నీరు లేని ఊరు

ABN , First Publish Date - 2022-06-25T05:22:39+05:30 IST

అన్ని ఊళ్లలాగే ఆ ఊరుకూ బోలెడు చరిత్ర ఉంది. సుమారు 600 సంవత్సరాల కింద ఏర్పడిందంటారు. వకుళా నది ఒడ్డున ఉంది. పేరు చిలుకలూరు. కానీ దాని మారు పేరు నీరు లేని ఊరు.

నీరు లేని ఊరు

చిలుకలూరులో నీరు ఉప్పన 

ఏటి నీటితో స్నానాలు 

 దూరంగా ఉన్న చేతిపంపు నీరే ఆధారం 

ఆరా తీసిన కలెక్టర్‌ 


అన్ని ఊళ్లలాగే ఆ ఊరుకూ బోలెడు చరిత్ర ఉంది. సుమారు 600 సంవత్సరాల కింద ఏర్పడిందంటారు. వకుళా నది ఒడ్డున ఉంది. పేరు చిలుకలూరు. కానీ దాని మారు పేరు నీరు లేని ఊరు. 


రుద్రవరం, జూన్‌ 24: రుద్రవరం మండలంలో చిలుకలూరు పేరు వింటే.. నీటి కటకట గుర్తుకు వస్తుంది. ఈ గ్రామంలో ఉప్పు నీరు తప్ప మంచి నీరు లేదు. ఏండ్ల తరబడి గ్రామస్థులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఊళ్లో 152 కుటుంబాలు ఉన్నాయి. ఊరి పక్కనే వకుళానది పారుతుంది. 600 ఏళ్ల కింద ఏర్పడ్డ ఈ ఊరిలో తాగనీటి సమస్య ఇప్పటిది కాదు. అనేక ప్రభుత్వాలు మారాయి. అధికార యంత్రాంగంలో వ్యక్తులు మారారు. చిలుకలూరు ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి స్వగ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా చిలుకలూరులో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు.  


నిరుపయోగంగా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ 


 గ్రామంలో ఉన్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిరుపయోగంగా మారింది.   ప్లాంట్‌ తలుపులు తెరుచుకోక చాల కాలం అయింది.  బిల్లులు చెల్లించనందుకు ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. ఇటీవల మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి వెళ్లిన సచివాలయ లైన్‌మెన్‌ రమేష్‌ మృతి చెందిన విషయం 

విదితమే. 


ఉప్పు నీటితో ఇంకెన్నేళ్లు ? 


ఉప్పు నీటితో ఇంకెన్నేళ్లు బాధపడాలని చిలుకలూరు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.  గ్రామమంతా ఉప్పునీరే. తాగడానికి, స్నానం చేయడానికి, పశువులు తాగడానికి కూడా ఊళ్లో నీరు పనికి రావడం లేదని ప్రజలు అంటున్నారు. 


గతంలో చెలిమ నీటితో.. 


చిలుకలూరు గ్రామ ప్రజలు గతంలో చెలిమ నీటితో కాలం వెళ్లదీసేవారు. వకుళానది నీటిని స్నానానికి వాడేవారు. నది ఒడ్డున చెలిమ నీరు తాగేందుకు వాడేవారు.  ఇటీవల గ్రామంలో చేతి పంపులు, మంచి నీటి పథకాలు అన్నిటిలో ఉప్పు నీరు కలిసిపోయింది. దీంతో అవేవీ పనికి రాకుండాపోయాయని అంటున్నారు. 


గ్రామానికి 700 మీటర్ల దూరంలో చేతి పంపు


గ్రామానికి 700 మీటర్ల దూరంలో పెద్దమ్మ గుడి వద్ద ఓ దాత వేయించిన చేతి పంపు ఉంది. ఈ పంపు నీరు ఊరికి ఆధారం. అయితే ఇంత దూరం వెళ్లి నీరు తెచ్చుకోవడం వృద్ధులకు చేతకావడం లేదు. దీంతో వారు ఉప్పు నీరే వాడుతున్నారు. వర్షాకాలం ఈ చేతిపంపుకు వెళ్లే గుంతలదారిలో వెళ్లడం వృద్ధులకు సాధ్యం కావడం లేదు. కొందరు ఎవరినో ఒకరిని బతిమాలి ఒక బిందెడు నీరు తెప్పించుకుంటున్నారు. 


కలెక్టర్‌ పర్యటనతో మరోసారి వెలుగులోకి: 


కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఈనెల 22వ తేదీన ఈ ఊరిలో పర్యటించారు. ఆ సందర్భంగా చిలుకలూరు తాగునీటి సమస్యను ఆయన ఆరాతీశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ ప్రమోద్‌, ఈవోపీఆర్డీ రామకృష్ణవేణిని వివరాలు అడిగారు. వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారా లేదా అని అడిగారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు కలెక్టర్‌కు తెలియజేశారు. కలెక్టర్‌ జోక్యంతో అయినా తమ గ్రామంలో నీటి సమస్య పరిష్కారం అవుతుందా? అని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు. 


అంత దూరం వెళ్లలేకపోతున్నాం


గ్రామానికి దూరంగా చేతి పంపు ఉంది. అక్కడికి వెళ్లి నీరు తెచ్చుకోవడం మాకు చేతకావడం లేదు. ఉప్పు నీరే తాగుతున్నాం. ఎవరినో ఒకరిని బతిమాలి ఒక బిందెడు నీరు తెప్పించుకుంటే రెండు రోజులు తాగుతున్నాం. ఇలా ఎన్నేళ్లు బాధపడాలి. 


-ఇస్మాయిల్‌, మాబ్బీ, వృద్ధ దంపతులు, చిలుకలూరు 


ఉప్పు నీటితో ఇబ్బంది పడుతున్నాం


ఎన్నో ఏళ్లుగా ఉప్పు నీటితో ఇబ్బంది పడుతున్నాం. తాగడానికి, స్నానాలు చేయడానికి ఊళ్లో నీరు పనికి రావడం లేదు. ఏటి నీరు తెచ్చుకొని స్నానాలు చేస్తున్నాం. పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లి బిందెడు నీరు తెచ్చుకొని తాగుతున్నాం. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? 


- ముత్యాలపాటి బీబీ,  చిలుకలూరు 


ఏటి నీటితో ఇబ్బందిపడుతున్నాం

వకుళా నది నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. స్నానాలు చేయడానికి తప్ప ఆ నీరు తాగడానికి పనికి రాదు. ఊళ్లో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిరుపయోగమైంది. ప్రభుత్వం తాగునీటి సౌకర్యం కల్పించాలి. 

            

  -సుహాసిని, చిలుకలూరు


నీటి సమస్య పరిష్కరిస్తాం


చిలుకలూరు గ్రామంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నిధులు మంజూరు చేశారు. సమస్య పరిష్కరిస్తాం.


-ప్రమోద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, రుద్రవరం  

Updated Date - 2022-06-25T05:22:39+05:30 IST