ఖరీఫ్‌లో ముంపు.. రబీలో ఎద్దడి

ABN , First Publish Date - 2022-01-24T05:56:59+05:30 IST

ఖరీఫ్‌కు ముంపు కష్టాలు.. రబీ సాగులో నీటి కష్టాలతో ఆ కాల్వ శివారు ప్రాంత భూముల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాగాం-అయినాపురం పంటకాల్వ శివారు భూముల రైతులకు ప్రతీ సాగులోనూ ఇదే పరిస్థితి.

ఖరీఫ్‌లో ముంపు.. రబీలో ఎద్దడి
అయినాపురంలో బీటలు వారుతున్న వరి చేను

ముమ్మిడివరం, జనవరి 23: ఖరీఫ్‌కు ముంపు కష్టాలు.. రబీ సాగులో నీటి కష్టాలతో ఆ కాల్వ శివారు ప్రాంత భూముల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాగాం-అయినాపురం పంటకాల్వ శివారు భూముల రైతులకు ప్రతీ సాగులోనూ ఇదే పరిస్థితి. ఈ పంట కాల్వ నిడివి సుమారు 16 కిలోమీటర్లు. దీనిపై 4,500 ఎకరాల్లో వరి సేద్యమవుతోంది. అయితే కాల్వ ఎగువ ప్రాంతంలో నీటి సరఫరాకు అంత సమస్య లేకపోయినా కాల్వ శివారు భూములైన ముమ్మిడివరం, సోమిదేవరపాలెం, అయినాపురం ప్రాంతాల్లో రబీలో ప్రతీఏటా సాగునీటి ఇబ్బంది ఏర్పడుతోంది. కాల్వలో గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోవడంతో పాటు ఎగువప్రాంతంలోని ఇరిగేషన్‌ బోదెలకు ఏర్పాటుచేసిన పైపులు ధ్వంసమై వృధాగా మురుగునీటి కాల్వలోకి సాగునీరు వెళ్లిపోవడంతో ముమ్మిడివరం, సోమిదేవరపాలెం, అయినాపురం గ్రామాల్లో వరి పొలాలు నీటి ఎద్దడికి గురవుతున్నాయి. ప్రస్తుత రబీలో అయినాపురంలో కనీసం నారుమళ్లు తడుపుకునేందుకు కూడా సాగునీరు సక్రమంగా అందట్లేదు. ఊడ్చిన వరి చేలు, విత్తనం వెదజల్లిన వరి పొలాలు బీటలు వారుతున్నాయి. అయినాపురం రైతులు ఈ యేడాది ఖరీఫ్‌లో ముంపు సమస్యతో క్రాప్‌ హాలీడే ప్రకటించారు. రబీలోనైనా సాగుచేసుకుందామని ఎంతో ఆశతో సిద్ధం కాగా సాగునీరు సక్రమంగా అందక ఇబ్బందిపడుతున్నారు. సీజను ప్రారంభంలోనే ఆయిల్‌ ఇంజన్లతో భూమిని తడుపుకునే పరిస్థితి నెలకొంది. ఇలా ఇంజన్ల సహాయంతో భూమిని తడుపుకుంటూపోతే చివరకు మిగిలేదేమీ ఉండదని, పెట్టుబడే తడిసి మోపుడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Updated Date - 2022-01-24T05:56:59+05:30 IST