కరోనా బాధితుల కోసం ‘మీ వెంట మేమున్నాం’..

ABN , First Publish Date - 2021-05-18T05:04:33+05:30 IST

కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులలో, వైరస్‌తో బాధ పడుతున్న వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ (సీఆర్‌పీఎఫ్‌) సైకాలజీ విభాగం సైకాలజిస్టులు ‘మీ వెంట మేమున్నాం’ అంటూ టెలిఫోన్‌ హెల్ప్‌లైన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కరోనా బాధితుల కోసం ‘మీ వెంట మేమున్నాం’..
కార్యక్రమంలో పాల్గొన్న మేయర్‌ హరి వెంకటకుమారి, గొండు సీతారామ్‌, తదితరులు

సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో మానసిక స్థైర్యాన్ని ఇవ్వనున్న సైకాలజిస్టులు

ఆరిలోవ, మే 17: కరోనా బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులలో, వైరస్‌తో బాధ పడుతున్న వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ (సీఆర్‌పీఎఫ్‌) సైకాలజీ విభాగం సైకాలజిస్టులు ‘మీ వెంట మేమున్నాం’ అంటూ టెలిఫోన్‌ హెల్ప్‌లైన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని పెదగదిలిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మేయర్‌ హరి వెంకటకుమారి, సీఆర్‌పీఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ గొండు సీతారామ్‌లు ప్రారంభించారు. అనంతరం మేయర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ ప్రభావంతో అన్ని వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతుండడం విచారకరమన్నారు. ఇలాంటి కష్టకాలంలో సీఆర్‌పీఎఫ్‌ సైకాలజిస్టులు కరోనా బాధితులకు మానసిక స్థైర్యాన్ని అందించేందుకు ముందకు రావడం హర్షణీయమన్నారు. గొండు సీతారామ్‌ మాట్లాడుతూ సైకాలజిస్టులతో మాట్లాడే అవకాశాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందుకోసం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు , మళ్లీ సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు డాక్టర్‌ ఎన్‌.సీతారామకృష్ణారావును 8674618480 సెల్‌ నంబర్‌లో సంప్రదించవచ్చునన్నారు. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు వరకు డాక్టర్‌ ఎం.కల్యాణిని 8096865466  సెల్‌ నంబర్‌లో, కె.జగ్గారావును ఉదయం తొమ్మిది నుంచి 11 వరకు, మళ్లీ సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు 9391431411 సెల్‌ నంబర్‌లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరమ్‌ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి  బి.శకుంతల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:04:33+05:30 IST