Price Rise : ద్రవ్యోల్బణం లేదనడం లేదు : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-08-03T01:56:00+05:30 IST

మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అన్ని అంశాలు పటిష్టంగా ఉన్నాయని

Price Rise : ద్రవ్యోల్బణం లేదనడం లేదు : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అన్ని అంశాలు పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) రాజ్యసభకు మంగళవారం చెప్పారు. ధరల పెరుగుదల గురించి ప్రభుత్వం తిరస్కార ధోరణిని ప్రదర్శిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. ద్రవ్యోల్బణం లేదని తాము చెప్పడం లేదన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు (RBI), కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల ద్రవ్యోల్బణం రేటు 7 శాతం వద్ద ఉందన్నారు. 


నిరుద్యోగం (Unemployment), డిమాండ్-సరఫరా (Demand and Supply), వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానం, అంతర్గత వాణిజ్యం వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తి (GDP), ఉద్యోగిత రేటు, బిజినెస్ సైకిల్ దశలు, ద్రవ్యోల్బణం రేటు, నిధుల సరఫరా, ప్రభుత్వ రుణ స్థాయి, వీటన్నిటిలోనూ దీర్ఘకాలిక, స్వల్పకాలిక మార్పులు వంటివాటినిబట్టి ఆర్థిక వ్యవస్థ పని తీరును అంచనా వేస్తారు. 


ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు మంగళవారం డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదల ప్రభావం పేదలపై తీవ్రంగా ఉంటోందని తెలిపాయి. ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశాయి. దీనిపై బీజేపీ స్పందిస్తూ, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల ధరల పెరుగుదల సమస్య ఉత్పన్నమవుతోందని తెలిపింది. ఈ పరిణామాలు ఏ దేశం నియంత్రణలోనూ లేవని పేర్కొంది. 


బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ (Prakash Jawadekar) రాజ్యసభలో స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ, ధరల పెరుగుదల ప్రతి ఒక్కరినీ బాధిస్తోందని చెప్పారు. దీనిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) యుద్ధం, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో సరఫరాల వ్యవస్థ దెబ్బతిందని చెప్పారు. ఆహారం, ఇంధనం ధరలు పెరగడానికి ఇదే కారణమని తెలిపారు. ఇది ఏ దేశం నియంత్రణలోనూ లేని అంశమని చెప్పారు. భారత దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ధరలు పెరిగాయని చెప్పారు. ద్రవ్యోల్బణం 7 శాతం వద్ద ఉందని, యూపీఏ ప్రభుత్వ హయాంలో మాదిరిగా రెండు అంకెల స్థాయికి చేరలేదని అన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఈ చర్చ జరిగింది. 


Updated Date - 2022-08-03T01:56:00+05:30 IST