స్టోరేజి ఫుల్‌ - సరఫరా నిల్‌

ABN , First Publish Date - 2021-04-11T06:05:38+05:30 IST

మండలంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు తాగేందుకు సరఫరా చేసే సాగర్‌ జలాలు 13 రోజులుగా సరఫరా జరగడం లేదు.

స్టోరేజి ఫుల్‌ - సరఫరా నిల్‌
నిండు కుండలా చందవరం-1 మంచినీటి స్టోరేజీ


దొనకొండ, ఏప్రిల్‌ 10 : మండలంలోని గ్రామాలకు చెందిన ప్రజలకు తాగేందుకు సరఫరా చేసే సాగర్‌ జలాలు 13 రోజులుగా సరఫరా జరగడం లేదు. దీంతో గుక్కెడు మంచినీళ్ల కోసం 13 రోజులుగా దాదాపు 29 గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టోరేజీలో సమృద్ధిగా సాగర్‌ జలాలు ఉన్నా.. నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వలన తాము తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు విమర్శిస్తున్నారు.

 దొనకొండ మండలంలోని 29 గ్రామాల ప్రజల దాహర్తి నిమిత్తం నెదర్లాండ్‌ ఆర్థిక సహకారంతో 1982లో 885 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో చందవరం సమీపంలోని సాగర్‌ కాలువకు రెండు కిలోమీటర్ల దూరంలో చందవరం-1 మంచినీటి స్టోరేజి ట్యాంకు నిర్మించారు. దాదాపు 39 సంవత్సరాలు గడవడంతో పథకం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ పైపులైన్‌, మోటార్లు నిత్యం మొరాయిస్తున్నాయి. పదిహేనేళ్లగా ఇదే పరిస్థితి ఉన్నా.. మరమ్మతులు చేస్తూ పని గడిపేస్తున్నారు. స్టోరేజీ నుంచి 100, 75 హెచ్‌పీ సామర్థ్యంతో రెండు విద్యుత్‌ మోటార్లు నీటిని పుంపు చేస్తుంటాయి. ప్రస్తుతం 100 హెచ్‌పీ మోటారు తరచూ మొరాయిస్తోం ది. దీన్ని మరమ్మతు చేసేదుకు సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బంది పడుతు న్నారు. గత పదిహేను రోజులుగా ఈ మోటారు మొరాయిస్తోంది. దీంతో నీటిసరఫరా జరగడం లేదు. ఆర్ధికంగా ఉన్నవారు మినరల్‌ వాటర్‌ కొనుగోలు చేసుకొని తాగుతున్నారు. నిరుపేదలు బోరు నీటిని తాగి వివిధ వ్యాధులకు గురవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుతం వేసవి ఎండలకు గ్రామాల్లో బోర్లు సైతం నీరు అందక మోరాయిస్తున్నాయని సాగర్‌ జలాలే తమకు దిక్కని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు  చందవరం-1 మంచినీటి స్టోరేజీ  పథకంపై దృష్టిసారించి నూతన మోటార్లు మంజూరు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా, రెండు రోజులకు ఒకసారి తాగేందుకు క్రమం తప్పకుండా సాగర్‌ జలాలు సరఫరా జరిగేలా చర్యలు చేపట్టి తమ దాహర్తి తీర్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

20 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇదే తంతు 

ప్రతి ఏడాది పధకంకు చెందిన మోటార్లు, పైప్‌లైన్‌ మరమ్మత్తులు గురవ్వటం నీటి సరఫరా నిలచిపోవటం తాము మంచినీటి ఇబ్బందులు ఎదుర్కోవటం గత 20 ఏళ్లుగా ఇదే తంతు జరుగుతూనే ఉంది. స్ధానిక ఎమ్మెల్యే ప్రజల  మంచినీటి ఇబ్బందులపై దృష్టి సారించి పధకంకు నూతన మోటార్లు, పైప్‌లైన్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించి ప్రజల తాగునీటి ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపడితే ప్రజలు జీవితాంతం గుర్తుంచుకుంటారు.

సయ్యద్‌ అమీర్‌, బ్రహ్మరావుపేట,   దొనకొండ 


నీటి సరఫరా పునరుద్ధరిస్తాం

నీరు పంపింగ్‌ చేసే మోటరు మరమ్మతులకు గురయ్యింది. ఒక  పర్యాయం ఎర్రగొండపాలెంలో బాగు చేయించినా సక్రమంగా పనిచేయలేదు. దీంతో తిరిగి రిపేరు నిమిత్తం గుంటూరు పంపించాం. రిపేరు చేయించి సంసిద్ధం చేస్తున్నాం.  ఆదివారం మోటారు వస్తుంది. మోటారు బిగించి ఒకటి రోజుల్లో గ్రామాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడతాం.

రామాంజనేయులు, జెఈ ఆర్‌డబ్ల్యూఎస్‌ 


Updated Date - 2021-04-11T06:05:38+05:30 IST