నెలవుతోంది.. నీరేది?

ABN , First Publish Date - 2022-07-09T05:19:48+05:30 IST

గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా జూన్‌లోనే కృష్ణాడెల్టా కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తాం.. ఖరీఫ్‌లో రైతులకు సిరుల పంట పండేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం.. పంట చేతికొచ్చే సమయంలో ఎదురవుతున్న ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేందుకు ముందస్తు ప్రణాళిక అంటూ పాలకులు ఆర్భాటం చేశారు.

నెలవుతోంది.. నీరేది?
నీరు విడుదల చేసి నెలైనా ఇంకా వల్లభాపురం వద్ద నీటి ఆనవాళ్లు లేని కృష్ణా పశ్చిమ బ్యాంక్‌ కెనాల్‌

డెల్టా కాల్వలకు చేరని సాగునీరు

జూన్‌ 10న మంత్రి విడుదల చేసిన నీరెటెళ్లిందో 

రేపటికి నెలవుతున్నా ప్రధాన కాల్వల్లో పారని వైనం

బ్యారేజి నుంచి 10 కి.మీటర్ల వరకు కూడా చేరని నీరు

మాయమైందా.. మార్గం మారిందా.. రైతుల వ్యంగ్యాస్త్రాలు

ప్రణాళికా లోపంతో డెల్టా పరిధిలో ఈసారి సాగు ఆలస్యమే

 

ముందస్తు సాగు నీరన్నారు.. జూన్‌ 10న మంత్రి అంబటి రాంబాబు బ్యారేజి వద్ద సాగునీటిని విడుదల చేశారు. ఆదివారంతో నీరు విడుదల చేసి నెలవుతోంది. అయితే ఆ నీరు ఎటుపోతోందో.. ఏమో ఎవరికీ తెలియడంలేదు. ముందస్తు సాగునీరు వచ్చేస్తోందని రైతులు పొలాలను సిద్ధం చేసుకుని నెల రోజులుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఇంతవరకు సాగునీటి ఆనవాళ్లు కాదుకాదా.. ఆ సవ్వడులు కూడా డెల్టా కాల్వల్లో కానరావడంలేదు. సాధారణంగా బ్యారేజి నుంచి నీరు దిగువకు వదిలితే వారం నుంచి పది రోజుల్లో అన్ని ప్రధాన కాల్వల చివరి వరకు చేరతాయి. కానీ గత నెలలో వదిలిన నీరు ఎటుపోతున్నాయనేది మాత్రం అంతుపట్టని విషయం.  విడుదలైన సాగునీరు ఆవిరైపోయిందా.. లేదంటే మాయమైందా.. మార్గం మారిందా అంటూ డెల్టా రైతులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ముందస్తు ప్రణాళిక.. నీటి విడుదల ప్రభుత్వ ఆర్భాటాలకే పరిమితమైందన్న విమర్శలు రైతన్నల నుంచి వ్యక్తమవుతున్నాయి. 


తెనాలి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా జూన్‌లోనే కృష్ణాడెల్టా కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తాం.. ఖరీఫ్‌లో రైతులకు సిరుల పంట పండేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం.. పంట చేతికొచ్చే సమయంలో ఎదురవుతున్న ప్రకృతి విపత్తుల నుంచి బయటపడేందుకు ముందస్తు ప్రణాళిక  అంటూ పాలకులు ఆర్భాటం చేశారు. అన్నట్లుగానే జూన్‌ 10నే  డెల్టా కాల్వలకు నీటిని విడుదల చేశారు. నీరు వదిలి ఆదివారానికి సరిగ్గా నెల రోజులు అవుతున్నా ఆ ఆనవాళ్లు కాల్వల్లో కానరావడంలేదు. ముందస్తు వ్యవసాయ ప్రణాళిక లేకపోయినా జూలై మొదటి వారంలోనే ఖరీఫ్‌ హడావిడి మొదలవుతుంది.   నారుమళ్లు పోయడం, వెద పద్ధతిలో నాట్లు వేయడం, విత్తనాలు చల్లడం వంటివి జరిగిపోయేవి. ఆ సమయంలో వెయ్యి నుంచి 2 వేల క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడంతో కాల్వలకు అడుగున నీరు ప్రవహిస్తే వాటిని ఆయిల్‌ ఇంజన్లు, విద్యుత్‌ మోటార్లతో నారుమళ్లకు పెట్టేవారు. తర్వాత క్రమంగా సాగు విస్తీర్ణం పెరగడం, నీటి ఆవశ్యకత పెరుగుతూ వస్తుంది. ఈ తరుణంలో 7 వేల నుంచి 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేవారు. కానీ నెల నుంచి కేవలం 300 క్యూసెక్కులు ఇచ్చామనిపిస్తున్నారు. దీనికితోడు వర్షాలు కూడా చాలినంత పడకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ముందస్తుగా చెప్పుకొచ్చినట్టు ఎక్కడా జూన్‌ నెలలో నాట్లు కాదుకదా, నారుమళ్లుకూడా పడలేదు. కొన్ని మండలాల్లో మాత్రం వెద పద్ధతిలో విత్తులు చల్లుతున్నారు. జూన్‌ 10 నుంచి నేటికీ కృష్ణా పశ్చిమ డెల్టా కాల్వలకు వదులుతున్న నీరు కేవలం 300 క్యూసెక్కులు మాత్రమే. ఈ నీరు సీతానగరం నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వ ద్వారా దుగ్గిరాల వరకు వచ్చి మిగిలిన కాల్వలకు అవసరాలకు తగిన విధంగా మళ్లింపు జరుగుతుంది. అయితే దీనికి ముందే బ్యాక్‌ కెనాల్‌ వస్తుంది. ఇది సముద్ర తీరంలోని లంకెవానిదిబ్బ వరకు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సీతానగరం నుంచి ఈ కాల్వ ప్రారంభ ప్రదేశానికి 8 కి.మీటర్లలో ఉంటుంది. అయితే ఈ కాల్వలోకి ఇంతవరకు నీరు చేరలేదు. కేవలం 300 క్యూసెక్కుల నీటిని తీసుకున్నందునే ఈ పరిస్థితి. విడుదల చేసిన నీరు ప్రధాన కాల్వలో సీపేజి పోను దుగ్గిరాల డిస్ట్రిబ్యూటరీ పాయింట్‌కు కేవలం 133 క్యూసెక్కులు మాత్రమే చేరుతుంది. బ్యాంక్‌ కెనాల్‌ తర్వాత పెదకాకాని, పొన్నూరు మండలాల పొలాలకు నీటిని అందించే హైలెవల్‌ ఛానల్‌కి నీరు ఎక్కాలంటే కనీసం 4వేల క్యూసెక్కులు విడుదల చేయాలి.   దుగ్గిరాల చేరిన 133 క్యూసెక్కుల్లో 70 క్యూసెక్కులు కొమ్మకూరు కెనాల్‌కు ఇస్తున్నారు. కానీ ఇవికూడా సరిగా చివరివరకు చేరకుండా కొల్లిమర్ల లాకుల దగ్గర డ్రెయిన్‌లో కలిసిపోతుంది. లాకులు లేకపోవడం, మధ్యలో కట్టలు, షట్టర్ల మరమ్మత్తులు లేకపోవటంతో ప్రారంభంలోనే వృథాగా పోతున్నాయి. మరోపక్క బ్యాంక్‌ కెనాల్‌కు 20 క్యూసెక్కుల నీరు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే నెలవుతున్నా కాల్వ ప్రారంభం నుంచి 7 కి.మీటర్ల దూరంలో ఉన్న వల్లభాపురం వరకు కూడా చుక్కనీరు చేరలేదు. కాల్వల్లో గడ్డిమొలిచి పచ్చని మైదానాలను తలపిస్తున్నాయి. అటు తూర్పు కాల్వకు 25 క్యూసెక్కులు, పడమర కాల్వకు 18 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. నిజాంపట్నం, హైలెవల్‌ ఛానళ్లకు అసలు చుక్క కూడా విడుదల చేయలేదు. నిజాంపట్నం కాల్వ కింద తక్కువ విస్తీర్ణమే ఉండటం వల్ల పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు. కానీ మిగిలిన కాల్వలకు ఇంకా నామమాత్రపు నీటినే వదిలామనిపించుకుంటున్నారు. అదేమంటే రైతులు సద్వినియోగం చేసుకోవటంలేదని తప్పుకుంటున్నారు. 


ఇదేనా ముందస్తు ప్రణాళిక

గతంలో ఎవరూ ఇవ్వలేని విధంగా జూన్‌లో సాగునీటిని విడుదల చేస్తున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళతామని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే జూన్‌ 10న నీటిని విడుదల చేసిన మంత్రి తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. ప్రణాళిక ప్రకారం అని గొప్పగా చెప్పుకొచ్చినా, అక్కడ నీటిపారుదల, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మధ్య సమన్వయం లోపించింది. విత్తనాలు, ఎరువుల వంటివి ముందస్తుగా అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం కేవలం నీటిని విడుదల చేశామనిపించి, వాటిని వదిలేసింది. ఎరువుల నుంచి విత్తనాల వరకు కొరత తప్పడంలేదు. యఽథావిధిగానే సాగు ఆలస్యమై చివరకు విపత్తుల సమయంలోనే పంట చేతికొచ్చే పరిస్థితి ఏర్పడింది. నీటిని వదిలాం... మా పనైపోయిందన్నట్లు చేతులు దులుపుకుంది. దీంతో ఈ నెల రోజులు వదిలిన నీరు కూడా వృథానే అవుతుంది. రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున ఇప్పటి వరకు 9వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోయినట్టే. ఇరిగేషన్‌ శాఖ ప్రణాళిక ప్రకారం అయినా, ఎగువ నుంచి షట్టర్లు మూసివేస్తూ ఒక్కో ప్రాంతానికి నీరందిస్తూ దిగువకు ఇస్తారు. ఈ తతంగమంతా జరగటానికి కనీసం నెల పడుతుంది. ప్రభుత్వ శాఖల వైఫల్యంతో జూన్‌ నెల ఆవిరైపోతే, కనీసం జూలై నెల రెండు వారాలు గడిచిపోతున్నా ఖరీఫ్‌ ఊపందుకోలేదు. ఇప్పటికైనా వ్యవసాయ అనుబంధ శాఖలన్నీ కలసి కలిసొచ్చేలా సాగు ప్రణాళిక సిద్ధం చేస్తేనే నష్టాల నుంచి రైతు గట్టెక్కేది.

 


Updated Date - 2022-07-09T05:19:48+05:30 IST