అమెరికాలో ‘హక్కుల’ ఉల్లంఘనలపైనా మేము మాట్లాడతాం.. దీటుగా బదులిచ్చిన జైశంకర్‌

ABN , First Publish Date - 2022-04-15T13:24:51+05:30 IST

‘భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయి’.. అంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలకు మన విదేశాంగమంత్రి జైశంకర్‌ దీటుగా బదులిచ్చారు!

అమెరికాలో ‘హక్కుల’ ఉల్లంఘనలపైనా మేము మాట్లాడతాం.. దీటుగా బదులిచ్చిన జైశంకర్‌

బ్లింకెన్‌ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన జైశంకర్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 14: ‘భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరుగుతున్నాయి’.. అంటూ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలకు మన విదేశాంగమంత్రి జైశంకర్‌ దీటుగా బదులిచ్చారు! ఇటీవల న్యూయార్క్‌లో ఇద్దరు సిక్కులపై దాడిని పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా బ్లింకెన్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అమెరికాకు భారత్‌ ఇంత ఘాటుగా బదులివ్వడం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం వాషింగ్టన్‌లో ఇరు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల చర్చల అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్లింకెన్‌ హక్కుల ఉల్లంఘన గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆరోజు జైశంకర్‌గానీ, రాజ్‌నాథ్‌ గురించి ఆ వ్యాఖ్యలపై స్పందించలేదు. గురువారం ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. మంత్రుల చర్చలో అదొక అంశం కాదని, అందుకే తాము వెంటనే స్పందించలేదని జైశంకర్‌ వివరించారు. అక్కడితో ఆగలేదాయన. ‘‘మా మీద అభిప్రాయాలు ఏర్పరచుకునే హక్కు ఎవరికైనా ఉంది. అదేసమయంలో మాకు కూడా.. అమెరికా సహా ఇతర దేశాల్లో మాన వ హక్కుల పరిస్థితిపై అభిప్రాయాలు ఏర్పరచుకునే హక్కుంది. అమెరికాలో అలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు.. మరీ ముఖ్యం గా అలాంటి ఘటనలు మావాళ్ల(భారతీయుల) విషయంలో జరిగినప్పుడు మేమూ మానవహక్కుల గురించి ప్రస్తావిస్తాం’’ అన్నారు. 

Updated Date - 2022-04-15T13:24:51+05:30 IST