Boris Johnsonను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఎగతాళి చేసిందో చూడండి!

ABN , First Publish Date - 2022-07-09T17:52:27+05:30 IST

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్‌ను

Boris Johnsonను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఎలా ఎగతాళి చేసిందో చూడండి!

లండన్ : బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన బోరిస్ జాన్సన్‌ను బ్లాక్‌పూల్‌, లండన్‌లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలు ఎగతాళి చేశాయి. బ్లాక్‌పూల్‌లోని మ్యూజియంలో ఉన్న ఆయన మైనపు బొమ్మను లాంకషైర్‌లోని ఓ జాబ్ సీకింగ్ సెంటర్ బయట పెట్టగా, లండన్‌లోని మ్యూజియంలో ఉన్న ఆయన మైనపు విగ్రహం వద్ద ‘వేకెన్సీ’ బోర్డును వేలాడదీసింది. 


మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలలో మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన శాల ప్రపంచ ప్రసిద్ధి చెందినది. బోరిస్ జాన్సన్ (Boris Johnson) బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సమాయత్తమవుతున్న సమయంలోనే బ్లాక్‌పూల్‌లోని ఈ మ్యూజియం సిబ్బంది ఆయన మైనపు విగ్రహాన్ని (Wax Workను) ఓ జాబ్ సీకింగ్ సెంటర్ బయటకు తరలించే ఏర్పాట్లలో తీరిక లేకుండా గడిపారు. ఈ మైనపు విగ్రహాన్ని మార్చిలోనే ఆవిష్కరించారు. దీనిని 20 మంది కళాకారులు వందల గంటల సమయాన్ని వెచ్చించి తయారు చేశారు. 


సూటు ధరించిన బోరిస్ జాన్సన్ తన నడుము మీద రెండు చేతులు పెట్టుకుని, నవ్వుతున్నట్లు కనిపిస్తున్న ఈ మైనపు విగ్రహాన్ని అత్యంత నైపుణ్యంతో తయారు చేశారు. ఆయన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుక్షణం ఈ విగ్రహాన్ని జాబ్ సీకింగ్ సెంటర్ బయట పేవ్‌మెంట్‌పై పెట్టేశారు. దీనిని చూసినవారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కొందరు ఈ విగ్రహం వద్ద నిలబడి ఫొటోలు తీసుకుంటున్నారు. కొందరు ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. బ్లాక్‌పూల్ కూడలిలో బోరిస్ జాన్సన్ ఉన్నారని ఓ ట్విటరాటీ వ్యాఖ్యానించారు. 


లండన్‌ (London)లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం కూడా ఇదే విధంగా బోరిస్ జాన్సన్‌ను ఎగతాళి చేసింది. ప్రధాన మంత్రి (Prime Minister) అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ డిస్‌ప్లే వద్ద ఉన్న బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహం వెనుక వేకెన్సీ బోర్డు పెట్టింది.


బోరిస్ ప్రధాన మంత్రి పదవి నుంచి పూర్తిగా వైదొలగిన తర్వాత ఆయన మైనపు విగ్రహాన్ని పూర్తిగా తమ మ్యూజియం నుంచి తొలగిస్తామని లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం అధికారులు బ్రిటన్ మీడియాకు తెలిపారు. 




Updated Date - 2022-07-09T17:52:27+05:30 IST