మక్కువతోనే సేవ చేస్తున్నాం!

ABN , First Publish Date - 2020-02-20T09:21:47+05:30 IST

‘‘మేం సేవా కార్యక్రమాలను మక్కువతో చేస్తున్నాం. అంశాల వారీగా సరైన దిశలో పనిచేస్తున్నాం. అదే ఎన్టీఆర్‌ డీఎన్‌ఏ’’ అని ఎన్టీఆర్‌ ట్రస్టు

మక్కువతోనే సేవ చేస్తున్నాం!

  • ఎన్టీఆర్‌ ట్రస్టుకు దాతల సహకారం భేష్‌
  • మరింత మంది దాతలు ముందుకు రావాలి: నారా భువనేశ్వరి

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ‘‘మేం సేవా కార్యక్రమాలను మక్కువతో చేస్తున్నాం. అంశాల వారీగా సరైన దిశలో పనిచేస్తున్నాం. అదే ఎన్టీఆర్‌ డీఎన్‌ఏ’’ అని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. 23 ఏళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టామని, ట్రస్టు కార్యక్రమాలు ముందుకు సాగడంలో దాతల సహకారం ఎనలేదని చెప్పారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. బుధవారం ఇక్కడ ఎన్టీఆర్‌ ట్రస్టులో 23వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టుకు మేనేజింగ్‌ ట్రస్టీగా ఉండడం గౌరవప్రదంగా  భావిస్తున్నట్లు తెలిపారు. పేదలు, బలహీన వర్గాల వారి కోసమే ఎన్టీఆర్‌ పని చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్టును ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొంటూ ధన్యవాదాలు తెలియజేశారు. పేదల పట్ల ఎంతో ప్రేమతో ఎన్టీఆర్‌ ట్రస్టు పని చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచమే మన కోసం ఉందని, మనం ప్రపంచం కోసం సిద్ధంగా ఉండాలని ట్రస్టు భావిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ నవ్వుతూ జీవించాలని, జీవితాన్ని కఠినతరం చేసుకోవద్దని సూచించారు. ఇతరులకు ఉపయోపడే పనులు చేయాలని, గౌరవంగా జీవించాలని చెప్పారు. ట్రస్టు కోసం పనిచేస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. విరాళాలు అందించిన దాతలకు ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. ట్రస్టు సీఈవో కె.రాజేంద్రకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:21:47+05:30 IST