గ్రావెల్‌ కోసమే.. గండి..!

ABN , First Publish Date - 2022-05-05T06:45:13+05:30 IST

పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని సిద్దారెడ్డిగారిపల్లె సమీపంలో కాలేటివాగును 25ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ వాగు కింద దాదాపు 1000ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 300ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. గత

గ్రావెల్‌ కోసమే.. గండి..!
బుధవారం గ్రావెల్‌ను తరలిస్తున్న టిప్పట్లు

ఎత్తిపోతల పథకం కోసం కాంట్రాక్టర్‌ నిర్వాకం

కాలేటి వాగు ఆయకట్టుకు నీరు ప్రశ్నార్థకం

ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులు


‘‘కాలేటి వాగు (చెరువు)పై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకానికి గ్రావెల్‌ అవసరం. కాంట్రాక్టర్లు ఎకరానికి రూ.4 నుంచి రూ.5లక్షలు పెట్టి కొని గ్రావెల్‌ తోలాలి. దీంతో వీరి కన్ను కాలేటివాగుపై పడింది. కాలేటివాగులో నీరులేకపోతే అందులో ఉన్న వందల ఎకరాల్లో గ్రావెల్‌ తీసుకోవచ్చు. అందుకే కాలేటివాగుకు గండికొట్టారు. వాగు కింద సాగవుతున్న పంటల గురించి ఏమాత్రం ఆలోచించలేదు. నీళ్లన్నీ వెళ్లిపోవడంతో మా పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది’’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా..


కడప, మే 4 (ఆంధ్రజ్యోతి): పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలోని సిద్దారెడ్డిగారిపల్లె సమీపంలో కాలేటివాగును 25ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ వాగు కింద దాదాపు 1000ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రస్తుతం 300ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. గత ఏడాది అంతకుముందు ఏడాది వరుసగా భారీ వర్షాలు కురవడంతో కాలేటివాగు చెరువుకు పుష్కలంగా నీరు చేరింది. మరో ఏడాది వర్షం రాకపోయినా నీరు ఉండే పరిస్థితి ఉంది. దీంతో రైతులు కూడా చెరువును నమ్ముకొని పంటలు సాగుచేసుకున్నారు. ఇప్పుడు కొన్ని పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో కాలేటివాగుకు గండకొట్టడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.


గ్రావెల్‌ కోసమే..?

సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో రూ.5.36కోట్లతో కాలేటివాగుపై ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. దీనిని 1.2 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా కాలేటివాగు చెరువు ఉన్న ప్రాంతంలో 1.20 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగిన మరో పెద్దచెరువు నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చెరువుకు కావాల్సిన కట్ట నిర్మాణానికి గ్రావెల్‌ అవసరమవుతోంది. గ్రావెల్‌ కోసం ఎకరం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలు వెచ్చించి కాంట్రాక్టర్లు కొనుక్కోవాల్సి ఉంది. దీంతో కాంట్రాక్టర్ల కన్ను కాలేటివాగుపై పడింది. చెరువులో నీరు లేకపోతే వందల ఎకరాల్లో ఉన్న గ్రావెల్‌ కావాల్సినంత కట్టకు తరలించవచ్చని నిర్ణయానికి వచ్చారు. వెంటనే రాత్రికి రాత్రే ఎక్సకవేటర్‌ సాయంతో కాలేటివాగు కట్టకు గండికొట్టారు. దీనితో చెరువులో నీరంతా వంకపాలైంది. 


నెలక్రితమే అలుగుకు గండి..

నెలరోజుల క్రితమే కాంట్రాక్టర్లు చెరువుకు ఉన్న అలుగుకు గండికొట్టారు. అప్పటికి నీరు పూర్తిగా బయటకు పోకపోవడంతో ఇప్పుడు కట్టకే గండికొట్టారు. గండికొడుతూనే నీరు పారడంతో బుధవారం కాంట్రాక్టర్లు గ్రావెల్‌ తోలడం ప్రారంభించారు. చేపల కోసం గండికొట్టారని, మరోదానికి గండికొట్టారని మొదట ప్రచారం సాగించారు. చివరకు చూస్తే గ్రావెల్‌ కోసమే గండికొట్టినట్లు తేటతెల్లమైంది. నీటి కోసం కోట్లు ఖర్చుచేస్తుంటే ఉన్న నీటిని గండి కొట్టి మరీ వాగుపాలు చేశారంటే ఇక్కడి అధికారులు, కాంట్రాక్టర్ల పనితీరు ఎలాఉందో ఇట్టే అర్థమవుతోంది. ఏదిఏమైనా ఒక నిర్మాణం చేసేందుకు మరో నిర్మాణాన్ని కూల్చడమేమిటో అధికారులే సమాధానమివ్వాలి.


పంటలకు నీరెలా..?

కాలేటి వాగుకింద ప్రస్తుతం 300 ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా నిమ్మ, పత్తి, ప్రొద్దుతిరుగుడు పంటలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పొద్దుతిరుగుడు కోత దశలో ఉంది. దీనికి ఎక్కువ నీళ్లు లేకపోయినా పెద్దగా ఇబ్బంది లేదు. అయితే పత్తిపంట పూత దశలోఉంది. ఇప్పుడు నీటి తడులు లేకుంటే పత్తి పంటకు బాగా దెబ్బతింటుంది. అలాగే ప్రస్తుతం మార్కెట్‌లో నిమ్మకాయలకు ధర బాగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో 100 కాయలు రూ.1200 కూడా పలుకుతోంది. కాపు అరకొర ఉంది. ఉన్న కాతను కాపాడుకుంటే నిమ్మరైతులు లాభాలు చూసే అవకాశం ఉంది. ఇప్పుడు చెట్లకు నీళ్లు అవసరం. ఇలాంటి సమయంలో కాలేటివాగుకు గండికొట్టడంతో వీరు నష్టపోయే అవకాశం ఉంది. దీంతో పత్తి, నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు.  గండికొట్టి నీరు వృథాగా బయటకు పోయేలా చేసినా.. ఆ చెరువును పరిశీలించేందుకు అధికారులు ఎవరూ అటువైపు వెళ్లకపోవడం గమనార్హం. దీనిపై ఎస్‌ఈ మల్లికార్జునను వివరణ కోరగా.. ఈ రోజంతా జిల్లా ఇరిగేషన్‌ సమీక్ష సమావేశంలో ఉన్నామని, గురువారం వెళ్లి పరిశీలిస్తామన్నారు.


గ్రావెల్‌ కోసం గండికొట్టడం దుర్మార్గం

వైసీపీ నేతల స్వార్థంతో..

పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయాయి

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి 

చక్రాయపేట, మే 4: గ్రావెల్‌ కోసం కాలేటి వాగు అలుగుకు, తూముకు గండికొట్టడం దుర్మార్గమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండలంలోని కాలేటి వాగు డ్యాంను తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ నాయకులు స్వార్థం కోసం సాగునీటి ప్రాజెక్టులకు గండికొడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల స్వార్థంతో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోయాయన్నారు. ఇపుడు కాలేటి వాగు రిజర్వాయరు వంతు వచ్చిందన్నారు. 

పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం మండల సిద్దారెడ్డిగారిపల్లె వద్ద 25 సంవత్సరాల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలేటివాగు మీద ఆనకట్ట కట్టి కాలేటివాగు ప్రాజెక్టు నిర్మించిందన్నారు. తక్కళ్లపల్లె, సిద్దారెడ్డిగారిపల్లె, మల్లప్పగారిపల్లె, జోజిరెడ్డిగారిపల్లె తదితర గ్రామాలకు చెందిన దాదాపు 1000 ఎకరాలకు సాగునీరందిస్తుందన్నారు. గత ఏడాది వర్షాలు బాగా కురిసినందున రిజర్వాయరు పూర్తిగా నిండిందన్నారు. రైతులు పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలు వేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల కాలేటివాగు ఎత్తిపోతల పథకం మంజూరుచేసిందన్నారు. గాలేరు-నగరి ప్రధాన కాల్వ నుంచి కాలేటివాగు రిజర్వాయరు నీటిని మళ్లించి, అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, వీరబల్లె మండలంలోని చెరువులకు నీటిని ఎత్తిపోసేట్లు దీనిని డిజైన్‌ చేశారన్నారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టుకు కావాల్సిన గ్రావెల్‌ కోసం సంబంధిత కాంట్రాక్టరు కాలేటి వాగు రిజర్వాయరును ఖాళీ చేసేందుకు ఫిబ్రవరిలో యంత్రాలతో అలుగుకు గండికొట్టారన్నారు. దీనితో 50శాతం రిజర్వాయరు నీరు పాపాఘ్ని ఏటిపాలైందన్నారు. అంతటితో ఆగక మళ్లీ తూము షట్టరు కూడా యంత్రాలతో పీకేశారన్నారు. దీని వలన రిజర్వాయర్‌ పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఒకవేళ వర్షాలు వచ్చినా రిజర్వాయరులో నీరు నిలవదన్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అలుగు గండిని మూసివేసి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు.




Read more