ప్రజల్లో తిరగలేకున్నాం..

ABN , First Publish Date - 2022-07-05T07:30:29+05:30 IST

జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన సోమవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు చెందిన జిల్లా వ్యవసాయాధికారులు ప్రగతి నివేదికను సభకు వినిపించారు. ఈ సందర్భంగా టీడీపీ ..

ప్రజల్లో తిరగలేకున్నాం..
జడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు

ఏ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం

గడపగడపలో తిడుతున్నారు

పల్లెల్లో ఏం జరుగుతోందో సీఎం దృష్టికి తీసుకెళ్లండి

రైతుభరోసా కేంద్రాలు కట్టించలేం

జడ్పీ సమావేశంలో వైసీపీ జడ్పీటీసీ సభ్యుల ఆవేదన


‘‘ప్రజల్లో తిరగలేకున్నాం.. ఏ కార్యక్రమం చేయలేకపోతున్నాం. ఏంచేశారో చెప్పమంటున్నారు. గడపగడపలో తిడుతున్నారు. పల్లెల్లో ఏమి జరుగుతా ఉందో ముఖ్యమంత్రి దృష్టికితీసుకెళ్లండి. రైతు భరోసా కేంద్రాలు కట్టించడం మావల్లకాదు. ఓటీఎస్‌ చేయించిన వారికి రిజిస్ట్రేషన్‌ చేయడంలేదు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడంలేదు. చందాలు వేసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నాం. సోలార్‌ ప్రాజెక్టుకు కేటాయించిన డాట్‌ ల్యాండ్‌ భూములకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు గొడవచేస్తున్నారు. ఉపాధి కూలీలకు 4 నెలల నుంచి పేమెంట్‌ జరగలేదు’’ అంటూ పలువురు వైసీపీ జడ్పీటీసీ సభ్యులు జడ్పీ సమావేశ వేదికపై ఉన్న అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులకు తమ ఆవేదన వినిపించారు. సోమవారం జరిగిన జడ్పీ సమావేశంలో అధికార పార్టీ నేతలే బాధితుల్లా మాట్లాడారు. 


కడప (రూరల్‌), జూన్‌ 4:  జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన సోమవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు చెందిన జిల్లా వ్యవసాయాధికారులు ప్రగతి నివేదికను సభకు వినిపించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీలు బీటెక్‌ రవి, శివనాఽథరెడ్డి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన విద్యుత్‌ మోటార్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడితే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌లో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. హార్టికల్చలో బత్తాయికి మాత్రమే ఇన్సూరెన్స్‌ ఇస్తున్నారని అలాగే అరటి, బొప్పాయి పంటలను కూడా ఇందులో చేర్చాలన్నారు. రోడ్లు భవనాలశాఖ చర్చలో భాగంగా సంబంధిత అధికారి ప్రగతి నివేదికను వివరించారు. టీడీపీ ఎమ్మెల్సీ శివనాథరెడ్డి జమ్మలమడగు, ముద్దరూరు రోడ్డులో దెబ్బతిన్న బ్రిడ్జి పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ప్రశ్నించారు. బీమఠం, చక్రాయపేట, వీఎన్‌ పల్లె, రామాపురం జడ్పీటీసీ సభ్యులు తమ ప్రాంతాల్లోని అధ్వాన్న రోడ్ల గురించి వివరించారు.


రైతు భరోసాకేంద్రాలు కట్టించలేం

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ చర్చలో భాగంగా సంబంధిత అధికారి ప్రగతి నివేదికను తెలియపరిచారు. అనంతరం జేసీ సాయికాంత్‌ వర్మ మాట్లాడుతూ సచివాలయాలు, ఆర్‌బీకే కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ల భవన నిర్మాణాలను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయడానికి జడ్పీటీసీలు సహకరించాలన్నారు. ఈ విషయంపై వీఎన్‌ పల్లె జడ్పీటీసీ మాట్లాడుతూ బిల్డింగ్‌ కాస్ట్‌ రూ.40 లక్షలు సరిపోదని రూ.45లక్షలకు పెంచాలన్నారు. పెంచే విషయం అటుంచాలని జేసీ అనగానే వీఎన్‌పల్లె, బి.మఠం తదితర జడ్పీటీసీ సభ్యులు, గాలివీడు ఎంపీపీ ‘‘మీరు చేప్పేది బాగుంది.. ఇప్పటికే ఒక యూనిట్‌ ధర రూ.18 వేల నుంచి రూ.30 వేలు అయింది. టన్ను స్టీల్‌ రూ.35 వేల నుంచి రూ.80వేలు అయింది. ఇసుక కష్టాలు వేధిస్తున్నాయి. సిమెంట్‌ ధరలు పెరిగాయి. ఎలా కట్టాలో మీరే చెప్పండి.  చేతులు కాల్చుకొని చేసేవారు ఎవరూలేరు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే స్థితిలో మేము లేము. 2022 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం నిర్ణయించి సిమెంట్‌ సప్లయ్‌చేసి, శాండ్‌ అందిస్తే సహకరిస్తాం. లేదంటే మా నింటి కాదు’’ అన్నారు. ఇదే విషయంపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ కనీసం రూ.45 లక్షలకు పెంచాలన్నారు.


సీపీడబ్ల్యుఎస్‌ స్కీంలపై జడ్పీటీసీ సభ్యుల ధ్వజం

జిల్లాలో నడుస్తున్న సీసీడబ్ల్యుఎస్‌ స్కీంలపై పలువురు జడ్పీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. ఈ స్కీంల ద్వారా తాగునీటి సరఫరా సక్రమంగా జరగడంలేదని దీంతో కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్నారు. వీటికి కేటాయించే నిధులు గ్రామపంచాయతీలకు కేటాయిస్తే మంచినీటి సరఫరా సజావుగా సాగుతుందన్నారు. బి.మఠం ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ తమ పరిధిలోని ిసీపీడబ్ల్యుఎస్‌ స్కీంకోసం ఇప్పటివరకు దాదాపు రూ.24 కోట్లు కేటాయించారని అయినా ఏ ఒక్క గ్రామానికి సరిగా నీటిని సరఫరా లేదన్నారు. పైగా ప్రతి ఏడాది మెయింటెనెన్స్‌ కోసం రూ.50 లక్షలుఖర్చు చేస్తున్నారన్నారు. దీనిపై ఇతర శాఖల అధికారులతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కలెక్టర్‌కు తెలిపారు. ఎమ్మెల్సీ శివనాఽథరెడ్డి మాట్లాడుతూ మైలవరంలో సీపీఎస్‌ డబ్ల్యు స్కీం సక్రమంగా జరగడంలేదన్నారు. గాలివీడు ఎంపీపీ మాట్లాడుతూ సోలార్‌ ప్రాజెక్టుకు డాటెడ్‌ ల్యాండ్‌ భూములు ఇచ్చిన బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే క్లియర్‌ చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు చేయడంలేదన్నారు. ఈ విషయమై కలెక్టర్‌ మాట్లాడుతూ సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధించిన పైల్స్‌ 10వ తేదీలోపు క్లియర్‌ చేసి అన్నమయ్య జిల్లాకు పంపుతామన్నారు. చెన్పూరు ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో కేసీ కాలువ తీరు అధ్వాన్నంగా ఉందన్నారు. చందాలు వేసుకుని పనులు చేసుకుంటున్నామన్నారు. అనంతరం డ్వామా, ఐసీడీఎస్‌, నీటి వనరుల శాఖ, విద్య, వైద్యం తదితర శాఖలపై సమీక్షించారు. జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపి రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిద్దేందుకు అందరం సమష్ఠిగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్‌ ఎమ్మెల్యే సుధాతో పాటు పలువురు జడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు. కాగా.. సర్వసభ్య సమావేశానికి ఎంపీలు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, మిఽథున్‌రెడ్డితో పాటు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి హాజరుకాలేదు. 

Updated Date - 2022-07-05T07:30:29+05:30 IST