దాహార్తి తీర్చలేరా?

ABN , First Publish Date - 2022-05-19T06:52:09+05:30 IST

వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

దాహార్తి తీర్చలేరా?
బిందెలతో మహిళల భారీ ప్రదర్శన

సత్యసాయి మంచినీటి పథకాన్ని పునరుద్ధరించాలని బిందెలతో మహిళల భారీ ప్రదర్శన
గోపాలపురం, మే 18: వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన గోపాలపురంలో సత్యసాయి మంచినీటి పథకాన్ని పునరుద్ధరించి ప్రజల దాహార్తి తీర్చాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో సుమారు 500 మంది మహిళలు ఖాళీ బిందెలు తీసుకుని నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ బుధవారం నిర్వ హించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి ఎంపీడీవోకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ముప్పిడి మాట్లాడుతూ వైసీపీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మెట్ట ప్రాంతంలో 16 మండలాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఈ పథకంలో 16 మండలాల్లో 145 మంది కార్మికులు పని చేస్తున్నారని, పథకం నిలిచిపోవడంతో ఆయా కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరంతరాయంగా ఈ పథకం కొనసాగిందన్నారు. కార్మికులకు ఇవ్వాల్సిన రూ.2 కోట్లను ఇవ్వలేక రూ.150 కోట్ల ప్రాజెక్టును నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. మెట్ట ప్రాంత ప్రజల దాహర్తిని తీర్చాలని మొద్దు నిద్రలో ఉన్న ప్రజాప్రతినిధులను మెల్కొల్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఇప్పటికే ప్రజలు ధరల పెంపుతో ఽప్రభుత్వ తీరుపై విసిగిపోయారన్నారు. అసలే మెట్ట ప్రాంతం కావడంతో సత్యసాయి మంచినీటి జలాలను నిలిపివేయడంతో ఈ ప్రాంత ప్రజలు శుద్ధి చేసిన జలాలను ప్రైవేటు వాటర్‌ ప్లాంట్ల వద్ద కొనుగోలు చేసి మరీ దాహార్తి తీర్చుకుంటున్నారన్నారు. గతంలో సుమారు మూడు నెలలపాటు సత్య సాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు నిరసన దీక్షలు చేపట్టారన్నారు. ఆ సమయంలో మేము ఉన్నాము, మేము విన్నాము అంటూ నిరసన శిబిరాలను సందర్శించి మాట ఇచ్చిన వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే ఎందుకు ఈ పథకాన్ని పునరుద్ధరించలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని అన్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఉండవల్లి రత్నకుమారి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు గంగిరెడ్డ మేఘ లాదేవి, తెలుగు మహిళా అధికార ప్రతినిధి కొయ్యలమూడి సుధారాణి, మహిళా అనుబంధ సంఘాల నాయకులతో పాటు గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల నాయకులు, రొంగలి సత్యనారాయణ, కొయ్య లమూడి చినబాబులతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-19T06:52:09+05:30 IST