నీరు..పయోగంగా..

ABN , First Publish Date - 2021-08-06T06:27:27+05:30 IST

నీరు..పయోగంగా..

నీరు..పయోగంగా..
నేడు : పులిచింతల వద్ద గేటు కొట్టుకుపోవడంతో నీటిని దిగువకు వదులుతూ..

నాడు ప్రకాశం బ్యారేజీ వద్ద బోటు

నేడు పులిచింతల ప్రాజెక్టు వద్ద గేటు

రెండు ఘటనల్లోనూ వృథాగా సముద్రంలోకి పోయిన నీరు

నాగార్జున సాగర్‌ నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో పులిచింతల ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇంతలోనే 16వ నెంబర్‌ గేటులో సాంకేతికలోపం ఏర్పడి గ్రూవ్‌ నుంచి బయటకు రావడంతో వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గురువారం తెల్లవారుజామున పులిచింతల ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటన ఇది.

నాగార్జున సాగర్‌, పులిచింతల నుంచి సుమారు 8 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. ఈ ప్రవాహానికి ఇబ్రహీంపట్నం రేవు వద్ద లంగరేసిన పడవ కొట్టుకుని బ్యారేజీకి చేరుకుని 68వ నెంబర్‌ గేటు వద్ద ఇరుక్కుపోయింది. 2019వ సంవత్సరం ఆగస్టులో జరిగిన ఘటన ఇది. ఎగువ నుంచి వరద తగ్గినా బోటును బయటకు తీయడం కోసం నీటిని సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. 

ఘటనలు వేరైనా ఇక్కడ నీరు వృథాగా సముద్రంలోకి పోవడం కామన్‌ పాయింట్‌. ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి బోటును బయటకు తీసుకురావడానికి ఎంతో శ్రమించారు. ఈ సమయంలో సుమారు 20 టీఎంసీల నీరు సముద్రంలోకి వృఽథాగా పోయింది. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు నుంచి సుమారు 40 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయే పరిస్థితులు ఉన్నాయి. 

విజయవాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి) : పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 42.34 టీఎంసీల నీరు ఉంది. ఇదికాకుండా ఎగువ నాగార్జున సాగర్‌ నుంచి 2లక్షల12వేల292 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే, గురువారం తెల్లవారుజామున 16వ నెంబరు గేటు కొట్టుకుపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అధికారులు పూనుకున్నారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు నీటిమట్టాన్ని తగ్గించడం కోసం గురువారం 5లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీ వైపునకు వదిలారు. శుక్రవారం ఉదయం నాటికి పులిచింతల వద్ద స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాట్లు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు ఎస్‌ఈ రమేశ్‌ ఆధ్వర్యంలో ఈ గేటు ఏర్పాటు పనులు సాగుతున్నాయి.  

స్టాప్‌లాక్‌ గేటు అంటే...

ప్రాజెక్టుకు ఉన్న గేట్లలో దేనికైనా అనుకోకుండా సాంకేతిక అంతరాయం వస్తే నీరు దిగువకు పోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యామ్నాయమే స్టాప్‌లాక్‌ గేటు. ఇది గేటు మాదిరిగానే ఉంటుంది. సాధారణంగా ప్రాజెక్టుకు అమర్చిన గేటు ఒక్కటిగానే ఉంటుంది. స్టాప్‌లాక్‌ గేటు మాత్రం ముక్కలుగా ఉంటుంది. గేటు పొడవును బట్టి ముక్కలు ఉంటాయి. ప్రాజెక్టులో గేటు పైకి లేవడానికి, కిందికి దిగడానికి రెండువైపులా ఇనుప కమ్మీలు ఉంటాయి. వాటిని వర్టికల్‌ గ్రూవ్స్‌గా వ్యవహరిస్తారు. గేటు రెండు అంచులూ ఈ రెండు గ్రూవ్స్‌లో అమర్చి ఉంటాయి. వాటి మధ్య నుంచి గేటు పైకి లేవడం, కిందికి దిగడం చేస్తారు. అసలు గేటు కొట్టుకుపోవడంతో ఆ స్థానంలో స్టాప్‌లాక్‌ గేటును అమర్చుతారు. దీన్ని అమర్చాలంటే ప్రాజెక్టు నీటి మట్టాన్ని తగ్గించాలి. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు. ఇందులో ప్రస్తుతం 172.76 అడుగుల వరకు నీటిమట్టం ఉంది. స్టాప్‌లాక్‌ గేటును అమర్చాలంటే నీటిమట్టాన్ని 140 అడుగులకు తగ్గించాలి. ఇందుకోసం ప్రాజెక్టులోని అన్ని గేట్లను కొంతవరకు ఎత్తి 5లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 140 అడుగులకు చేరుకున్నాక స్టాప్‌లాక్‌ గేటు ముక్కలను క్రేన్‌ (యాంట్రీ) సహాయంతో ఒక దానిపై ఒకటి పేర్చుతారు. పాత గేటు ఎంత ఎత్తు వరకు ఉందో అంతవరకు ఈ ముక్కలను ఏర్పాటు చేస్తారు. ప్రవాహం ఉన్నప్పుడు ఇలాంటి మరమ్మతులు చేయడం కష్టం. అందువల్ల నీటిని కిందకు విడుదల చేసి ప్రత్యామ్నాయ పనులు చేపడతారు. 



Updated Date - 2021-08-06T06:27:27+05:30 IST