గార్డెనింగ్ ఆహ్లాదాన్నిచ్చే వాటర్‌ లిల్లీ

ABN , First Publish Date - 2021-06-21T07:09:08+05:30 IST

ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి.

గార్డెనింగ్ ఆహ్లాదాన్నిచ్చే వాటర్‌ లిల్లీ


ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి కావాలి. స్వచ్ఛమైన గాలి కావాలంటే ఇంట్లో మొక్కలు ఉండాల్సిందే. మొక్కలున్న చోట ఆహ్లాదం, ఆరోగ్యం ఉంటాయి. అభిరుచిని బట్టి ఇంట్లో వాటర్‌ పాండ్‌ను పెట్టుకుని వాటర్‌లిల్లీ పెంచుకోవచ్చు. కుండీలో మామిడి మొక్కను పెంచుకునే సౌలభ్యం కూడా ఉంది. ఆ విశేషాలు ఈ వారం తెలుసుకుందాం...


వాటర్‌ లిల్లీ మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా? అని చాలా మంది అడుగుతుంటారు. నిస్సందేహంగా పెంచుకోవచ్చు. సాయంత్రం వేళల్లో ఆహ్లాదాన్ని అందించేలా వాటర్‌లిల్లీతో వాటర్‌పాండ్‌ను తీర్చిదిద్దుకోవచ్చు. మీరు అనుకున్నంత సైజులో పెంచుకోవచ్చు. చిన్న టబ్‌లో కూడా డిజైన్‌ చేసుకోవచ్చు. వాటర్‌లిల్లీ టబ్స్‌ ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. మంచి డిజైన్‌లో కావాలంటే వాటిని ఎంచుకోవచ్చు. సింగపూర్‌ లిల్లీ రకం బాగా నప్పుతుంది. చూడటానికి సుందరంగా, ఇంటి బ్యూటీని రెట్టింపు చేసేలా ఉంటుంది. వాటర్‌పాండ్‌ పెట్టుకోవడం వల్ల దోమలు వృద్ధి చెందుతాయి అనుకుంటారు కానీ అది నిజం కాదు. వాటర్‌లిల్లీ మొక్క ఉన్న చోట దోమలు ఉండవు. 


ఇండిపెండెంట్‌ హౌజ్‌ ఉన్నట్లయితే నార్త్‌ ఈస్ట్‌ కార్నర్‌లో చిన్న లాన్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంటి అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. రాత్రివేళ ఆ ప్రదేశంలో కూర్చుని క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ చేస్తే ఆ ఆనందమే వేరు. ఉదయం ఏడు నుంచి ఎనిమిది లోపల ఆ లాన్‌లో యోగా లేదా వ్యాయామం చేసినా ఆస్తమా, బ్రీతింగ్‌ సమస్యలుంటే దూరమవుతాయి. లాన్‌ వల్ల ఎలాంటి స్కిన్‌ అలర్జీలు రావు. చెట్ల మధ్యన నివసించే వారికి బ్రీతింగ్‌ సమస్యలు దరిచేరవు.

 

ఇంట్లో మామిడి మొక్కలు పెంచుకోవాలనుకునే వారు ఆల్ఫాన్సా అనే రకాన్ని ఎంచుకోవచ్చు. ఇది మనదేశంలో ఖరీదైన రకం మొక్క. మార్కెట్లో మూడున్నర సంవత్సరాల వయస్సున్న మొక్కలు దొరుకుతాయి. ఏడున్నర అడుగుల వరకు పొడవుంటాయి. కాయలు కాస్తున్న మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకోవచ్చు. ఈ మామిడి మొక్కను 3/3 కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఈ కుండీలో 11 ఏళ్ల పాటు మొక్కను పెంచే వీలుంది. అంటే దాదాపు మామిడి చెట్టు పదిహేనేళ్ల పాటు కుండీలోనే ఉంటుంది. ఈ ప్లాంట్‌ వల్ల ఉపయోగమేమిటంటే నిర్వహణ సులభం. కుండీలో సైతం పెంచుకోవచ్చు. 

Updated Date - 2021-06-21T07:09:08+05:30 IST