పీఎన్‌బీఎస్‌లో నిబంధనలకు నీళ్లు!

ABN , First Publish Date - 2020-06-06T08:43:01+05:30 IST

ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్‌స్టేషన్‌ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌ బీఎస్‌)

పీఎన్‌బీఎస్‌లో నిబంధనలకు నీళ్లు!

వైజాగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ కిటకిట  మాస్క్‌, భౌతిక దూరం ఊసే లేదు  థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించలేని సిబ్బంది

వలస కార్మికులను నియంత్రించలేక ఆర్టీసీ విఫలం  పోలీసు బలగాలు ఉంటేనే పరిస్థితిలో మార్పు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్‌స్టేషన్‌ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌ బీఎస్‌). కమర్షియల్‌ గానూ, ఎంటర్‌టైన్‌మెంట్‌లోనూ భాసిల్లే ఈ స్టేషన్‌లో కొవిడ్‌ - 19 రక్షణ చర్యలు కరువ య్యాయి. ప్రధానంగా వైజాగ్‌ రూట్‌లో ప్రయాణికులను భౌతిక దూరం పాటింపజేసే విషయంలో ఆర్టీసీ అధికారులు ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి! బుకింగ్‌ కౌంటర్లు, సమాచార కేంద్రాల వద్ద సారించిన దృష్టి.. ప్లాట్‌ఫామ్‌లు, బస్సులు ఎక్కే దగ్గర పెట్టకపోవటంతో నిబంధనలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఫలితంగా పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఒకవైపు విశాఖపట్నం బస్‌స్టేషన్‌లో నిబంధన లను ఎంతో కట్టుదిట్టంగా అమలు చేస్తుంటే ఆర్టీసీ కేంద్ర స్థానమైన బెజవాడలో మాత్రం ఆ చర్యలు కరువయ్యాయి. సిబ్బంది ఒక్కరివల్లే అయ్యే పని కాదు కాబట్టి పోలీసుల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. బస్‌స్టేషన్‌లో నిత్యం విధులు నిర్వహించాల్సిన పోలీసులు కూడా కనిపించక పోవటం గమనార్హం.


రీజియన్‌లో బస్సులు పునరుద్ధరించిన తర్వాత భారీ డిమాండ్‌ ఉంటోంది వైజాగ్‌ రూటే! సగటున రోజుకు 40కు పైగా బస్సులు, దాదాపుగా వెయ్యి మంది ప్రయాణికులు వైజాగ్‌ వెళుతున్నారు. దీనికి తోడు వలస కార్మికుల డిమాండ్‌ కూడా వైజాగ్‌ వైపే కావటంతో ప్లాట్‌ ఫామ్‌లు కిటకిటలాడిపోతున్నాయి. 11 రోజులుగా ఇదే పరి స్థితి. వలస కార్మికులను ఒకరిద్దరు సిబ్బంది నియంత్రించ లేకపోతున్నారు. ఇంకా సర్వీసులు పెంచితే రద్దీ నివారించటం కష్టమన్న ఉద్దేశంతో సర్వీసులు పెంచటం లేదు. ఒక్కో సమయంలో వలస కార్మికులు సిబ్బందిపై తిరగబడుతున్నారని, పోలీసు బలగాలను ఇస్తే తప్ప రద్దీని తాము నివారించలేమని పీఎన్‌బీఎస్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. వైజాగ్‌ ప్లాట్‌ఫామ్‌ల వద్ద వలస కార్మికులు సమూహాలుగా మూగుతున్నారు. అక్కడే పడుకుంటున్నారు. ఈ దృశ్యాలను చూస్తే ప్రమాదకరంగా ఉంటోంది. మిగిలిన ప్లాట్‌ఫామ్‌ల దగ్గర మెరుగ్గానే ఉన్నా ఒక్క వైజాగ్‌ ప్లాట్‌ ఫామ్‌ల దగ్గరే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి.


భౌతిక దూరం అన్నది మచ్చుకు కూడా కనిపించటం లేదు. బస్సు రాగానే ఒక్కసారిగా ఎక్కేందుకు ప్రయత్నిస్తుండటంతో రద్దీ పెరిగి తోపులాటకు దారి తీస్తోంది. బస్సుల్లోకి ఎక్కేటపుడు ఽప్రతి ప్రయాణికుడికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ తోపులాటలతో దానికీ విఘాతం కలుగుతోంది. వైజాగ్‌ ప్లాట్‌ఫామ్‌ల పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన ప్లాట్‌ఫామ్‌లలో ప్రయాణికులు కూర్చునే సీటింగ్‌ వద్ద ఇబ్బందికరంగానే ఉంటోంది. ఒంగోలు, గుంటూరు, రాయలసీమ సెక్టార్‌వైపున ఉన్న ప్లాట్‌ఫామ్‌లలో సీటు విడిచి సీటు కూర్చునే పరిస్థితి లేదు. మాస్క్‌ తప్పనిసరి అయినా చాలామంది వినియోగించటం లేదు. పర్యవేక్షించేందుకు తగిన సిబ్బంది లేక పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. 

Updated Date - 2020-06-06T08:43:01+05:30 IST