విడిపోతే.. జల జగడాలే!

ABN , First Publish Date - 2022-01-28T06:20:47+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో జలవనరుల పంపకం సంక్లిష్టమయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.

విడిపోతే..   జల జగడాలే!

ప్రతిపాదిత గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు

పల్నాడులో నుంచి గుంటూరుకు ఎన్‌ఎస్‌పీ కాలువలు


గుంటూరు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియని ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో జలవనరుల పంపకం సంక్లిష్టమయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. జిల్లాలో నాగార్జునసాగర్‌ కుడికాలువ, కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు ఉన్నాయి. సాగర్‌ నీటి విడుదల విషయంలో ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్య సమస్యలు ఉన్నాయి. రేపటి రోజున మూడు జిల్లాలుగా విడిపోతే కాలువలకు నీటి విడుదలలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల ఎగువ ప్రాంతం అంతా కొత్తగా ఏర్పడే గుంటూరు జిల్లాలోకి వస్తుంది. డెల్టా ఆయకట్టు దిగువ ప్రాంతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంటుంది. దాంతో వివిధ కాలువల ద్వారా నీటి విడుదల సజావుగా జరగకపోతే రెండు జిల్లాల మధ్యన వివాదాలు ముసురుకొంటాయి. నాగార్జునసాగర్‌ కుడికాలువ విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా ఏర్పడే పల్నాడు జిల్లా నుంచి సాగర్‌ కాలువల ద్వారా సాగు/ తాగునీరు ఇటు గుంటూరు, అటు ఒంగోలు జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. 



కృష్ణా పశ్చిమ డెల్టా ఆయకట్టు కింద సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. పశ్చిమ ప్రధాన కాలువ తాడేపల్లి మండలం నుంచి మొదలై దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి, కొల్లూరు, చేబ్రోలు, పొన్నూరుల మీదగా కొన్ని కాలువలున్నాయి. అలానే మరికొన్ని కాలువలు భట్టిప్రోలు, రేపల్లె, వేమూరు, చుండూరు, అమర్తలూరు, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, చెరుకుపల్లి, నగరం  తదితర మండలాల మీదగా చీరాల వైపు వెళతాయి. ఈ ప్రాంతాలు ప్రతిపాదిత బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం కాలువలన్ని కేడబ్ల్యూడీ తెనాలి ఈఈ పరిధిలో ఉన్నాయి. రేపటి రోజున గుంటూరు, బాపట్ల జిల్లాలు విడిపోతే సాగు, తాగునీటి క్రమబద్ధీకరణ ఎలా చేస్తారో ప్రశ్నార్థకంగా మారింది. ఎగువున ఉన్న కాలువల నుంచి అక్కడి ఆయకట్టుకు నీరు ఎక్కువగా వదిలితే దిగువున ఉండే ప్రాంతాలకు సాగు, తాగునీరు అందదు. అప్పుడు రెండు ప్రాంతాల మధ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. 



నాగార్జునసాగర్‌ కుడికాలువ ఆయకట్టు కింద ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని మండలాలున్నాయి. ఏటా గుంటూరు, ప్రకాశం జిల్లాల మధ్యన నీటి సమస్యలు ఈ విషయంలో తలెత్తుతున్నాయి. గతంలో ఇరు జిల్లాల కలెక్టర్లు గొడవపడిన సందర్భాలున్నాయి. ఈ కాలువ ఆయకట్టు కింద 11.17 లక్షల ఎకరాలున్నాయి. లింగంగుంట్ల, ఒంగోలు సర్కిల్స్‌లో కార్యాలయాలు ఉన్నాయి. లింగంగుంట్ల సర్కిల్‌ కింద 6.74 లక్షల ఎకరాలు, ఒంగోలు సర్కిల్‌ కింద 4.42 లక్షల ఎకరాలున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలతో సతమతమౌతుంటే కొత్తగా నీటిని మూడు జిల్లాలకు పంపకం చేయాల్సి ఉంటుంది. పల్నాడు, గుంటూరు, ఒంగోలు జిల్లాల మధ్యన సమస్యలు రాకుండా చూడాలి. ఇది ఎంతో క్లిష్టమైన అంశం. 


సముద్రతీర ప్రాంతమంతా బాపట్ల జిల్లాలోకే..

ప్రస్తుతం గుంటూరు జిల్లా విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. బాపట్ల, రేపల్లె, కర్లపాలెం, నిజాంపట్నం మండలాల్లో సముద్రతీరం విస్తరించి ఉంది. బాపట్లలో ఉన్న సూర్యలంకలో బీచ్‌తో పాటు ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌, నిజాంపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ ఉంది. సముద్రతీరం మొత్తం బాపట్లలోకి వెళ్లిపోవడం వలన గుంటూరు జిల్లాకి పర్యాటకం, రవాణ రూపంలో వచ్చే ఆదాయం కోల్పోతుంది. పరిశ్రమలు కూడా ఎక్కువగా చిలకలూరిపేట పరిసరాల్లోనే ఉన్నాయి. వీటన్నింటిని ఎలా సరి చేస్తారో తెలియకుండా ఉంది. 


Updated Date - 2022-01-28T06:20:47+05:30 IST