కేంద్రం ప్యాకేజీని స్వాగతిస్తున్నాం

ABN , First Publish Date - 2020-03-27T07:43:31+05:30 IST

‘‘ధనిక, పేద తేడా లేకుండా కరోనా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. పేదలు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన...

కేంద్రం ప్యాకేజీని స్వాగతిస్తున్నాం

  • రాష్ట్రం అదనపు సాయాన్ని ప్రకటించకపోవడం గర్హనీయం
  • సీఎం రాష్ట్రానికి నాయకుడిగా మాట్లాడలేదు
  • వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ‘‘ధనిక, పేద తేడా లేకుండా కరోనా అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. పేదలు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తున్నాం. కానీ రాష్ట్రప్రభుత్వం అదనపు ప్యాకేజీ ప్రకటించకపోవడాన్ని గర్హిస్తున్నాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


‘‘విపత్కర సమయంలో సీఎం జగన్‌ ప్రసంగం ప్రజల్లో భరోసా పెంచలేకపోయింది. సీఎం రాష్ట్రానికి నాయకుడిగా మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుం చి ఇవి అదనంగా ఇస్తున్నామని చెప్పకపోవడం ప్రజల్ని నిరాశపర్చిందని’’ అని ఆక్షేపించారు. విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యను కచ్చితంగా ప్రకటించలేకపోవడం ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెడుతోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన ఏపీ విద్యార్థులు, ప్రజలను స్వస్థలాలకు చేర్చే విషయంలో ప్రభుత్వ తీరు ఆక్షేపణీయంగా ఉందన్నారు. పేదలను ఆదుకునే సమగ్ర కార్యాచరణను రూపొందించాలని, కరోనాపై రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ చేయాలని సూచించారు. మొక్కుబడిగా రూ.1000తో సరిపెట్టకుండా కేంద్ర ప్యాకేజీకి అదనంగా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రజాహిత కార్యక్రమాలకు బాధ్యతాయుత ప్రతిపక్షంగా టీడీపీ సహకరిస్తుందన్నారు. అత్యవసర సేవల్లో పాల్గొంటున్న అందరికీ శానిటైజర్లు, మాస్క్‌లు ఇవ్వాలని సూచించారు. బయట జనం గుంపులుగా చేరకుండా నిత్యావసరాలను డోర్‌డెలివరీ చేయించాలని, రైతు బజార్లను వికేంద్రీకరించాలని, పండ్ల ఉత్పత్తుల రవాణా లేక అవి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడినందున ఉద్యాన రైతుల్ని ఆదుకోవాలన్నారు. కోట్లాది పేద కుటుంబాలకు 3 నెలలు ఉచిత గ్యాస్‌ ఇవ్వడంతోపాటు రైతులు, పే దలు, కార్మికులను ఆదుకోవడానికి కేంద్రం స్పం దిం చిన తీరుపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2020-03-27T07:43:31+05:30 IST