గొంతు తడపని గోదావరి

ABN , First Publish Date - 2022-09-19T05:20:53+05:30 IST

ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు వైసీపీ ఇచ్చిన ప్రధాన హామీ వాటర్‌గ్రిడ్‌ పథకం.

గొంతు తడపని గోదావరి

ముందుకు సాగని వాటర్‌గ్రిడ్‌ 

పథకానికి రూ.1400 కోట్లు కేటాయింపు

మూడేళ్లయినా ఇంకా టెండర్ల దశలోనే ..

డబ్బులిచ్చి కొనుగోలు చేయాల్సిన దుస్థితి

తాగునీటి కష్టాలు ఎప్పటికి తీరేనో ?

ఏలూరుసిటీ, సెప్టెంబరు  18:

ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు వైసీపీ ఇచ్చిన ప్రధాన హామీ వాటర్‌గ్రిడ్‌ పథకం.  అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ఇప్పటికీ ఈ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం నిర్థారణ దశలో ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాలు ఉండగా వాటిలో 29 డెల్టా మండలాలు, 19 మెట్ట మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో 19 మండ లాలు, ఏలూరు జిల్లాలో 20 మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మండలాలు చేరాయి. అయితే అప్పట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టాలో విచ్చలవిడిగా త్రవ్విన చేపల చెరువుల తవ్వకాలతో తాగునీరు కలుషితమైంది. తాగునీటి సరఫరా పథకం ద్వారా పంచాయతీ సరఫరా చేసే నీటితో గొంతు తడుపుకోలేని పరిస్థితులు న్నాయి. దాహం తీరాలంటే తాగునీరు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. జిల్లాలో ప్రతి కుటుంబాలకు ఖర్చు చేసే సొమ్ములు కంటే తాగునీటి కోసం వెచ్చించే సొమ్ములు అధికంగా ఉన్నాయి. రోజుకు రూ.20  నుంచి రూ.40 చొప్పున నెలకు వెయ్యి రూపాయిల వరకు తాగునీటి కోసం వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు ఈ ఖర్చులను భరించలేని పరస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అయితే ఈ ఖర్చులను తట్టుకోలేక కుళాయి నీరే తాగుతున్నారు. వాటర్‌గ్రిడ్‌ పథకం ద్వారా జిల్లాలోని 26 మండలాల్లోని 17.85 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ప్రభుత్వం వచ్చి మూడేళ్లు దాటినా ఇంకా ఈ పథకం టెండర్లు స్థాయిలోనే ఉంది. టెండర్లు ప్రక్రియ త్వరితగతిన పూర్తయితే ఇప్పటికైనా ఈ పథకంలో పనులు  ప్రారంభమైతే ప్రజల తాగునీటి కష్టాలు తీరే అవకాశాలున్నాయి. 

 నెరవేరని వైసీపీ హామీ

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వాటర్‌గ్రిడ్‌ పథకం త్వరిత గతిన పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే ఈ పథకం ఇంకా శ్రీకారం చుట్టలేదు. ఆనాడు ఈ వాటర్‌గ్రిడ్‌ పథకం పూర్తి స్థాయిలో అమలు అయితే ప్రజల మంచినీటి కష్టాలు తీరతాయని భావించారు. ఆ విధంగానే పథకాన్ని కూడా రూపొందించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 1,140 రూరల్‌ హేబిటేషన్లులోని కుటుంబాలకు మంచినీరు అందించే విదంగా ఈ పథకాన్ని మార్పులు చేశారు. మొదట్లో ఈ పథకం వ్యయం ఎక్కువగా ఉన్నా ఆ తర్వాత కొన్ని మార్పులు చేసి చివరకు ఈ పథకాన్ని రూ.1400 కోట్లతో చేపట్టాలని నిర్ణయించారు. పస్తుతం వాటర్‌గ్రిడ్‌ పథకం ఎవాల్యుయేషన్‌ స్టేజిలో ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి అన్ని అనుమతులు లభించడంతో టెండర్లు దిశగా ఈ పథకం ఉందని చెబుతున్నారు. టెండర్లు ప్రక్రియ జరిగితే ఈ పథకం పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. . 

గోదారి జలాలు వచ్చేదిలా..

వాటర్‌గ్రిడ్‌ పథకం నిర్వహణను మూడు సెగ్మంట్లుగా నిర్ణయించారు. ఇందులో నరసాపురం, తణుకు, ఏలూరు సెగ్మంట్లుగా విభజించారు. నరసాపురం సెగ్మెంట్‌లో నిడదవోలు, తణుకు (కొంత భాగం), ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. తణుకు సెగ్మెంట్‌లో తణుకు (కొంత భాగం), భీమవరం, ఉండి నియోజకవర్గాలున్నాయి. ఏలూరు సెగ్మెంట్‌లో ఉంగుటూరు, ఏలూరు నియోజక వర్గాలున్నాయి. గోదావరి నీటిని విజ్జేశ్వరం రిజర్వాయర్‌ ద్వారా మూడు సెగ్మెంట్‌లలోని నియోజకవర్గాలకు సరఫరా చేసేందుకు ప్రత్యేక పైప్‌లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం మూడు ట్రంక్‌లుగా విభజించారు. ట్రంక్‌–1లో నిడదవోలు నుంచి నరసాపురం వరకు, ట్రంక్‌–2లో తణుకు నుంచి భీమవరం వరకు, ట్రంక్‌–3లో ఉంగుటూరు నుంచి ఏలూరు వరకు నీటిని సరఫరా చేయటానికి ప్రత్యేక వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆయా నియోజకవర్గాలలోని గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలని నిర్ణయించారు. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో శుద్ధి చేసిన నీటిని సంప్‌ల ద్వారా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు పంపి అక్కడ నుంచి గ్రామాలకు సరఫరా చేస్తారు. ఈ పథకం అమలు జరిగితే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మంచినీటి కష్టాలు తీరే అవకాశాలున్నాయి. 


Updated Date - 2022-09-19T05:20:53+05:30 IST