నీటి గండం!

ABN , First Publish Date - 2021-06-14T05:05:20+05:30 IST

పరిగి మునిసిపల్‌ పరిధిలో నీటిసరఫరా విధానం అస్తవ్యస్తంగా

నీటి గండం!
పరిగి మునిసిపల్‌ పరిధిలో నీటి సరఫరా కాని తిరుమల రెసిడెన్సీ కాలనీ

  • పరిగి పురపాలికలో తాగునీటి సమస్య
  • ఉన్నచోట వృథా... లేనిచోట కష్టం
  • కొత్త కాలనీల్లో ట్యాంకులు లేవు.. నీటి సరఫరా లేదు. 
  • ఎండిపోతున్న వ్యక్తిగత బోర్లు... పట్టించుకోని అధికారులు


పరిగి: పరిగి మునిసిపల్‌ పరిధిలో నీటిసరఫరా విధానం అస్తవ్యస్తంగా తయారైంది. మిషన్‌భగీరథ, మునిసిపల్‌ అధికారుల అలసత్వం కారణంగా నీళ్లకోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పరిగి పట్టణం ఏటేటా విస్తరిస్తుంది. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకనుగుణంగా నీటి సరఫరా జరగడం లేదు. ఎక్కువగా వ్యక్తిగత బోర్ల ద్వారా వచ్చే నీటిని వినియోగిస్తున్నారు. బోర్లలో నీరు తగ్గిపోయినప్పుడు ప్రజలు అవస్థలు పడుతున్నారు.

అధికారులు, పాలకులకు ముందుచూపులేని కారణంగా నీటి సమస్య తలెత్తుతుంది. ఐదారేళ్ల నుంచి పరిగి పట్టణం రెండింతలుగా పెరిగింది. దానికనుగుణంగా నీటి వనరుల వసతిని కల్పించలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారుల తప్పిదం వల్ల నీళ్లు ఎక్కువగా వచ్చి వృథాగా పోతున్నాయి. మరికొన్ని కాలనీల్లో అయితే అసలు నీటి వసతియే లేదు. ఆ కాలనీల్లో వ్యక్తిగత బోర్లను వినియోగిస్తున్నారు. అయితే మునిసిపల్‌ అధికారులు నీటి వృథాను అరికట్టలేకపోతుండగా, మరోవైపు కొత్త కాలనీలకు నీటి వసతిని కల్పించలేకపోతున్నారు. పరిగి మునిసిపల్‌ పరిధిలోని 2011 లెక్కల ప్రకారం 15,250 జనాభా ఉంది. అదే ఎస్‌కేఎస్‌ ప్రకారం 18,179 జనాభా ఉంది. ప్రస్తుతం సుమారు 25 వేల జనాభా ఉండొచ్చు. ఆ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల చొప్పున 20,58,750 లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 33.75 లక్షల లీటర్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రోజుకు 15 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అంటే రోజుకి సగటు వ్యక్తికి 60లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పరిగి మున్సిపాలిటీ పరిధితో దాదాపుగా 25 వేల జనాభా ఉంటుంది. అయితే ఈ జనాభాలో ప్రతి వ్యక్తికి 135 లీటర్ల చొప్పున సరఫరా చేస్తే 33.75 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అంటే మిషన్‌ భగీరథ నీరు సగం కూడా సరఫరా కావడం లేదు. 


అసలు నీటివసతి లేని కాలనీలు

పరిగి మునిసిపల్‌ పరిధిలోని అసలు నీటి సరఫరా లేని కాలనీలు చాలానే ఉన్నాయి. తిరుమల రెసిడెన్సీ, భవానినగర్‌, అనంతనగర్‌, మైత్రీనగర్‌; అనురాగ్‌కాలనీ, అనంతంకాలనీ, వెంకటేశ్వరకాలనీ చివర ఉన్న అన్ని కాలనీలు, సుల్తాన్‌నగర్‌ వెళ్లే దారిలోని కాలనీలకు నీటి సరఫరా చేసే పైపులైన్లే లేవు. అక్కడ నీటి సరఫరా అసలు జరగడం లేదు. ఈ కాలనీల్లో కుటుంబాలు వ్యక్తిగత బోర్ల ద్వారా వచ్చే నీటినే వినియోగిస్తున్నాయి. మునిసిపల్‌కు అన్నిరకాల పన్నులు చెల్లిస్తున్నా, నీటి వసతిని ఎందుకు కల్పించడం లేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి కొత్తకాలనీల్లో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 


ఉన్నచోట నీరంతా వృథా

మునిసిపల్‌ పరిధిలో చాలా ప్రాంతాల్లో నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించు కోవడం లేదు. పైపులైన్లు దెబ్బతిని నీరు రోడ్డుపై పారుతోంది. మరికొన్ని చోట్ల ట్యాంకులు నిండి తాగునీరు వృథా అవుతోంది. సిద్దాంతికాలనీ, విజయ్‌నగర్‌కాలనీ, శ్రీనివాస్‌నగర్‌కాలనీ, కొడంగల్‌ చౌరస్తాలో మిషన్‌భగీరథ నీరు దారుల వెంట పారుతోంది. నిత్యం లక్షకుపైగా లీటర్ల నీరు వృథాగా పోతోంది. పలుకాలనీల్లో నల్లాల నుంచి వచ్చే నీటిని ఇళ్లలో వాడుకున్న తర్వాత పైపులను మురికికాలువల్లోకి వదులుతున్నారు. ఇలా నీరు వృథా పోతున్న మున్సిపల్‌, భగీరథ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.


తాగునీరు వృథా అవుతోంది..

మునిసిపల్‌ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అనేక కాలనీల్లో నీరు వృథాగా పోతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. ఒక సిద్దాంతికాలనీలో ఉన్న ట్యాంకు దగ్గర నుంచి నిత్యం వేలాది లీటర్ల నీరు వేస్ట్‌ అవుతోంది. రోడ్డుపై అరకిలోమీటరు వరకు నీరు పారుతుంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. 

   - ఎ.రవీందర్‌, సిద్దాంతికాలనీ,పరిగి 


కొత్తకాలనీలో నీటిసరఫరా లేదు

కొత్తకాలనీలకు నీటిసరఫరా కావడం లేదు. తిరుమల రెసిడెన్సీకాలనీలో ఇళ్ళు నిర్మించి మూడేళ్లు అవుతుంది. ఇప్పటివరకు మునిసిపల్‌ నుంచి పైపులైన్‌లు కూడా వేయలేదు. వ్యక్తిగత బోర్లతోనే కాలం గడపుతున్నాం. బోర్లలో నీరు తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి కొత్తగా వాటర్‌ ట్యాంకు, పైపులైన్లు వేసి నీటి సమస్యను తీర్చాలి.

    - లక్ష్మయ్య, తిరుమల రెసిడెన్సీ,పరిగి 


జనాభాకనుగుణంగా నీటిసరఫరాకు చర్యలు

పరిగి మునిసిపల్‌ జనభాకను గుణంగా ప్రతి వ్యక్తికి రోజుకూ 135 లీటర్ల చొప్పును సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే మిషన్‌భగీరథ ద్వారా వస్తున్న నీరు పట్టణ ప్రజలకు సరిపోను రావడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటి జనాభా ఆధారంగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తకాలనీల్లో పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాం. 

   -ఎం.అశోక్‌,మునిసిపల్‌ చైర్మన్‌,పరిగి



Updated Date - 2021-06-14T05:05:20+05:30 IST