Abn logo
Apr 4 2020 @ 18:59PM

ముంబై తీరానికి దూరంగా.. చేపల పడవల్లో 4 వేల మంది వలస కార్మికులు

ముంబై: అకస్మాత్తు లాక్‌డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన దాదాపు 4 వేల మంది వలస కార్మికులకు ఇప్పుడు జాలర్ల బోట్లు ఆశ్రయం కల్పిస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా స్వగ్రామాలకు వెళ్లలేకపోయిన వారంతా బయటకు వచ్చి పోలీసులతో దెబ్బలు తినడం కంటే బోట్లలో ఆశ్రయం పొందడమే మేలని భావిస్తున్నారు. మహారాష్ట్ర పశ్చిమ తీరంలో లంగర్ వేసిన బోట్లు ఇప్పుడు వీరికి ఇళ్లుగా మారాయి. 41 ఏళ్ల కిశోర్ పాటిల్ మరో 9 మంది జాలర్లతో కలిసి బోటులో పనిచేస్తున్నాడు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన పాటిల్ 15 రోజుల తర్వాత గత నెల 22న ముంబైలోని ఫెర్రీ వార్ఫ్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో దేశంలో జనతా కర్ఫ్యూ పాటించారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం, అనంతరం కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించడంతో స్వగ్రామం రాయ్‌గడ్ చేరుకోవడం కిశోర్‌కు కష్టమైంది. 


దీంతో బోటు యజమాని రాజేశ్ కాలే వారిని బోటులోనే ఉండమని చెప్పాడు. ముంబైలో తామంతా చిన్నచిన్న గదుల్లో నివసిస్తుంటామని, అక్కడ ఉండేందుకు తగిన వసతులు ఉండవని, కాబట్టి వారిని బోట్లలోనే ఉండమని చెప్పానని రాజేశ్ తెలిపాడు. ప్రస్తుతం బోటులో ఉండడమే సురక్షితం కూడా అని పేర్కొన్నాడు. వారికేమైనా అవసరం ఉంటే రెండు రోజులకోసారి ఫోన్ చేస్తుంటారని కాలే తెలిపాడు. వారు తనకు తరచూ ఫోన్లు చేయరని, ఎందుకంటే బోటులో చార్జింగ్ చేసుకోవడం కష్టమని ఆయన తెలిపాడు. బోటు ఆన్‌లో ఉన్నప్పుడు చార్జింగ్ చేయగలుగుతామని, ఆన్ చేస్తే బోల్డంత ఇంధనం వృథా అవుతుందని వివరించాడు. 20 వేల బోట్లలో పనిచేస్తున్న 4 వేల మంది మంది జాలర్లు ప్రస్తుతం ఫిషింగ్ బోట్లలోనే ఉన్నారని మహారాష్ట్ర ఫిషరీస్ కో ఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ రామ్‌దాస్ సుండే తెలిపారు. 


ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి గతేడాది సెప్టెంబరులో ముంబై వచ్చిన వీరేంద్ర కుమార్ నిషాద్ కూడా ఇప్పుడు మరో ఏడుగురితో కలిసి బోటులోనే నివసిస్తున్నాడు. వెర్సోవాలోని సముద్రంలో కిలోమీటరు లోపల లంగరు వేసిన బోటులో ఉంటున్నాడు. ఇంటి కెళ్లాలని భావిస్తున్నా సరిహద్దులు మూసివేశారని, కాబట్టి ఇక్కడే ఉంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం కిరోసిన్ స్టవ్‌పై వంట చేసుకుంటున్నామని, ఉన్న సరుకులు అయిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పాడు. ఇందుకోసం ఉదయం టిఫిన్లు చేయడం కూడా మానేసినట్టు వివరించాడు. కిశోర్ పాటిల్, వీరేంద్రకుమార్ లాంటి వేలాదిమంది కార్మికులు ఇప్పుడు తీరానికి దూరంగా సముద్రం మధ్య నివసిస్తున్నారు. మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా దాదాపు రూ.1.5 లక్షలు నష్టపోయినట్టు బోటు యజమాని రాజేశ్ కాలే ఆవేదన వ్యక్తం చేశాడు. కాలే లాంటి ఎందరో బోటు యజమానులు ఇప్పుడు నష్టాల కారణంగా విలవిల్లాడుతున్నారు.

Advertisement
Advertisement