అంతా మా ఇష్టం..!

ABN , First Publish Date - 2021-02-25T04:28:59+05:30 IST

పొదిలి నగర పంచాయతీలో అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేకుండా అపార్టుమెంట్లు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. ఈ వ్యవహారాలు ఇబ్బడిముబ్బడిగా చేపడుతున్నా నగర పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారు.

అంతా మా ఇష్టం..!

ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలు

అనుమతులున్నవి స్వల్పం

ఉన్న వాటిల్లోనూ నిబంధనలు గాలికి

చోద్యం చూస్తున్న నగర పంచాయతీ అధికారులు


జిల్లా నడిబొడ్డున పొదిలి.. ఆపై నగర పంచాయతీ హోదా.. దీనికితోడు రకరకాల ప్రచారహోరు... ఇంకేముంది, రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ఊకదంపుడు ప్రచారం చేస్తూ వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేసి ప్రజలకు అంటగడుతూ లక్షలకు లక్షల రూపాయలు పోగేసుకుంటున్నారు. పైపెచ్చు అనుమతి లేకుండా కొన్ని, అనుమతి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా ఇంకొన్ని వెంచర్లు వేసి హాట్‌ కేకుల్లా విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే, అపార్టుమెంట్లను సైతం అనుమతిచ్చిన ప్లాన్‌ను తుంగలోతొక్కి నిర్మిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. పెద్ద ఎత్తున ఈ రెండు వ్యవహారాలు నడుస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


పొదిలి, ఫిబ్రవరి 24 : పొదిలి నగర పంచాయతీలో అక్రమ లేఅవుట్లు, అనుమతులు లేకుండా అపార్టుమెంట్లు ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు.  ఈ వ్యవహారాలు ఇబ్బడిముబ్బడిగా చేపడుతున్నా నగర పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారు. అనుమతులు లేకుండా పొలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి తోడు తెలిసీ తెలియక ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు అందులో భవన నిర్మాణాలు చేపట్టేందుకు నగర పంచాయతీ ప్లాన్‌ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసిన సమయంలో అదనంగా 14 శాతం డెవల్‌పమెంట్‌ చార్జీల కింద చెల్లించాల్సి రావడంతో వారు లబోదిబోమంటున్నారు. అనుమతులు లేకుండా వేసిన అక్రమ లేఅవుట్లలో మౌలిక వసతులు లేక అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి గృహ నిర్మాణాలు చేపట్టిన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. అనుమతి లేని అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకోవాల్సిన నగర పంచాయతీ అధికారులు రెవెన్యూ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడకుండా చోద్యం చూస్తున్నారు.

అనుమతికి మించి కట్టడాలపై చోద్యం

పొదిలి నగర పంచాయతీలో అపార్టుమెంట్‌ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయినా అధికారులు కన్నెత్తి చూడడంలేదు. పొదిలిలో ఒంగోలు రోడ్డులో రెండు అపార్టుమెంట్‌లు, దర్శి రోడ్డులో రెండు, పెద్ద బస్టాండ్‌ సమీపంలో రెండు, విశ్వనాథపురంలో ఒకటి చొప్పున అపార్టుమెంట్‌లు ఉన్నాయి. మరికొన్నైతే నిబంధనలకు విరుద్ధంగా అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అవి కాకుండా పట్టణంలో నాలుగు, ఐదుఅంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు వారికి తెలియదన్నట్లుగా వ్యవహరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంతమంది ప్రభుత్వ స్థలాలను దర్జాగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పలు ప్రాంతాలలో అక్రమ లే-అవుట్లు

పొదిలి నగర పంచాయతీ పరిధిలో అక్రమ లేఅవుట్లు వి చ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఒంగోలు రోడ్డు, దర్శి రోడ్డు, మార్కాపురం రోడ్డుకిరువైపులా పదుల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు వెలిశాయి. బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌ సమీపంలో, మా ర్కాపురం అడ్డరోడ్డు, పెట్రోలు బంక్‌ ఎదురు, దర్శి రోడ్డులోని శివాలయం సమీపంలో, ఒంగోలు రోడ్డులోని పాల కేంద్రం వద్ద, డిగ్రీ కాలేజీ సమీపంలో అనుమతి తీసుకోకుండా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. మరికొంతమంది నిర్మాణాలు చేపట్టారు. అదే అదునుగా క్రయవిక్రయాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. వ్యవసాయ భూమిని నిబంధనల మేరకు ఇతర అవసరాలకు మార్పిడి చేసి రహదారులు, పార్కులు, మౌలిక వసతులకు స్థలాన్ని వదలివేసి ప్లాట్లు వేసి విక్రయించాల్సి ఉండగా అలాంటి చర్యలు ఎక్కడా కన్పించలేదు.

Updated Date - 2021-02-25T04:28:59+05:30 IST