వాయు కాలుష్యం: ఢిల్లీ సర్కారుపై Supreme Court మండిపాటు

ABN , First Publish Date - 2021-11-15T17:47:52+05:30 IST

ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడింది.

వాయు కాలుష్యం: ఢిల్లీ సర్కారుపై Supreme Court  మండిపాటు

న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపర్చడానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఢిల్లీలో కాలుష్యం తగ్గించాలని మేం కోరుకుంటున్నాం, మీరు వేసే ప్రతి అడుగులో మీకు సలహా ఇవ్వడానికి మేం ఇక్కడ లేం, మీరు కాలుష్య కారక పరిశ్రమలు, వాహనాలను ఎలా నియంత్రిస్తారన్నది మీ సమస్య’’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ వ్యాఖ్యానించారు. దేశ రాజధాని నగరంలోని వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కారు కుంటిసాకులు చెపుతుందని, రాష్ట్రప్రభుత్వం వసూలు చేస్తున్న ఆదాయాలపై ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది.


కొన్ని ప్రాంతాల్లో చెత్తను తగులబెట్టడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు నిర్ధారించింది. కేంద్రప్రభుత్వం ఢిల్లీ సర్కారుతో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి రేపటి సాయంత్రంలోగా కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. ఏయే పరిశ్రమలను ఆపవచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించవచ్చు, ఏ విద్యుత్ ప్లాంట్లను నిలిపి వేయవచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్‌ను ఎలా అందించాలనే దానిపై రేపు సాయంత్రంలోగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది.కాలుష్యంపై ఢిల్లీ మున్సిపల్ కమిషనరుకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది. 



ఢిల్లీలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టుకు కేంద్రం మూడు దశలను సూచించింది. బేసి-సరిసంఖ్యల వాహన పథకాన్ని ప్రవేశపెట్టడం, ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడం, లాక్‌డౌన్ విధించడం లాంటివి చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది.

Updated Date - 2021-11-15T17:47:52+05:30 IST