జల శిలాజాలు

ABN , First Publish Date - 2020-06-15T05:33:12+05:30 IST

రాత్రి తలుపు రెక్కలు కండ్లు మూసి తెట్టన తెల్లారేసరికి భూనిర్వాసితులమని పచ్చబొట్టు పొడిపించుకున్నాం!

జల శిలాజాలు

రాత్రి తలుపు రెక్కలు 

కండ్లు మూసి

తెట్టన తెల్లారేసరికి

భూనిర్వాసితులమని

పచ్చబొట్టు పొడిపించుకున్నాం!


పట్టు తప్పిన పిడికిలిలా

చెట్టు కొకలం..

పుట్ట కొకలం..

తెర్లు తెర్లయి నిష్ర్కియగ

దిగాలుగా కూర్చున్నాం!


ఓ దిక్కు ఎత్తిపోతల పథకంలా

ఎతల్ని ఎత్తిపోసుకుంటూ

ఇంకో దిక్కు గుండె సెదిరి

భారంగ గూడు ఖాళీచేస్తున్నాం!


తెల్లని దారపు తొవ్వలకు..

ఇంద్రధనుస్సు రంగుల

ముద్దబంతులు ఏరికూర్చినట్లు

అటూ ఇటూ అనురాగాల్ని పంచే

అనుబంధాల పొదరిండ్లు..


నాల్గు దారుల రెక్కల్ని

ఒక్కచోట పూదుద్దుకు కుట్టినట్లు

వచ్చి పోయెటోళ్ళను

ఆప్యాయంగ పలకరించే కూడళ్ళు..


భూసేకరణ దిగులుకు

ప్రసవ వేదనతో కొట్టు మిట్టాడి

పశుగ్రాసంగ ప్రాణాలొడ్డిన

కర్షకుని చెమట చుక్కలు

తాగి పెరిగిన పచ్చని పంటసేన్లు..


వేకువ సూర్యుడు..

గ్రామగుమ్మం రెక్క తెరిచేలోపు

తరలిపోవాలన్న చాటింపుకు

కన్నీరొడుతున్న పాడి పశువులు..


పొద్దుసుక్క పొడిస్తే..

అల్లరి తుంటరి పిల్ల తేటీగల్ని

ఒక్క దగ్గర కుదురుగ కూసోబెట్టే

మధు తుట్టెలాంటి ఊరిబడి..


కష్ట సుఖాలల్ల..

ఇంటి మూల వాసం తరీక

ఎన్కముందు నిలబడ్డ

మట్టిని ప్రేమించే మాపుర ప్రజలు..


అహం..

అనవసరంగ నెత్తికెక్కినప్పుడు

రెండు చెవులకు కుంజీతం ఇచ్చి

సాష్టాంగంగ ముక్కు నేలకు రాపిచ్చే

మా ఇంటి ఇలవేల్పు పోచమ్మ తల్లి..


ఖాళీ చేయడమంటే..

ఒక్క వస్తువుల్నే తరలించడం కాదుకదా!

మనిషిని కూరాడుగ నిలబెట్టిన

కొన్ని తరాల మూలాల్ని పెకలించడం!!


రైతుల త్యాగాలు..

పంటగింజల్లా పతాక శీర్షికలై

నీళ్ళు మాత్రం సరిహద్దుదాటినై.

కొత్తింట్ల మాత్రం..

పొయ్యిపై ఇంక పాలు పొంగనే లేదు!


ఒక్కసారి..

నిర్వాసితులమని రాజముద్రపడ్డాక

గాయం తాలూకు

గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు!

ముంపు ఊర్లు..


కడగండ్ల కన్నీటి పొరల్తో కప్పబడ్డ

పురాతన జల శిలాజాలు!

బాధితులు..

భూ నష్టపరిహారంగ

పల్లె జ్ఞాపకాల్ని తవ్వుకుంటున్న

పురాతత్వవేత్తలు!


 అశోక్‌ అవారి

90005 76581 

Updated Date - 2020-06-15T05:33:12+05:30 IST