మనం.. మన పరిశుభ్రత

ABN , First Publish Date - 2020-05-29T09:59:43+05:30 IST

ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ వస్తున్నాయి. వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నాయి.

మనం.. మన పరిశుభ్రత

రూటు మారిన ‘చెత్త నుంచి సంపద కేంద్రం’ 

ప్రజా భాగస్వామ్యంతో పారిశుధ్య నిర్వహణ

పైలట్‌ ప్రాజెక్టుగా మండలానికి రెండు పంచాయతీల ఎంపిక 


(ఇచ్ఛాపురం రూరల్‌):ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ వస్తున్నాయి. వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నాయి. కానీ నిర్వహణ లోపం, నిధుల కొరత తదితర కారణాలతో పథకాలు నీరుగారుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజా భాగస్వామ్యంతో, వారి నుంచే నిధులు సమీకరించి ‘మనం- మన పరిశుభ్రత’ పేరిట సరికొత్త పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.  ప్రతి కుటుంబం నుంచి రోజుకు రూ.2 వసూలు చేసి పారిశుధ్యం, పచ్చదనం పనులకు వెచ్చించనుంది. ముందుగా మండలానికి రెండు గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా యంత్రాంగం 76 పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. 


చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినా.. జిల్లాలో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేదు. కనీసం ఎస్‌డబ్ల్యూఎం షెడ్ల నిర్వహణ కు ఏర్పాటు చేసిన గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు చెల్లించలేని పరిస్థితి పంచాయతీల్లో నెలకొంది. ఈ క్రమంలో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ అంతంతమాత్రంగా ఉంది. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘మనం- మన పరిశుభ్రత’ పేరిట గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యంతో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని నిర్ణయించింది.


ప్రధానంగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణను వారి భాగస్వామ్యంతో చేపట్టేందుకు పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేయనుంది.  ఈ మేరకు ఈ పథకం కింద మండలానికి రెండు పంచాయతీలను పైలెట్‌ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో 38 మండలాల్లో 1,140 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 76 పంచాయతీలను ఎంపిక చేసి కార్యక్రమం అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా వీటిని సంపూర్ణ ఓడిఎఫ్‌గా తీర్చదిద్దనున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ స్థాయిల్లో అధికారులు సదస్సులు నిర్వహించనున్నారు. 


అమలు విధానం ఇలా.. :

గతంలో మాదిరిగానే పారిశుధ్య కార్మికులు(గ్రీన్‌ అంబాసిడర్లు) ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను తీసుకొచ్చి ఎస్‌డబ్ల్యూఎం షెడ్లకు తరలిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఎంపిక చేసిన గ్రామాల్లో ఉత్సాహం కలిగిన వలంటీర్‌ ఒకరిని ఎంపిక చేస్తారు. అతనితో పాటు గ్రామ పెద్దలలో ఒకరిని ఎంపిక చేస్తారు. వీరిద్దరి పేరు మీద ఒక బ్యాంక్‌ అకౌంట్‌ను తీసుకుంటారు. ప్రతి ఇంటి నుంచి రోజుకు రూ. 2 చొప్పున ప్రతి నెలా రూ.60 వసూలు చేస్తారు. ఈ మొత్తాన్ని ఆ బ్యాంక్‌ అకౌంట్‌లో వేసి వాటి నుంచి గ్రీన్‌ అంబాసిడర్లకు నెలవారీ జీతాలు చెల్లిస్తారు. ఒక  గ్రామంలో ఉన్న ఇతర వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి తడి, పొడి చెత్త ఏ విధంగా వేరు చేసి వేయాలో సంబంధిత కుటుంబాల వారికి అవగాహన కల్పిస్తారు.


ఈ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షిస్తారు. ప్రతి సోమవారం ఎంపీడీవో, ఈవోపీఆర్డీలు మండలంలో ఎంపిక చేసిన గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో చెత్త సేకరణపై గ్రామ ప్రజల్లో వస్తున్న చైతన్యం, చెత్త సేకరణకు సంబంధించి వసూళ్లు ఏవిధంగా ఉన్నాయనే విషయాలపై సమీక్షిస్తారు. నెలకోసారి జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో సమీక్ష నిర్వహిస్తారు. ఆరు నెలలపాటు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తారు. దీని ఫలితాలను బట్టి జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.


అవగాహన కల్పిస్తున్నాం ..  రవికుమార్‌, డీపీవో, శ్రీకాకుళం.

పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన పంచాయతీల్లో చెత్త సేకరణకు సంబంధించి వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చెత్త సేకరణకు అవసరమైన రిక్షాలు, పవర్‌ ఆటోలను సిద్ధం చేశాం. త్వరలోనే ఈ ప్రాజెక్టును జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం.


Updated Date - 2020-05-29T09:59:43+05:30 IST