Jul 19 2021 @ 03:55AM

వెంకటేశ్‌తో పాటు మేమంతా బాధపడ్డాం!

‘‘కరోనా కొన్ని కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులను థియేటర్లకు పంపించను. అలాంటప్పుడు ఇతరుల్ని, ప్రేక్షకులను థియేటర్లకు వచ్చి మా సినిమా చూడమని ఎలా అడుగుతాను? ‘నారప్ప’ను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చినందుకు వెంకటేశ్‌తో పాటు నేనూ, మా చిత్రబృందమంతా బాధపడ్డాం. కానీ, తప్పలేదు’’ అని సురేశ్‌బాబు అన్నారు. కలైపులి ఎస్‌. థానుతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘నారప్ప’. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో మంగళవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సురేశ్‌బాబు చెప్పిన సంగతులు...


‘థియేటర్లు తెరుచుకుంటాయా? తెరిచినా ప్రేక్షకులు వస్తారా?’ అనే సందేహాలు, ఆర్థిక ఒత్తిళ్ల నడుమ ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని థానుగారు నిర్ణయించారు. నిర్మాణంలో ఆయనది ప్రధాన వాటా. అందుకని, ఆయన్ను ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం. దాంతో ఆయన ఓటీటీ అంటే కాదనలేకపోయాం. మా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సినిమా అయితే తప్పకుండా థియేటర్లలోనే విడుదల చేసేవాళ్లం. 


నిరుపేద రైతుగా వెంకీ చేయలేదు!

‘నారప్ప’ లాంటి నిరుపేద, రైతు పాత్రలో వెంకటేశ్‌ ఇప్పటివరకూ నటించలేదు. ‘అసురన్‌’ చూసినప్పుడు... కథలో మానవ సంబంధాలు, యాక్షన్‌ దృశ్యాలు, భావోద్వేగాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. అందుకే, రీమేక్‌ చేశాం. ప్రతి నటుడికి కొత్త తరహా పాత్రలు చేయాలనుంటుంది. నారప్ప పాత్రలో వెంకటేశ్‌ లీనమై చేశాడు. తనకొక సవాల్‌గా భావించి కష్టపడిచేశాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే పోరాట దృశ్యాలకు ఎంతో కష్టపడ్డాడు. ఒకరోజు శ్రీకాంత్‌ అడ్డాల కథ చెప్పడానికి ఆఫీసుకు వచ్చాడు. తర్వాత మాటల సందర్భంలో ‘మీరు అసురన్‌ రీమేక్‌ చేస్తున్నారని తెలిసింది. ఎవర్నీ అనుకోకపోతే నేను దర్శకత్వం వహించాలనుకుంటున్నా’ అని అడిగాడు. కథను అతను అవగాహన చేసుకున్న తీరు నచ్చింది. ‘ఎస్‌’ చెప్పాను. నటుల నుంచి చిన్నచిన్న భావోద్వేగాలను అతను చక్కగా రాబట్టగలడు. ‘నారప్ప’ తర్వాత వెంకటేశ్‌ నటించిన ‘దృశ్యం-2’ విడుదలకు సిద్ధమైంది. ‘నారప్ప’లో ఎక్కువ మార్పులు చేయలేదు. ‘దృశ్యం- 2’లో చేశాం. అది మాతృక కన్నా బావుంటుంది.


చిత్ర పరిశ్రమను ఓటీటీ కాపాడింది!

ఓటీటీ వేదికలను ఆపగలమనేది మన భ్రమ. హిందీలో సల్మాన్‌ఖాన్‌ వంటి పెద్ద హీరో తన చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. కరోనా కాలంలో చిత్ర పరిశ్రమను ఓటీటీ కాపాడింది. వెబ్‌సిరీ్‌సల సంఖ్య పెరగడంతో సినీ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. నిర్మాతలకూ లాభమే. అయితే, ఓటీటీ రిలీజుల వల్ల ఎక్కువ నష్టపోయేది ఎగ్జిబిటర్లే. దేశంలో కరోనా విజృంభణ మొదలైనప్పట్నుంచీ ఇప్పటికి ఏడాది కాలం థియేటర్లు మూతబడ్డాయి. అయినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సాయం అందించలేదు. ఆస్తి పన్ను మినహాయింపు, విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ ఇవ్వడం లేదు. మేం అన్నీ కడుతున్నాం.

రూ.40 టికెట్‌ అంటే... కరెంట్‌ బిల్‌ కూడా రాదు!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తెలంగాణలో థియేటర్ల పరిస్థితి మెరుగ్గా ఉంది. ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన టికెట్‌ రేట్లకు థియేటర్లు నడపడం సాధ్యం కాదు. రూ.40 టికెట్‌ అంటే... ఏసీ థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయినా కరెంట్‌ బిల్లు కూడా రాదు. ప్రభుత్వాన్ని టికెట్‌ ధరల్లో చిన్న సవరణలు అడిగినా చేయడం లేదు. ‘మీరు థియేటర్లు తెరవండి. తర్వాత మారుస్తాం’ అంటున్నారట. యాజమాన్యాలు సినిమాపై ప్రేమతో సింగిల్‌ స్ర్కీన్స్‌ నడపడమే తప్ప... పైసా లాభం ఉండదు. అక్కడి ప్రదర్శన రంగానికి ఇది జీవన్మరణ సమస్య.


అది ఏపీ ప్రభుత్వ భూమి కాదు!

విశాఖలోని రామానాయుడు స్టూడియోస్‌ నా స్వార్జితం. అది ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదు. మార్కెట్‌ ధరకన్నా ఎక్కువ చెల్లించి కొన్నా. అయితే, ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించవచ్చు. కానీ, దానికి తగిన పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులోనూ ఏపీలో మేం స్టూడియో నడుపుతాం.


త్వరలో ‘సురేశ్‌ ప్రొడక్షన్స్‌’ ఓటీటీ!

సురేశ్‌ ప్రొడక్షన్స్‌ త్వరలో సొంత ఓటీటీ వేదికను ప్రారంభిస్తుంది. ఇప్పటికే కంటెంట్‌ క్రియేట్‌ చేయడం ప్రారంభించాం. ‘ఎస్‌పి మ్యూజిక్స్‌’ పేరుతో ఆడియో రంగంలో ప్రవేశించాం. ‘నారప్ప’లో దాని ద్వారానే విడుదల చేస్తున్నాం. భవిష్యత్తులో నాన్‌ఫిల్మ్‌ మ్యూజిక్‌ ద్వారా వర్ధమాన గాయనీ గాయకులు, సంగీత దర్శకుల్ని ప్రోత్సహిస్తాం.