Abn logo
May 28 2020 @ 11:33AM

మండుతున్న ఎండ‌లు...నీళ్ల డ్ర‌మ్ముల‌కు తాళాలు!

భోపాల్‌: సాధార‌ణంగా విలువైన వ‌స్తువుల‌ను లాకర్ల‌లో పెట్టుకుని తాళాలు వేసుకుంటారు. అయితే నీళ్ల డ్ర‌మ్ముల‌కు తాళాలు వేయ‌డం ఎప్పుడూ చూసివుండ‌రు. కానీ మధ్యప్రదేశ్‌లోని జాబువా జిల్లాకు ఈ మండు వేసవిలో నీటి డ్ర‌మ్ముల‌కు తాళాలు వేసుకునే పరిస్థితి ఎదుర‌య్యింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాల‌ని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ఈ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు గొంతు త‌డుపుకునేందుకు, చేతులు క‌డుక్కునేందుకు సైతం చుక్క‌నీరు లేక అల్లాడిపోతున్నారు. ప్ర‌స్తుత వేస‌వికాలంలో జిల్లాలోని నీటి వ‌న‌రులు అడుగంటిపోయాయి. జాబువా జిల్లాలోని జోన్సార్ గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరం నుండి నీటిని తీసుకువస్తారు. రోజంతా ఇదే ప‌నిలో ఉంటారు. ఆ నీటిని డ్ర‌మ్ముల్లో  పోసుకుని, ఎవ‌రూ దొంగిలించ‌కుండా ఆ డ్ర‌మ్ముల‌కు తాళాలు వేస్తారు. ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం అధికారి మాట్లాడుతూ గ్రామంలో పవర్ పంపులు, హ్యాండ్ పంపులు ఉన్నా వేస‌విలోనీటి మట్టం తగ్గిన కార‌ణంగా నీటి ఎద్ద‌డి ఏర్ప‌డుతున్న‌ద‌ని అన్నారు. గ్రా‌మంలో తాగునీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. 

Advertisement
Advertisement