నీళ్లొచ్చేది ఎప్పుడో..?

ABN , First Publish Date - 2021-06-20T06:59:10+05:30 IST

కాల్వలకు నీటిని విడుదల చేసినప్పటికీ కొన్ని పంట కాల్వలకు శనివారం నాటికి కూడా నీరందలేదు. ఫలితంగా సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజల కష్టాలు తీవ్రమయ్యాయి.

నీళ్లొచ్చేది ఎప్పుడో..?

  • అమలాపురం పంట కాల్వకు విడుదలకాని సాగునీరు
  • రిటైనింగ్‌వాల్‌ నిర్మాణ పనులే జాప్యానికి కారణం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కాల్వలకు నీటిని విడుదల చేసినప్పటికీ కొన్ని పంట కాల్వలకు శనివారం నాటికి కూడా నీరందలేదు. ఫలితంగా సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజల కష్టాలు తీవ్రమయ్యాయి. కాల్వలకు 15న నీటిని విడుదల చేసినప్పటికీ అమలా పురం ప్రధాన పంటకాల్వ మధ్యలో ఓ ప్రాంతంలో క్రాస్‌బండ్‌ వేయడం వల్ల ఆ కాల్వతోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న కాల్వలకు నీరు అందలేదు. రైతుల నుంచి అభ్యంతరాలు లేకపోవడంతోనే కాల్వలకు నీటి విడుదలలో కొంత జాప్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు. నిర్ణీత సమయంకంటే పంతొమ్మిది రోజులు ఆల స్యంగా కాల్వలకు నీటి విడుదల చేయడంతో ఇప్పటికే ఖరీఫ్‌ సాగులో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు ఈనెల 15న కాల్వలకు నీటిని విడుదల చేశారు. అయితే అమలాపురం, బెండాకెనాల్‌తోపాటు వాటికి అనుసంధానంగా ఉన్న అనేక పంట కాల్వలకు ఇప్పటికీ నీరందలేదు. కారణం ఏమిటంటే అమలాపురం రూరల్‌ మండ లం పాలగుమ్మి, అంబాజీపేట మండలం మొసలపల్లి వద్ద నుంచి ముక్కామల వరకు రోడ్డు విస్తరణలో భాగంగా ప్రధాన పంటకాల్వకు కుడివైపున రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు ఆర్‌అండ్‌బీశాఖ పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల కోసం పంటకాల్వ మధ్యలో క్రాస్‌బండ్‌ వేశారు. ఫలితంగా పంటకాల్వకు నీటి విడుదలను నిలుపుదల చేశారు. అధికారులు ఈనెల 15న విడుదల చేసిన నీరు ముక్కామల లాకు వరకు వచ్చింది. అక్కడ షట్టర్లు మూసివేశారు. దాంతో అమలాపురం ప్రధాన పంటకాల్వ, దానికి అనుసంధానంగా ఉన్న కాల్వలకు నీటి విడుదల గత నాలుగు రోజుల నుంచి స్తంభించిపోయింది. అయితే కాల్వ పరిధిలోని ఆయకట్టుదారులు నీటిని విడుదల చేయాలంటూ రైతులు అధికారులను కోరుతు న్నారు. మరోవైపు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్నందున మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. దీనిపై అమలాపురం ఇరిగేషన్‌ డీఈ కుంబా రాంబాబును ప్రశ్నించగా క్రాస్‌బండ్‌ వల్ల నీటి విడుదల జాప్యమైందని, ఒకట్రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని చెప్పారు.

Updated Date - 2021-06-20T06:59:10+05:30 IST