దిష్టిబొమ్మల్లా వాటర్‌ ట్యాంకులు

ABN , First Publish Date - 2021-08-02T05:02:29+05:30 IST

తాగునీటి కోసం అల్లాడే ప్రజల కోసం కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వాటర్‌ ట్యాంకులు అఽధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి.

దిష్టిబొమ్మల్లా వాటర్‌ ట్యాంకులు
బుచ్చి మండలం కట్టుబడిపాళెంలో ఉపయోగంలో లేని వాటర్‌ ట్యాంక్‌

నిరుపయోగంగా నిర్మాణాలు

అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం

రక్షిత మంచినీటికి ఖర్చు చేసిన కోట్లు వృథా

ప్రజాధనం నీటిపాలు


నెల్లూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కోసం అల్లాడే ప్రజల కోసం కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వాటర్‌ ట్యాంకులు అఽధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. ఆ ట్యాంకుల మంజూరుకు నాయకులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. అయినా ప్రజల కష్టం ఊరి మధ్యలో నిరుపయోగంగా  మారింది. రూ.30 నుంచి 40 లక్షల వ్యయంతో నిర్మించిన ట్యాంకులను నిరుపయోగంగా వదిలేసినా అధికారులు మిన్నకుండిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ట్యాంకు శుభ్రం చేసే బాధ తప్పుతుందని కొందరు,.. ఆ పార్టీ వారు కట్టిన ట్యాంకు నీళ్లు ప్రజలకు సరఫరా చేయడానికి మనసొప్పక మరికొందరు... ప్రజలు డైరెక్టు పంపింగ్‌ ఇష్టపడుతున్నారని ఇంకొందరు... ఇలా పలు కారణాలతో జిల్లాలోని వాటర్‌ ట్యాంకులను నిరుపయోగంగా వదిలేశారు. 


తాగునీటి ఎద్దడి నివారణకు..


ప్రజల అవసరాన్ని బట్టి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ గ్రామాల్లో ట్యాంకులు నిర్మించింది. తాగునీటి ఎద్దడి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు పథకాల ద్వారా కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ ట్యాంకులను ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పంచాయతీ శాఖకు(డీపీవో)కు అప్పగించింది. పంచా యతీ శాఖ ఈ ట్యాంకుల నిర్వహణ చూసుకోవాలి. పంచాయ తీ కార్యదర్శి, సచివాలయాలు ఈ ట్యాంకుల నిర్వహణ బా ధ్యతలను పర్యవేక్షించాలి. ట్యాంకులను వినియోగించడంతో పాటు వాటి నిర్వహణ, శుభ్రత తదితర వ్యవహారాలన్నీ పంచాయతీలు, గ్రామ సచివాలయాలే చూసుకోవాలి. జిల్లా పంచాయతీ శాఖ వీటిని పర్యవేక్షించాలి. అయితే కట్టి పంచా యతీశాఖ అప్పగించేశాం, మా బాఽధ్యత తీరిపోయిందని ఆర్‌డబ్ల్యూఎస్‌, పర్యవేక్షణ మానుకుంది. ఎవరడుగుతారులే అని పంచాయతీ అధికారులు... ఇలా ఎవరికి వారు గాలికి వదిలేయడంతో వాటర్‌ ట్యాంకులు  నిరుపయోగంగా మారాయి. జిల్లా పరిధిలో ఇలా నీటి చుక్కకు నోచుకోని నీటి ట్యాంకులకు వివరాలు ఇలా ఉన్నాయి.

కావలి రూరల్‌  మండలం కొత్తపల్లిలో రూ.33 కోట్లతో నిర్మించిన రక్షిత నీటి పథకానికి రాజకీయ గ్రహణం పట్టుకుంది.   2013-14లో టీడీపీ ప్రభుత్వ హయాంలో నేషన ల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ వాటర్‌ ప్రోగ్రామ్‌ (ఎనఆర్‌డీ డబ్ల్యూసీ) కింద ట్యాంక్‌ నిర్మించి పంచాయతీకి అప్పగించారు. అప్పుడు..ఇప్పుడూ టీడీపేతర నాయకులే ఈ పంచాయతీపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కారణంగా టీడీపీ హయాంలో నిర్మించిన ఈ ట్యాంకును వినియోగించడం ఇష్టం లేక ఇలా గాలికి వదిలేసినట్లు  గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం డైరెక్ట్‌ పంపింగ్‌ ద్వారా ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. 

అనంతసాగరం మండలంలోని 30 గ్రామాలకు మినరల్‌ వాటర్‌ అందించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన పథకం పేరు మారింది తప్ప పనులు పూర్తి కాలేదు. దీంతో రెండేళ్లుగా నిర్మించిన ట్యాంకర్లు నిరుపయోగంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ సుజలధార పేరుతో ఈ పథకాన్ని మంజూరు చేశారు. ప్రభుత్వం మారిన క్రమంలో వైఎస్‌ఆర్‌ సుజలధారగా పథకం పేరు మార్చారు.  వైఎస్‌ఆర్‌ సుజ లధార పథకం కింద రూ.3.56 కోట్లతో పనులు మొదలయ్యాయి. రెండేళ్లుగా పథకం పూర్తి కాలేదు. నిర్మించిన మినీ ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. 

మనుబోలు మండలం మడమనూరు, వెంకన్నపా ళెం, చెర్లోపల్లి గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు అలంకార ప్రాయంగా నిలిచి ఉన్నాయి. ట్యాంకుల్లో నీరు నింపకుండా డైరెక్ట్‌ పంపింగ్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 

ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో నీటి ట్యాంక్‌  కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఇక్కడ కూడా డైరెక్ట్‌ పంపింగ్‌ చేస్తూ లక్షల వ్యయంతో నిర్మించిన ట్యాంక్‌ను గాలికి వదిలేశారు. 

బాలాయపల్లి మండలం అక్కసముద్రంలో 2017-18 లో ఎనఆర్‌జీడబ్ల్యూ పథకం కింద రూ. 45 లక్షలతో ట్యాంక్‌ నిర్మించారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికి వినియోగంలోకి తీసుకొని రాలేదు. 

వెంకటాచలంలో వాటర్‌ ట్యాంక్‌ నిరుపయోగంగా ఉంది. ఇక్కడ తాగునీటిని కూడా డైరెక్ట్‌ పంపింగ్‌ చేస్తున్నారు. 

బుచ్చి మండలం కట్టుబడిపాలెం వాటర్‌ ట్యాంక్‌ ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది.  గ్రామస్థుల దాహార్తిని తీ ర్చేందుకు వవ్వేరు పంచాయతీ పరిధిలో కనిగిరి రిజర్వాయర్‌ నుంచి పైలెట్‌ ప్రాజెక్టుగా దీన్ని నిర్మించారు. ఈ ట్యాంకును పునరుద్ధరించమని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వరికుంటపాడు మండల పరిధిలోని అన్ని పంచాయ తీల పరిధిలోని వాటర్‌ ట్యాంకులు నిరుపయోగంగానే ఉన్నాయి. 

కొండాపురం మండలం కొత్తపల్లిలో నిర్మించిన ట్యాంకు కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంది. 

ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది మండలాలతోపాటు మర్రిపాడు మండలంలోని అన్ని పంచాయతీలలోని ప్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2018లో ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం కింద రూ.19.81 కోట్లతో పనులు ప్రారంభించారు. టీడీపీ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి అయ్యాయి.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పథకానికి వైఎస్‌ఆర్‌ సుజల స్రవంతిగా పేరు మార్చారు. కాని రెండేళ్లు గడుస్తున్నా ఇంకా  20 శాతం పనులు పూర్తి కాలేదు. దీంతో ఈ పథకం కోసం నిర్మించిన ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి.



Updated Date - 2021-08-02T05:02:29+05:30 IST