Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలల విధ్వంసం

వణికిన ఉప్పాడ, కోనపాపపేట గ్రామాలు

బీచ్‌రోడ్డు ధ్వంసం..15 ఇళ్లు నేలమట్టం

విశాఖలో కూలిన చిల్డ్రన్‌పార్క్‌ ప్రహరీ

500 అడుగుల పొడవున జారిన మట్టి

మరింత బలహీనపడిన జవాద్‌

పూరీకి దగ్గరగా కేంద్రీకృతం


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), కొత్తపల్లి, డిసెంబరు 5: జవాద్‌ తుఫాన్‌ బలహీనపడినప్పటికీ శనివారం అమావాస్య కావడంతో సముద్రంలో ఆటుపోట్ల తీవ్రత ఎక్కువగా ఉంది. శని, ఆదివారాల్లో అలలు మూడు మీటర్ల ఎత్తున ఎగసి, సముద్రం తీరం వైపు చొచ్చుకొచ్చింది. కెరటాల ధాటికి తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట గ్రామాలు వణికిపోయాయి. ఉప్పాడ బీచ్‌రోడ్డులో పెద్ద వంతెన ఒకపక్క ఒరిగిపోయింది. అప్రోచ్‌రోడ్డు సగానికి పైగా కోతకు గురైంది. కోనపాపపేటలో కెరటాల ధాటికి తీరప్రాంతం సుమారు అరకిలోమీటరు మేర కోతకు గురైంది. దీంతో సుమారు 15మంది మత్స్యకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇళ్లలోని వలలు, బోట్ల ఇంజన్‌లు, ఇతర వేట పరికరాలు సముద్రంలో కొట్టుకుపోయాయని మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడ బీచ్‌రోడ్డు సుమారు కిలోమీటరున్నర పొడవున ధ్వంసమైంది. రోడ్డుపై రాళ్లు చెల్లాచెదురుగా పడిఉండటంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 1996లో ఏర్పడిన తుఫాన్‌కు పెద్దవంతెన ఒక పైపు భారీగా కోతకు గురవగా, తాజాగా అది ఒక వైపు ఒరిగిపోయింది. విశాఖపట్నంలోనూ అలల తాకిడికి బీచ్‌రోడ్డులోని చిల్డ్రన్‌పార్క్‌ ప్రహరీకూలిపోయింది. సుమారు 500 అడుగుల పొడవున 2-3 అడుగుల లోతున మట్టి జారిపోయింది.  


ఊపిరి పీల్చుకున్న అధికారులు..

జవాద్‌ తుఫాన్‌ మరింత బలహీనపడింది. ఆదివారం మధ్యాహ్నం ఒడిసాలోని పూరీకి 50 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 130 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. దీంతో శ్రీకాకుళానికి ముప్పు తప్పిందని వాతావరణ నిపుణులు వివరించారు.

Advertisement
Advertisement