వాటర్‌వర్క్స్‌ చెరువులో చనిపోయిన చేపలు

ABN , First Publish Date - 2022-06-25T07:31:31+05:30 IST

ప్రజలకు తాగునీరు అందించే వాటర్‌వర్క్స్‌ చెరువులో చేపలు భారీగా చనిపోయాయి. ఈ చేపలను గుట్టుచప్పుడు కాకుండా పట్టి మునిసిపల్‌ ట్రాక్టర్లలో తరలించి గోతులు తీసి పూడ్చివేశారు.

వాటర్‌వర్క్స్‌ చెరువులో చనిపోయిన చేపలు
పిఠాపురం వాటర్‌వర్క్స్‌ చెరువులో చనిపోయిన చేపలు

  • తాగునీరు కలుషితం.. అదే నీటిని సరఫరా చేస్తున్నారని ఆరోపణలు
  • చేపలు మునిసిపల్‌ ట్రాక్టర్ల ద్వారా తరలింపు
  • గుట్టుచప్పుడు కాకుండా పూడ్చివేత

పిఠాపురం/పిఠాపురం రూరల్‌, జూన్‌ 24: ప్రజలకు తాగునీరు అందించే వాటర్‌వర్క్స్‌ చెరువులో చేపలు భారీగా చనిపోయాయి. ఈ చేపలను గుట్టుచప్పుడు కాకుండా పట్టి మునిసిపల్‌ ట్రాక్టర్లలో తరలించి గోతులు తీసి పూడ్చివేశారు. తాగునీరు కలుషితమైనా అదే నీటిని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిఠాపురం పట్టణ ప్రజలకు సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఈ పథకానికి సంబం ధించి చిత్రాడలో స్టోరేజీ ట్యాంకు ఉంది. ఈ ట్యాంకుకు గోదావరి జలాలు మళ్లించి కుమారపురంలోని వాటర్‌వర్క్స్‌ ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. చిత్రాడలోని వాటర్‌వర్క్స్‌కు సంబంధించిన చెరువులో గురు, శుక్రవారాల్లో భారీగా చేపలు చనిపోయాయి. చేపలు భారీగా చనిపోయిన విషయం తెలిసినా మునిసిపల్‌ అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో చెరువులో నీరు కలుషితమైంది. చనిపోయిన చేపలను పట్టించి గురువారం తెల్లవారుజామున, ఉదయం సమయాల్లో మునిసిపల్‌ ట్రాక్టర్ల ద్వారా తరలించారు. వీటిని గుట్టుచప్పుడు కాకుండా గోతులు తీయించి పూడ్చివేశారు. చిత్రాడ గ్రామస్తులు కొందరు ఈ చేపలను పట్టుకుని విక్రయించడం, ఇళ్లకు తీసుకువెళ్లడం చేశారు. మరోవైపు చెరువులో చేపలు చనిపోవడంతో నీరు కలుషితం కావడంతోపాటు ఆ ప్రాంతమంతా దుర్గంధపూరితంగా మా రింది. ఇదే నీటిని కుళాయిలు ద్వారా సరఫరా చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తాము అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదురోజులుగా చేపలు చనిపోతున్నాయని కొందరు చెబుతున్నారు. చెరువులో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతోపాటు వ్యర్థాలు తొలగించాల్సిన మునిసిపల్‌ అధికారులు ఆ పని చేయడం లేదని, బిల్లులు మాత్రం పెట్టుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయానికి పరిమితం కావడంతో కుళాయిలు ద్వారా కలుషితమయి న, వాసన వస్తున్న నీరు వస్తోందని పట్టణ ప్రజలు తెలి పారు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన ఉం డడం లేదని వారు చెప్పారు. ఆక్సిజన్‌ అందకే చేపలు చనిపోయాయని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. చెరువులో నీటిని ప్రస్తుతం కుళాయిల ద్వారా సరఫరా చేయడం లేదని, బోర్ల ద్వారా నీటినే అందిస్తున్నామని వారు తెలిపారు.

Updated Date - 2022-06-25T07:31:31+05:30 IST