అధికారానికి చేరువలో ఉన్నాం

ABN , First Publish Date - 2022-03-12T09:11:24+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ అధికారానికి చేరువలో ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

అధికారానికి చేరువలో ఉన్నాం

  • కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భూస్థాపితం చేస్తాం.. ప్రజలు మమ్మల్నే ఆదరిస్తున్నారు
  • మునిగిపోయే నావలా టీఆర్‌ఎస్‌
  • ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి: సంజయ్‌
  • కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
  • రెండేళ్ల పదవీకాలం పూర్తి.. వేదపండితుల ఆశీర్వచనం 


హైదరాబాద్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీజేపీ అధికారానికి చేరువలో ఉందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ సొంతంగా పోటీ చేస్తుందని, మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని భూస్థాపితం చేస్తామని, అవినీతి, కుటుంబ పాలనను అంతమొందిస్తామన్నారు. రాష్ట్రపార్టీ అధ్యక్షుడిగా నియమితులై రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా సంజయ్‌.. శుక్రవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘మా లక్ష్యానికి దగ్గరలో ఉన్నాం. ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్‌ స్థానాలను కైవసం చేసుకుంటున్నాం. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు కావాలని కోరుకుంటున్నారు. అందుకే మా అభ్యర్థులను గెలిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పతనం మొదలైంది. ఆ పార్టీ మునిగిపోయే నావలా మారింది’’ అని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అండగా ఉన్న పార్టీ జాతీయ నాయకత్వంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని, ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని అన్నారు. సీఎం కేసీఆర్‌ యాసతో, భాషతో నమ్మించే యత్నం చేసినా, గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు.


 తొలిదశ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. రెండోదశ పాదయాత్ర సందర్భంగానూ ప్రజల ఆలోచనలను తెలుసుకుంటామని, వాటికి అనుగుణంగా ఎన్నికల అజెండా తయారు చేసుకుంటామని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంతో్‌షజీ, ఇతర జాతీయ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు సంజయ్‌ చెప్పారు. తనకు సహకరిస్తున్న రాష్ట్ర పార్టీ నాయకులకు,కార్యకర్తలకూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సంజయ్‌ని మెట్‌పల్లి స్వామిజీ ప్రణవానంద, వేములవాడ రాజన్న ఆలయ పూజారులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రఘునందన్‌, ఇంద్రసేనారెడ్డి, విజయశాంతి, స్వామిగౌడ్‌, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణి రుద్రమదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ను సత్కరించారు. 


సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలి 

అనారోగ్యానికి గురైన సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని సంజయ్‌ ఆకాంక్షించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-03-12T09:11:24+05:30 IST