నీరులేని ప్రాజెక్టు

ABN , First Publish Date - 2022-04-09T06:30:41+05:30 IST

వరదరాజస్వామి ప్రాజెక్టుకు స్వాతంత్ర్యానంతర భారతదేశానికి ఉన్నంత సుదీర్ఘ చరిత్ర ఉంది.

నీరులేని ప్రాజెక్టు

వర్షాధారం కావడమే వీఆర్‌ఎస్పీకి శాపం

సిద్ధాపురం ద్వారా వెలుగోడు నీటికి ప్రతిపాదనలు 

మూడేళ్లుగానిర్లక్ష్యానికి గురైన ప్రక్రియ 


ఆత్మకూరు, ఏప్రిల్‌ 8: వరదరాజస్వామి ప్రాజెక్టుకు స్వాతంత్ర్యానంతర భారతదేశానికి ఉన్నంత సుదీర్ఘ చరిత్ర ఉంది. 1948లో ఈ ప్రాజెక్టు గురించిన ఆలోచన మొదలైంది. అనేక అవాంతరాలను దాటుకొని 2000 సంవత్సరంలో పూర్తయింది. 2012 నవంబరు 28న అప్పటి కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. ఇంతా అయితే ఈ ప్రాజెక్టుకు నల్లమలో కురిసే వర్షం నీరే ఆధారం. నీటి కేటాయింపులు లేకపోవడం వల్ల ఇప్పటికి నాలుగైదు సార్లే భారీ వర్షాలు కురిసినప్పుడు రిజర్వాయర్‌లోకి నీరు చేరింది. 2013లో ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో ఆయకట్టుకు నీరు వదిలారు. ప్రాజెక్ట్‌ బ్రాంచ్‌ కెనాల్స్‌, సబ్‌ కెనాల్స్‌, ఫీల్డ్‌ కెనాల్స్‌ సక్రమంగా లేవు. కొన్ని చోట్ల బ్రాంచ్‌ కెనాల్స్‌ దెబ్బతిన్నాయి. గేట్లు కూడా దెబ్బతినడంతో ప్రాజెక్టులోకి వచ్చిన కొద్ది నీరు కూడా లీకవుతోంది. 2018లో ప్రాజెక్ట్‌ అభివృద్ధికి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేటివ్‌ ఏజెన్సీ (జైకా) సంస్థ రూ.19.5కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. 93శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్‌ పనులన్నీ పూర్తయినా, నిర్వహణ సక్రమంగా ఉన్నా దీని అసలు సమస్య నీరు లేకపోవడం. అందువల్ల దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు పూర్తయితే పంటలు పండించుకోవచ్చని ఆశించిన ఆయకట్టు రైతులకు నిరాశే మిగులుతోంది. ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లోని 9 గ్రామాల పరిధిలోని 13,220 ఎకరాలకు నీరు అందాలంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. 


ప్రత్యామ్నాయాలు ఇలా..


వెలుగోడు జలాశయం నుంచి సిద్ధాపురం చెరువులోకి నీరు విడుదల చేసి గ్రావిటీ కెనాల్‌తో ఇందిరేశ్వరం, వడ్లరామాపురం మీదుగా కొట్టాలచెరువు గ్రామ సమీపంలోని వీఆర్‌ఎస్పీ ప్రధాన కాల్వకు అనుసంధానిస్తే సమస్య పరిష్కారమవుతుంది. అలాగే 14 కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణానది నుంచి నేరుగా వీఆర్‌ఎస్పీ రిజర్వాయర్‌లోకి నీరు ఎత్తిపోయవచ్చు. అయితే ప్రాజెక్టు 400 మీటర్ల ఎత్తులో ఉంది. పైగా ఇది టైగర్‌ ప్రాజెక్టు పరిధిలోని ప్రాంతం. ఈ పని చేయాలంటే అటవీ అనుమతులు కావాలి. అది అంత సులభం కాదు. కాబట్టి వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి సిద్ధాపురం ఎత్తిపోతల పథకంలో భాగంగా నీరు తరలించడమే వరదరాజస్వామి ప్రాజెక్టు సమస్యకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు మూడేళ్ల క్రితం రూ.25కోట్లతో ఇరిగేషన్‌ అధికారులు ప్రణాళిక అంచనాలు సిద్ధం చేశారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో అది మూలనపడింది. 


ప్రాజెక్టు ద్వారా నీరందే చెరువులు


వీఆర్‌ఎస్పీ ప్రాజెక్ట్‌ ద్వారా ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లోని 8 చెరువులకు నీటిని నింపవచ్చు. ఇందిరేశ్వరం, వడ్లరామాపురం, కొట్టాలచెరువు, పాలెంచెరువు, గువ్వలకుంట్ల, కురుకుంద, బావాపురం, కొత్తపల్లి గ్రామాల్లోని చెరువులను నింపి ఆయకట్టు పొలాలకు నీరందించవచ్చు.


ప్రాజెక్ట్‌కు నీరు వస్తే మేలు జరిగే ఆయకట్టు వివరాలు 


గ్రామం : ఎకరాలు : 

ఆత్మకూరు మండలం

1. ఆత్మకూరు - 477.28

2. కురుకుంద - 3821.42

3. వడ్లరామాపురం - 2008.93

4. ఇందిరేశ్వరం - 1002.19

కొత్తపల్లి మండలం 

5. కొత్తపల్లి - 1068.39

6. గువ్వలకుంట్ల - 1731.19

7. నందికుంట - 1579.69

8. గోకవరం - 785.94

9. దుద్యాల - 745.15

మొత్తం - 13220


మినుము పంటను నష్టపోయాను


గత ఏడాది రబీలో మాచప్ప చెరువు కింద 5ఎకరాల్లో మినుము సాగు చేశాను. అయితే ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందకపోవడంతో పంట చేతికి రాలేదు. ప్రతిఏటా ఇదే తరహా నష్టాలను భరాయిస్తున్నాం. 


- షాలిమియా, కురుకుంద గ్రామం, ఆత్మకూరు మండలం


వర్షాధారంతోనే..- నాగన్న, జేఈఈ, వీఆర్‌ఎస్పీ


వర్షాధారం కావడంతో కొన్నేళ్లుగా ప్రాజెక్ట్‌లోకి పూర్తిస్థాయిలో నీటినిల్వలు చేరడం లేదు. రబీ సీజన్‌లలో ఆయకట్టుకు నీరందడం లేదు. సిద్ధాపురం ఎత్తిపోతల ద్వారా నీరు అందించాలనే ప్రతిపాదనపై నాకు అవగాహన లేదు. పాలెంచెరువు వరకు కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎత్తిపోతల పథకం ద్వారా కూడా వీఆర్‌ఎస్పీ ఆయకట్టుకు నీరందించవచ్చనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి వీఆర్‌ఎస్పీ డ్వాంలోకి నీరందిడం కష్టం. చాలా ఖర్చవుతుంది. అటవీ అనుమతులు కావాలి. 


ఏటా నష్టాలు


వీఆర్‌ఎస్పీ ఆయకట్టు కింద పంటలు సాగు చేసి ఏటా నష్టపోతున్నా. గత ఏడాది ఖరీఫ్‌లో నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తే అధిక వర్షాలతో దెబ్బతింది. రబీ సీజన్‌లో మరోసారి వరి సాగు చేస్తే ప్రాజెక్టు నుంచి నీరందక పంట ఎండిపోయింది.


- శ్రీరాములు, కురుకుంద గ్రామం, ఆత్మకూరు మండలం

Updated Date - 2022-04-09T06:30:41+05:30 IST