గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. ట్యాం‘కరువు’..

ABN , First Publish Date - 2022-03-22T18:40:44+05:30 IST

ఎండలు ముదురుతుండడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయి...

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి కష్టాలు.. ట్యాం‘కరువు’..

  • రోజుకు 350 వరకు పెండింగ్‌
  • 1500కు పైగా ఆర్డర్‌లు
  • వేసవిలో భారీగా పెరిగిన డిమాండ్‌

ఎండలు ముదురుతుండడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడం, వాటర్‌బోర్డు సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో కొన్ని ప్రాంతాలవాసులు ట్యాంకర్లను కొనాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. పది రోజుల క్రితం వరకు ట్యాంకర్‌ బుక్‌ చేయగానే వెంటనే సరఫరా చేసేవారు. రోజు రోజుకూ ఎండలు తీవ్రమవుతుండడంతో ట్యాంకర్ల కోసం పెద్దఎత్తున బుకింగ్‌లు పెరుగుతున్నాయి. బోర్డుకు ఇటీవల రోజుకు 1500లకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయడం అధికారులకు సవాల్‌గా మారుతోంది.


హైదరాబాద్‌ సిటీ : వేసవి నేపథ్యంలో మహానగరానికి నీటి అవసరాలు పెరిగాయి. భూగర్భ జలాలు తగ్గడంతో కొన్ని బోర్లు పని చేయడం లేదు. ప్రధానంగా మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, నిజాంపేట, తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. వాటర్‌బోర్డు సరఫరా చేసే నీరు మాత్రమే ఆధారంగా మారింది. బోర్లు పని చేయకపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసుల అవసరాలు తీరడం లేదు. ఈ నేపథ్యంలో వాటర్‌బోర్డు ట్యాంకర్లను బుక్‌ చేస్తున్నారు. సాధారణ రోజు ల్లో రోజుకు 500 నుంచి 700 వరకు ట్యాంకర్ల బుకింగ్‌లు ఉండేవి. వేసవి నేపథ్యంలో రెండింతలకు పైగా పెరిగాయి. మున్ముందు రెండు వేలకు పైగా బుకింగ్‌లు పెరుగుతాయని వాటర్‌బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.


ఏరోజుకారోజు కష్టమే..

 బుకింగ్‌ల ఆధారంగా ట్యాంకర్లను సరఫరా చేస్తున్నా రోజుకు కనీసం 350 వరకు ట్యాంకర్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. బుక్‌ చేసుకున్న 24 గంటల గడిస్తే కానీ ట్యాంకర్‌ వినియోగదారులకు చేరడం లేదు. ప్రధానంగా ఆలియాబాద్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కేపీహెచ్‌బీ, బంజారాహిల్స్‌, ఎస్‌ఆర్‌నగర్‌, షేక్‌పేట, మియాపూర్‌ తదితర వాటర్‌బోర్డు ఫిల్లింగ్‌ స్టేషన్ల పరిధిలో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో కమర్షియల్‌, డొమెస్టిక్‌ ట్యాంకర్ల బుకింగ్‌లు భారీగా పెరిగాయి. బోర్డు ట్యాంకర్ల రాక ఆలస్యం కావడంతో కొందరూ ప్రైవేటు ట్యాంకర్లను బుక్‌ చేసుకుంటున్నారు.

Updated Date - 2022-03-22T18:40:44+05:30 IST