ఆయకట్టులో ఆరుతడికే నీరు

ABN , First Publish Date - 2021-12-23T06:24:46+05:30 IST

యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలే సాగుచేయాలని ప్రభుత్వం స్పష్టం చేయగా, అందుకు అనుగుణంగా సాగునీటి పారుదలశాఖ నీటి ప్రణాళికను సిద్ధం చేసింది.

ఆయకట్టులో ఆరుతడికే నీరు
వరి నాట్లు వేస్తున్న మహిళా రైతులు

 ప్రభుత్వానికి ప్రతిపాదించిన నీటిపారుదలశాఖ

 ఉమ్మడి జిల్లాలో 9.47లక్షల ఎకరాల్లో ఆయకట్టు

 యాసంగిలో 7.83లక్షల ఎకరాల్లో మెట్ట పంటలకే సాగునీరు 8 1.6లక్షల ఎకరాల్లో వరికి..

 యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలే సాగుచేయాలని ప్రభుత్వం స్పష్టం చేయగా, అందుకు అనుగుణంగా సాగునీటి పారుదలశాఖ నీటి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో అత్యధికంగా ఆరుతడి పంటలకే సాగునీటిని కేటాయిస్తూ నీటిపారుదలశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే యాసంగి సీజన్‌కు సంబంధించిన సాగునీటి షెడ్యూల్‌ విడుదల కానుంది.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ)

ఉమ్మడి జిల్లాలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 9.47లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో 7.83లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగునీటిని అందించనున్నారు. కేవలం 1.64లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగుకు నీటిని విడుదలచేసేలా ప్రణాళిక సిద్ధమైంది. నాగార్జునసాగర్‌ పరిధిలో ఎడమ కాల్వ కింద 6.33లక్షల ఎకరా ల ఆయకట్టు ఉంది. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3.8లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మిగతా ఆయకట్టు ఖమ్మం జిల్లాలో ఉంది. అయితే సాగర్‌ మొదటి మేజర్‌ కింద కేవలం 1.55లక్షల ఎకరాల్లో మా త్రమే వరి సాగుకు నీరు అందించనున్నారు. అంటే ఉమ్మడి జిల్లాలోని సగం ఆయకట్టుకు మాత్రమే సాగర్‌నీరు వరి సాగుకు ఇవ్వనున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజె క్టు (ఏఎమ్మార్పీ) పరిధిలో 2.19లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీని పరిధిలో మొత్తం ఆరుతడి పంటలకే నీరివ్వనున్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఏటా ప్రత్యక్షంగా 2.2లక్షల ఎకరాలు, పరోక్షంగా మరో 30వేల ఎకరాల్లో వరి సాగయ్యేది. ఈ దఫా మొత్తం ఆరుతడి పంటలే సాగుచేయాలని అధికారులు చెబుతుండగా, సాగర్‌ కాల్వలు నిండుగా పారితే ఆ నీటితో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరిధిలో 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో 1.8వేల ఎకరాల్లో మాత్రమే వరికి నీరివ్వనున్నారు. మిగతా 28.2వేల ఎకరాల్లో మెట్ట పంటలకే సాగునీరు అందనుంది. డిండి ప్రాజెక్టు కింద 12,500 ఎకరాల్లో సుమారు 5వేల ఎకరాల్లో మాత్ర మే వరి సాగుకు నీరిచ్చే అవకాశముంది. మిగతా ఆయకట్టు అం తా ఆరుతడి పంటలే సాగుచేయాలని రైతులకు అధికారులు నచ్చజెబుతున్నారు. ఇప్పటికే వరి సాగుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడంతో, ఆయకట్టులోనూ రైతు లు ఆరుతడి పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆరుతడి పంటలకే సాగునీరు ఇస్తామని ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయి లో సమావేశా లు నిర్వహించి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.


2.5లక్షల ఎకరాల్లోనే వరి

ఉమ్మడి నల్లగొం డ జిల్లాలో గత ఏడాది యాసంగిలో ప్రాజెక్టుల పరిధిలో సుమారు 10.5లక్షల ఎకరాలకు ప్రభుత్వం సాగునీరు అందించింది. బోరు, బావుల కింద సాగైన విస్తీర్ణం దీనికి అదనం. దీంట్లో అత్యధికంగా వరి సాగైంది. ఈ ఏడాది మారిన పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ని అన్ని ప్రా జెక్టులు, బోరు, బావుల కింద సుమారు 2.5లక్షల ఎకరాల్లో నే వరి సాగును అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. మిగతా విస్తీర్ణం లో ఆరుతడి పంటలే సాగుచేయాలని రైతులకు సూచిస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టు కింద 1.5లక్షల ఎకరాలు, శ్రీరాంసాగర్‌ రెండో దశ (ఎస్సారెస్పీ స్టేజ్‌-2) కింద ఉన్న 50వేల ఎకరాల విస్తీర్ణంలో అంతా ఆరుతడి పంట లే వేయా లని, అలాగైతే నీరిస్తామని తెల్చిచెబుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవడంతో నాగార్జునసాగర్‌, మూసీ, డిండి, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండలా మారి యి. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు (312టీ ఎంసీలు) కాగా, ప్రస్తుతం 588.5 అడుగులతో (307 టీఎంసీలు) ఉంది. డెడ్‌స్టోరేజీపోగా రెండు రాష్ట్రాలకు కలిపి ఇంకా 160 టీఎంసీల నీరు సాగర్‌లో అందుబాటులో ఉంది. కుడి కాల్వ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకుపోగా ఎడమ కాల్వకు 60టీఎంసీలు యాసంగి సీజన్‌లో విడుదలచేయవచ్చు. అయితే ప్రభుత్వ నిర్ణయంతో ఆరుతడి పంటలకే అత్యధిక భాగం నీటి విడుదల చేయనున్నారు. మూసీ, డిండి, ఏఎమ్మార్పీ ప్రాజెక్టుల్లో సాగునీరు అందుబాటులో ఉన్నా, ఆరుతడి పంట లే సాగుచేసే పరిస్థితి రావడంతో ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో 9.7లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, యాసంగిలో దానిని 2.5లక్షల ఎకరాలకే పరిమితం చేయాలనే అధికారుల లక్ష్యం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.


శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో సుమారు 5వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా, గతంలో రైతులు ఆయకట్టులో వరి సాగుచేయగా, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యం లో కొందరు ఆరుతడి పంటలు సాగుచేయ గా, మరికొందరు వరికే మొగ్గుచూపుతున్నారు. కాగా, ప్రాజెక్టు నుంచి నీటిని ఎంపీపీ గంటా లక్ష్మ మ్మ విడుదల చేయగా, కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎర్ర శ్రీనివా్‌సరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ తాళ్లూరి మురళి, రైతుల సమన్వయ సమితి మండల  కన్వీనర్‌ గుండా శ్రీనివాస్‌, జెర్రిపోతుల చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.


ప్రాజెక్టుల నుంచి పంటలకు సాగునీరు ఇలా..

ప్రాజెక్టు మెట్ట మాగాణి మొత్తం

(ఎకరాల్లో) (ఎకరాల్లో) (ఎకరాల్లో)

నాగార్జునసాగర్‌ 4,78,816 1,55,170 6,33,986

ఏఎమ్మార్పీ     2,19,923 0         2,19,923

ఎస్సారెస్పీ-2     48,567         2,600 51,167

మూసీ             28,200         1,800 30,000

డిండి             7,500         5,000 12,500

మొత్తం         7,83,006     1,64,570 9,47,576 

Updated Date - 2021-12-23T06:24:46+05:30 IST