నీరు లేదు

ABN , First Publish Date - 2020-08-08T08:25:28+05:30 IST

గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులకు భారీ నీరు వస్తోంది. కానీ నిండటం లేదు. కారణం.. చెరువుల తూములు, అలుగులు దెబ్బతినిపోయాయి.

నీరు లేదు

వర్షాలు కురిసినా చెరువులు ఖాళీ

దెబ్బతిన్న తూములు, అలుగులు 

మరమ్మతులు పట్టని అధికారులు 

ఆందోళన చెందుతున్న రైతులు


రుద్రవరం, ఆగస్టు 7: గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువులకు భారీ నీరు వస్తోంది. కానీ నిండటం లేదు. కారణం.. చెరువుల తూములు, అలుగులు దెబ్బతినిపోయాయి. వచ్చిన నీరు వచ్చినట్లు కిందికి పారిపోతోంది. నీరు రావడమేగాని ఖాళీగా కనిపిస్తున్న చెరువులను చూసి రైతులకు కడుపు తరుక్కుపోతోంది. చెరువులో నీరు నిలిస్తే సాగు చేద్దామనుకున్న వారికి నిరాశే ఎదురైంది. చెరువుల తూములు, అలుగులు ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోలేదు. వర్షాలకు చెరువుల్లోకి చేరిన నీరంతా వృథాగా పోతోంది.


దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిధులు లేవంటూ చిన్న నీటిపారుదలశాఖ అధికారులు చేతులెత్తేశారు. రుద్రవరం మండలం పెద్దకంబలూరు కేశవరాజు చెరువు కింద సుమారు 200 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఈ చెరువుకు 2 తూములు ఉన్నాయి. ముకుందాపురం ఎర్ర చెరువు, కొండమాయపల్లె చిన్నరాజు చెరువు, టి.లింగందిన్నె, చింతలచెరువు, రుద్రవరం పెద్దరాజు చెరువుకు తూము, చిన్నకంబలూరు అక్కిరెడ్డి చెరువులకు అలుగులు, తూములు దెబ్బతిన్నాయి. దీంతో నీరు నిలవడం లేదు. అధికారులు మాత్రం నిధులు లేవని పట్టించుకోవడం లేదు. 


అధికారులకు ఫిర్యాదు చేశాం: శ్రీనివాసాచారి, రైతు, పెద్దకంబలూరు 

చెరువు తూము మరమ్మతు చేయించాలని, నీరు వృథా అవుతోందని అధికారులకు ఫిర్యాదు చేశాం. 10 ఎకరాల ఆయకట్టు సాగు చేయాల్సి ఉంది. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. 


వరి నారు సాగు చేయాలి: నరసింహ, కౌలు రైతు, పెద్దకంబలూరు 

కేశవరాజు చెరువు కింద సాగు చేసేందుకు 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. వరి నారు సాగు చేసేందుకు చెరువులో నీరు లేదు. తూములు సరిగా లేక పోవడంతో వర్షపు నీరు వచ్చినా చెరువు ఖాళీగా ఉంటోంది. 


నిధులు మంజూరు కాలేదు: రఘురాముడు, చిన్ననీటి పారుదలశాఖ ఏఈ, రుద్రవరం 

గతంలో చేయించిన పనులకు నిధులు మంజూరు కాలేదు. తూములు, అలుగులు దెబ్బతిన్నాయి. రైతులు మా దృష్టికి తీసుకుని వస్తున్నారు. పనులు చేయించేందుకు నిధులు మంజూరు కాలేదు. 


Updated Date - 2020-08-08T08:25:28+05:30 IST