ప్రాణహిత దూకుడు.. గోదావరిలోకి భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2020-07-15T15:19:03+05:30 IST

ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఆ నది నుంచి భారీగా వరద నీరు గోదావరిలో చేరుతోంది. దీంతో గోదావరి నిండు కుండను తలపిస్తోంది.

ప్రాణహిత దూకుడు.. గోదావరిలోకి భారీగా వరద నీరు

కాళేశ్వరం వద్ద గోదావరి 7.5 మీటర్ల ప్రవాహం

ప్రాణహిత ఇన్‌ఫ్లో 29,500 క్యూసెక్కులు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద 11.9 టీఎంసీల నీటి నిల్వ


భూపాలపల్లి (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది.  ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ఆ నది నుంచి  భారీగా వరద నీరు గోదావరిలో చేరుతోంది. దీంతో గోదావరి నిండు కుండను తలపిస్తోంది. 

భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది గోదావరిలో కలుస్తోంది. ఎగువన పడుతున్న వర్షాలకు ప్రాణహిత నదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. మంగళవారం ప్రాణహిత నుంచి 29,500 క్యుసెక్కుల నీళ్లు త్రివేణి సంగమంగా పిలిచే కాళేశ్వరం వద్ద గోదారిలోకి వచ్చి చేరుతున్నాయి. 


దీంతో కాళేశ్వరం వద్ద 7.5మీటర్లుగా గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. అలాగే కాళేశ్వరం నుంచి 22 కిలో మీటర్ల దూరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 11.9 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. బ్యారేజీ నుంచి దిగువకు 29,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 17.16 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌజ్‌ నుంచి ఎగువకు ఎత్తిపోసే అవకాశం లేకపోవడంతో పది రోజులుగా బ్యారేజీ దిగువ వరకు భారీగా నీటిని వదులుతున్నారు.

Updated Date - 2020-07-15T15:19:03+05:30 IST