తిరిగి.. అలసిపోతున్నాం

ABN , First Publish Date - 2022-08-09T07:01:21+05:30 IST

సమస్యపై స్థానికంగా మండలాఫీసులో అర్జీలిస్తారు. నాలుగైదు సార్లు తిరుగుతారు. ఆ అధికారుల్లో ‘స్పందన’ ఉండదు. సమస్య పరిష్కారం కాదు. దీంతో చిత్తూరు బస్సెక్కి కలెక్టరేట్‌కు వస్తారు. సోమవారం స్పందనలో అర్జీలిస్తారు. ఇక్కడ్నుంచి ఆ అర్జీని మండలాఫీసుకు పంపించి.. సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తారు. మళ్లీ అర్జీదారు.. మండలాధికారుల వద్దకు వెళ్లాల్సిందే. అక్కడ షరా మామూలే.

తిరిగి.. అలసిపోతున్నాం

నెలల తరబడి వస్తున్నా పరిష్కారం కాని సమస్యలు


ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదంటున్న బాధితులు


‘స్పందన’ కార్యక్రమం తీరిది


సమస్యపై స్థానికంగా మండలాఫీసులో అర్జీలిస్తారు. నాలుగైదు సార్లు తిరుగుతారు. ఆ అధికారుల్లో ‘స్పందన’ ఉండదు. సమస్య పరిష్కారం కాదు. దీంతో చిత్తూరు బస్సెక్కి కలెక్టరేట్‌కు వస్తారు. సోమవారం స్పందనలో అర్జీలిస్తారు. ఇక్కడ్నుంచి ఆ అర్జీని మండలాఫీసుకు పంపించి.. సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తారు. మళ్లీ అర్జీదారు.. మండలాధికారుల వద్దకు వెళ్లాల్సిందే. అక్కడ షరా మామూలే. కొందరిలో నిర్లక్ష్యం.. మరికొందరు ఉద్దేశపూర్వకంగా ఆ అర్జీని పక్కన పడేస్తారు. మళ్లీ అర్జీదారులు కలెక్టరాఫీసు బాట పడతారు. ఇలా ‘అర్జీల వలయం’లో చిక్కుకుని.. తిరుగుతూ ఉండేవాళ్లు ఎందరో? ఇలా వచ్చేవాళ్లలో పేదలే ఎక్కువ. తమ జీవనాధారమైన కూలి పని వదులుకుని, ఖర్చులు పెట్టుకుని చిత్తూరుకు వచ్చిపోవడం ఇబ్బందిగా మారుతోంది. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ‘స్పందన’కు వచ్చే అర్జీదారుల్లో నాలుగు పర్యాయాలకు పైగా వచ్చేవాళ్లూ ఎందరో ఉన్నారు. ఇన్ని సార్లు తిరిగి తిరిగి.. అలసిపోవడమే గానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని వాపోతున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. 

- చిత్తూరు


పాసుపుస్తకం కోసం పదేళ్లుగా.. 


ఏడు పదుల వయసున్న ఈయన పేరు తొప్పయ్యజాన్‌. ఊరు.. చిత్తూరు మండలం అనుప్పల్లె. సర్వే నంబరు 230-4ఎ, 230-4బిలో 5.20 ఎకరాల భూమి ఈయన అనుభవంలో ఉంది. పదేళ్ల కిందట చిత్తూరు నుంచి ఇంటికి వెళుతుండగా బస్సులో పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర వస్తువులు పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి పట్టాదార్‌ పాసుపుస్తకం కోసం తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలు.. కలెక్టరేట్‌కు తిరుగుతూనే ఉన్నారు. పరిశీలిస్తామని చెప్పేవారే కానీ, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.


ఇంకెన్ని సార్లు అర్జీలు రాయాలో? 


కలెక్టరేట్‌ ముందు బైకుపై అర్జీ పెట్టుకుని సంతకం పెడుతున్న ఈమె పేరు గోవిందమ్మ. రామకుప్పం మండలం అయ్యప్పగానిపల్లె గ్రామం. సర్వే నెంబరు 226-4లో 1.89 ఎకరాలు, 227-3లో 0.56 సెంట్లు, 227-10లో 1.67 ఎకరాల భూమి ఉంది. రైతు భరోసా, పీఎం కిసాన్‌ ద్వారా నగదు కూడా తీసుకుంటున్నారు. అయితే గ్రామానికి చెందిన కిట్టప్ప, మంజప్ప, సుజాత, పాపమ్మ కలిసి ఈ భూమిని కాజేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది ఆమె ఆవేదన. పొలం సాగు చేయడానికి వెళితే బెదిరిస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పటివరకు బస్సు ఛార్జీలు, అడిగిన వారికంతా కలిపి రూ.50వేల వరకు ఖర్చు పెట్టినా సమస్య పరిష్కారం కాలేదని ఆమె అంటున్నారు. కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించడమేగాక తన భూమిని సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారామె. 


రోగాలు ముదురుతున్నా పట్టించుకోరా? 


చిత్తూరు- పొన్నై రహదారిలోని దిగువమాసాపల్లె వద్ద నిర్మించిన సీపీఎఫ్‌ చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పంట పొలాలకు, మూగ జీవాలకు, ప్రజలకు ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థాల వల్ల బోర్లలో కలుషిత నీరు వస్తోందని పేర్కొన్నారు. మామిడి చెట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటిపై దద్దుర్లు వస్తున్నాయన్నారు. నాలుగుసార్లు కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేకపోయిందని వారు వాపోయారు.


గూడు కోసం.. 


తనకున్న నాలుగు ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు తవణంపల్లె మండలం టి.పుత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి. తాను, భార్య కోసం 12 గుంటలు పెట్టుకున్నారు. ఈ భూమి ఉంటే ప్రాణం పోయే వరకు బిడ్డలు అంత గంజిపోస్తారనుకున్నారు. పదేళ్ల క్రితం భార్య సరస్వతి చనిపోయింది. అప్పటి నుంచి బిడ్డలు ఆయన్ను చూడటం మానేశారు. ఇంట్లో ఉండటానికి వీల్లేదని చెప్పడంతో ఊర్లోని శ్రీరాములు గుడిలో ఉంటున్నారు. పెన్షన్‌ డబ్బుతో చుట్టుపక్కల హోటళ్లలో నాలుగు మెతుకులు తింటున్నారు. తాను ఉండటానికి నీడ ఏర్పాటు చేయాలని నాలుగు నెలలుగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. 


స్పందనకు 145 అర్జీలు


కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 145 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌, డీఆర్వో రాజశేఖర్‌ తెలిపారు. ఇందులో రెవెన్యూ 101, డీఆర్‌డీఏకు 5, వైద్య ఆరోగ్య శాఖకు 3, హౌసింగ్‌కు 9, సంక్షేమ శాఖలకు 6, పోలీస్‌ శాఖకు 4, ఇతర శాఖలకు 17 చొప్పున అర్జీలు వచ్చాయని వెల్లడించారు.

Updated Date - 2022-08-09T07:01:21+05:30 IST