల్ కౌన్సిల్‌ని కోరింది. ‘‘వచ్చే ఏడాది అయినా మహిళల ఐపీఎల్ నిర్వహించాలనేది నా కోరిక. చిన్నపాటి మార్పులతో అయినా సరే. పురుషల ఐపీఎల్‌లోలా కాకుండా మొదటి ఎడిషన్‌లో జరిగిన విధంగా ఐదు లేదా ఆరుగురు విదేశీ ఆటగాళ్లతో నిర్వహిస్తే మంచిది’’ అని మిథాలీ ఓ ప్రముఖ క్రీడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 


2019 ఐపీఎల్‌ సమయంలో ట్రయల్‌బ్లేజర్స్, సూపర్‌నోవాస్, వెలాసిటీ అంటూ మూడు జట్లను ఏర్పాటు చేసి మహిళల ఐపీఎల్ నిర్వహించారు.  అయితే ఈ ఏడాది మరో జట్టును అదనంగా జత చేసి పూర్తిస్థాయిలో టోర్నమెంట్ నిర్వహించాలని కౌన్సిల్ భావించింది. పురుషుల ఐపీఎల్‌ విధంగా ప్లేఆఫ్స్ ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌ కూడా నిర్వహించాలని అనుకున్నారు. కానీ అది కాస్త రద్దు అయింది. ఇండియాలో తగినంతమంది మహిళ క్రికెటర్లు లేరు. కానీ, ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు తలచుకుంటే మహిళల ఐపీఎల్ నిర్వహించడం పెద్ద కష్టమైన పనేమీ కాదనేది మిథాలీ అభిప్రాయపడింది.


‘‘మనవద్ద తగినంత బలం లేదనే విషయం నాకు తెలుసు. కానీ ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీలు తలచుకుంటే అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. వాళ్లు ముందు ప్రక్రియను మొదలుపెడితే బీసీసీఐ నాలుగు జట్లను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం మేము ఎప్పటికీ ఎదురుచూస్తూ కూర్చోలేము. ఎవరో ఒకరు అడుగు ముందుకు వేయాలి. అలా మొదలైతేనే క్రమక్రమంగా లీగ్‌కి ప్రాముఖ్యత పెరుగుతుంది’’ అని మిథాలీ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-03-26T22:50:10+05:30 IST