ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాం

ABN , First Publish Date - 2022-06-27T09:27:46+05:30 IST

కొన్ని సవాళ్లు ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నా రు.

ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాం

30 ఏళ్లలో రూ.2,352 లక్షల కోట్ల స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థ  జూ కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌


తిర్పూర్‌ (తమిళనాడు): కొన్ని సవాళ్లు ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నా రు. జీడీపీ ఏటా సగటున ఎనిమిది శాతం చొప్పున పెరిగితే ప్రతి తొమ్మిదేళ్లకు భారత ఆర్థిక వ్యవస్థ రెట్టింపు అవుతుందన్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 3.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, వచ్చే 30 సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల డాలర్ల (ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం రేటు ప్రకారం సుమారు రూ.2,352 లక్షల కోట్లు) స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. భారత వృద్ధి అవకాశాలపై అనుమానాలు ఉన్న వ్యక్తులు తిర్పూర్‌ వంటి ప్రదేశాలకు వచ్చి వస్త్ర పరిశ్రమ వంటి రంగాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో చూడాలని గోయల్‌ సూచించారు. 37 సంవత్సరాల క్రితం కేవలం రూ.15 కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేసిన చేసిన తిర్పూర్‌ ప్రస్తుతం రూ.30,000 కోట్ల వస్త్రాలను ఎగుమతి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


ఇంకా ఎదగాలి: ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల టర్నోవర్‌తో ఏటా రూ.3.5 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేస్తున్న భారత వస్త్ర పరిశ్రమ, వచ్చే ఐదేళ్లలో రూ.20 లక్షల కోట్ల టర్నోవర్‌, రూ.10 లక్షల కోట్ల ఎగుమతుల స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని పీయూష్‌ గోయల్‌ కోరారు. ఇందుకోసం దేశంలో తిర్పూర్‌ లాంటి 75 వస్త్ర పరిశ్రమ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Updated Date - 2022-06-27T09:27:46+05:30 IST