నిండు చెరువులోకి ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2021-12-03T05:01:37+05:30 IST

కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మండలంలోని రెడ్డిపాలెం వద్ద చెరువులోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లి ఒక పక్కకు వాలింది. ఒడ్డున ఉన్న పిచ్చిమొక్కలు అడ్డుపడటంతో బస్సు వేగం తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే నిండుగా ఉన్న చెరువులోకి బస్సు దూసుకెళ్తే పెను ప్రమాదం సంభవించేది.

నిండు చెరువులోకి ఆర్టీసీ బస్సు
చెరువులో పడిన బస్సు నుంచి వెలుపలకు వస్తున్న ప్రయాణికులు


పిచ్చి మొక్కలు అడ్డురావడంతో నెమ్మదించిన వాహనం

నీళ్లలోకి వెళ్లకుండా ఒక పక్కకు వాలడంతో తప్పిన ప్రాణాపాయం 

28 మంది ప్రయాణికుల్లో నలుగురికి స్వల్పగాయాలు 

భయంతో డ్రైవర్‌కు పక్షవాత లక్షణాలు 

కందుకూరు నుంచి కనిగిరి వెళ్తుండగా ఘటన 


పొన్నలూరు, డిసెంబరు 2 : కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మండలంలోని రెడ్డిపాలెం వద్ద చెరువులోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లి ఒక పక్కకు వాలింది. ఒడ్డున ఉన్న పిచ్చిమొక్కలు అడ్డుపడటంతో బస్సు వేగం తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే నిండుగా ఉన్న చెరువులోకి బస్సు దూసుకెళ్తే పెను ప్రమాదం సంభవించేది. ఎదురుగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ను బస్సు డ్రైవర్‌ తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు తెలిపారు. ఈ హఠాత్తు పరిణామంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. గమనించిన పరిసరాల వారు పరిగెత్తుకుని వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. వీరికితోడు బస్సులోని ప్రయాణికులు కూడా ఒకరికొకరు సాయం చేసుకుని ఓ వైపు అద్దాల నుంచి వెలుపలకు వచ్చారు. ఈ ఘటనకు భయపడిన డ్రైవర్‌ శ్రీనుకు పక్షవాత లక్షణాలు రావడంతో వెంటనే కందుకూరు ఏరియా వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. విషయం తెలుసుకున్న పొన్నలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


ధ్వంసమైన రోడ్డులో అడ్డదిడ్డంగా ప్రయాణించడంతో ప్రమాదం

ఊళ్లపాలెం-వేములపాడు (ఓవీరోడ్డు)లో ప్రమాదాలు ఇటీవల నిత్యకృత్యమయ్యాయి. రోడ్డు పూర్తిగా దెబ్బతిని పోవడంతో వాహనదారులు నిబంధనల ప్రకారం వెళ్లకుండా రోడ్డు ఎటు బాగుంటే ఆ వైపు వాహనాలను పోనిస్తున్నారు. అనుకోకుండా జరుగుతున్న ఈ పరిణామాలతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. బస్సు ప్రమాదానికి కారణం ఇదేనని ప్రయాణికులు సైతం చెప్పారు. రోడ్డు దెబ్బతినడంతో వాహనచోదన సాహసంలా మారిందని వాహనచోదకులు వాపోతున్నారు.

Updated Date - 2021-12-03T05:01:37+05:30 IST