మహిళా సాధికారతలో వెనకబడుతున్నాం!

ABN , First Publish Date - 2020-10-08T09:10:58+05:30 IST

మహిళల కోసం చట్టాలు చేస్తున్నా, ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నా వారు పూర్తిగా హక్కులు అనుభవిస్తున్న దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో కనపడట్లేదు..

మహిళా సాధికారతలో వెనకబడుతున్నాం!

మహిళల కోసం చట్టాలు చేస్తున్నా, ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నా వారు పూర్తిగా హక్కులు అనుభవిస్తున్న దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో కనపడట్లేదు. లింగ సమానత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగున ఉంది అని నీతి ఆయోగ్ వారి అభివృద్ధి లక్ష్య సూచీ (SDG) చెప్పింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనలాగే కొత్తగా ఏర్పాటైన చత్తీస్‌గడ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ కంటే మనం దిగువన ఉండటం. అంతేకాదు, దేశంలో మహిళల మీద అత్యధికంగా దాడులు జరిగే ఉత్తర ప్రదేశ్ (NCRB'19) కంటే కూడా మనం దిగువన ఉన్నాం. మహిళలపై నేరాలు దేశంలోని సగటు కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. పిల్లల మీద జరిగే నేరాల్లో ఆడపిల్లల మీద జరిగే నేరాల నిష్పత్తి తెలంగాణలో 90.32%! అలాగే వివాహిత మహిళల్లో 46% మంది భాగస్వామి నుంచే హింస అనుభవిస్తున్నారని తేలింది. దక్షిణాది రాష్ట్రాలు అన్నింటిలోనూ మద్యం వినియోగం తెలంగాణలో ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మద్యపానం మహిళలపై హింసకు ఒక ముఖ్య కారణం. 


ఇంతటి లైంగిక, శారీరక హింసకు కారణాలు లేకపోలేదు. జాతీయ గణాంక కార్యాలయం నివేదిక ప్రకారం దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే గ్రామీణ మహిళలకు అక్షరాస్యత అందించటంలో తెలంగాణ చివర నుండి రెండవ స్థానంలో ఉంది. తదనుగుణంగానే వారు ఆర్థిక స్వాతంత్ర్యం, స్వీయ స్వాలంబనలోనూ వెనుకబడి ఉన్నారు. గ్రామీణ మహిళలు ఎక్కువ శాతంలో పని చేస్తున్నా, పట్టణ మహిళలు అత్యధికంగా నిరుద్యోగులుగా ఉన్నారు. చట్టసభలలో 5% మహిళలే ఉండటం రాష్ట్రంలో మహిళా సమస్యలు ఎంతవరకూ వినిపిస్తున్నాయనటానికి ఒక చిహ్నం. రెండేళ్ళుగా తెలంగాణ మహిళా కమిషన్ నియమించకపోవటం, మహిళా పాలసీ లేకపోవటం కూడా ప్రత్యేకంగా గమనించాల్సిన విషయాలు. రాష్ట్రం మొదటగా మహిళా కమిషన్ నియమించాలి. 2018లో మొదలుపెడతామన్న జెండర్ బడ్జెట్‌ను మొదలుపెట్టాలి. మహిళా భద్రత నుంచి మహిళా సాధికారత వైపు పురోగమించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. 

లక్ష్మీ స్వాతి

‘ఆమె నేస్తం’ ఫౌండర్

Updated Date - 2020-10-08T09:10:58+05:30 IST