మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి : యశ్వంత్ సిన్హా

ABN , First Publish Date - 2021-05-03T00:09:39+05:30 IST

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా...

మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి : యశ్వంత్ సిన్హా

హజారీబాగ్ (జార్ఖండ్): పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ కూడా రాజీనామా చేయాలని సిన్హా డిమాండ్ చేశారు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో వెలువడుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయన్నారు. కేంద్రంలోని నాయకత్వాన్ని మార్చాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  గతంలో అటల్ బీహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సిన్హా.. బీజేపీ పరిస్థితి, భారత ప్రజాస్వామ్యం రెండూ ప్రమాదంలో ఉన్నాయంటూ 2018లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు.


ఎన్నికల ఫలితాలపై ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రం హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. అలాగే కైలాష్ విజయవర్గీయ, దిలీప్ ఘోష్ కూడా. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే తామే గెలుస్తామంటూ ప్రధాని మోదీ, అమిత్ షా గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు అవన్నీ అబద్ధాలేనని తేలిపోయాయి...’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ నేతలు మమతను అడుగడుగునా అవమానించారంటూ సిన్హా దుయ్యబట్టారు. ‘‘బీజేపీ నేతల ప్రచారం బెంగాల్ ప్రజల మనోభావాలను గాయపర్చింది. అందుకే వారు మోదీ, అమిత్ షాలకు తగిన సమాధానం చెప్పారు.  తామంతా మమత వైపే ఉన్నామని వారు స్పష్టమైన తీర్పు ఇచ్చారు..’’ అని సిన్హా పేర్కొన్నారు. మమత పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సంతృప్తి కలిగించాయని ఈ తీర్పుతో తేటతెల్లమైందన్నారు. 

Updated Date - 2021-05-03T00:09:39+05:30 IST