భారీ వానతో జలకళ

ABN , First Publish Date - 2020-07-04T10:54:54+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వర్షం కురిసింది. దీంతో వానాకాలం వాతావరణం

భారీ వానతో జలకళ

నీటితో నిండుతున్న చెరువులు

వాగుల్లో వరదపోటు

సాగు పనులు ముమ్మరం

పాలమూరులో ఇళ్లలోకి వచ్చిన నీరు


మహబూబ్‌నగర్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వర్షం కురిసింది. దీంతో వానాకాలం వాతావరణం కనిపించింది. రైతులు అనువైన వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. 


 మహబూబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో వాగులు, చెరువులకు జలకళ వస్తోంది. కురిసిన భారీవానతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 74.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోతై, నారాయణపేట జిల్లాలో 32.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హన్వాడ, మహబూబ్‌నగర్‌ రూరల్‌, అర్బన్‌, భూత్పూర్‌, మూసాపేట, రాజాపూర్‌, మిడ్జిల్‌, మద్దూరు, కోయిల్‌కొండ, దామరగిద్ధ, నారాయణపేట, ఉట్కూరు, గంఢీడ్‌ మండలాల్లో వర్షం కురిసింది.  భూత్పూర్‌, మూసాపేట మండలాల్లో భారీ వర్షంతో ఈ మండలాల నుంచి అడ్డాకుల మీదుగా ప్రవహించే పెద్దవాగుకు వరద పోటేత్తింది.


దీంతో వాగు పరిసరాల్లో బోరుబావుల్లోకి నీరుచేరింది. హన్వాడ, గంఢీడ్‌, నవాబుపేట మండలాల్లో కురిసిన వానకు స్థానికంగా ఉన్న చెరువుల్లోకి నీరు చేరుతోంది. మహమ్మదాబాద్‌ పెద్దచెరువుకు చేరేవాగునీటితో పొంగిపొర్లడంతో చెరువులోకి నీరు వచ్చింది. హన్వాడ మండలంలో కురిసిన వానకు చెరువుల్లోకి నీరుచేరుతోంది. ఈ వానతో జిల్లాలోని 17 చెరువులకు నీరు చేరిందని సాగునీటి శాఖ అధికారులు తెలిపారు. ఈ వానతో రైతులు సాగుపనులు ముమ్మరం చేశారు. ప్రధానంగా పత్తిచేలల్లో అంతరసేద్యం పనులు మొదలయ్యాయి. కృష్ణ మండలంలో నదీతీర గ్రామాల్లో వాన నీటితో పొలాలు నిండాయి.


దీంతో వరినాటేందుకు వీలుగా రైతులు కరిగెట్లు చేస్తున్నారు. మిడ్జిల్‌ మండలంలో వరదనీరు పత్తిచేలల్లో ప్రవహించడంతో పత్తిమొక్కలు నీటమునిగాయి. మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమైంది. బస్టాండ్‌ ముందు రోడ్డుఎత్తుపెంచడం, కల్వర్టు పనులు ఇంకా కొనసాగుతుండటంతో వరదనీరంతా ఒక్కసారిగా బ స్టాండ్‌, డిపోలోకి చేరింది. దీంతో డిపోలోని అన్నిసెక్షన్ల జలమయమయ్యాయి. 


గోపాల్‌పేటలో అత్యధికంగా 89.8 మి.మీ. వాన

వనపర్తి కలెక్టరేట్‌ : వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లోనే భారీ వర్షం నమోదైంది. గోపాల్‌పేట మండలంలో అత్యధికంగా 89.8 మిల్లీ మీటర్ల వాన కురువగా ఘనపురంలో 69.0 మి.మీ., పెద్దమందడిలో 53.0 మి.మీ., వనపర్తి 48.0 మి.మీ., పాన్‌గల్‌లో 46.5 మి.మీ., కొత్తకోటలో  34.8 మి.మీ., పెబ్బేరులో 30.8 మి.మీ., రేవల్లిలో 23.8 మి.మీ., మదనాపురంలో 18.5 మి.మీ. నమోదైంది. 


నాగర్‌కర్నూలు జిల్లాలో 22.6మి.మీ వర్షపాతం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : జిల్లాలో శుక్రవారం సగటున 22.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. జిల్లాలోని వెల్దండ మండలంలో గరిష్టంగా 49.3 మిల్లీ మీటర్లు నమోదు కాగా, అత్యల్పంగా తాడూరు మండలంలో 6.3 మిల్లీమీటర్లు నమోదైంది. వంగూరులో 38.7, పదరలో 37.7, ఊర్కొండలో 34.5, కల్వకుర్తిలో 39.0, బిజినేపల్లిలో 32.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో.. 

గద్వాల, (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 12 మండలాల్లో 148.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కేటీదొడ్డిలో 30.0 మి.మీ, ధరూర్‌లో 18.6 మి.మీ, ఇటిక్యాలలో 13.1 మి.మీ,  ఉండవల్లి, అయిజలో 16.9 మి.మీ.ల వర్షం కురిసింది. 


జూరాలకు కొనసాగుతున్న వరద

 జూరాల ప్రాజెక్టుకు రోజు రోజుకు వరద పెరుగుతోంది. శుక్రవారం 5743 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.66 టీఎంసీల సామర్ధ్యానికి గాను 6.126 టీఎంసీల నిల్వ ఉన్నది. 

Updated Date - 2020-07-04T10:54:54+05:30 IST