నేత్రావతి నదిలో నీటి కుక్కలు

ABN , First Publish Date - 2022-01-18T09:33:23+05:30 IST

కర్ణాటక రాష్ట్రం దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ముండాజె గ్రామం

నేత్రావతి నదిలో నీటి కుక్కలు

బెంగళూరు, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ముండాజె గ్రామం వద్ద నేత్రావతి నదిలో నీటి కుక్కలు కనిపించాయి. కల్మంజ గ్రామం నుంచి పజిరడ్క దాకా సుమారు 3 కిలోమీటర్ల వరకు నదిలో నీటి కుక్కలు సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురవడంతో నేత్రావతి నది సుమారు మూడునెలలకు పైగానే ప్రవహించింది. ఇటీవలే వర్షపు నీటి ప్రభావం తగ్గిన మేరకు నీటికుక్కలు నదిలో సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రోజూ సుమారు 10-15కు పైగా నీటికుక్కలు సంచరిస్తున్నాయన్నారు. గత ఏడాది మే నెలలో గర్డాడి గ్రామ పరిధిలో ఫల్గుణ నదిలో సుమారు 25కు పైగా నీటి కుక్కలు కనిపించాయి. నీటిలో మాత్రమే ఉండే నీటికుక్కలు చేపలు, పీతల వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయని స్థానికులు తెలిపారు. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంటాయని, భారీగా ఉన్నప్పుడు కనిపించవన్నారు.


నేత్రావతితో పాటు మృత్యుంజయ నదిలోనూ ఇవి సంచరిస్తుంటాయి. నీటిలో వేగంగా దూసుకెళ్లే నీటికుక్కలు శబ్ధాలను గ్రహిస్తాయని, ఏదైనా వినిపిస్తే వెంటనే నీటిలో మునిగి గంటల తరబడిగాను బయటకు రావని లోపల కూడా వేగంగానే ముందుకు కదులుతాయని స్థానికులు చెప్పారు. నీటి కుక్కలు మనుషులకు ఎలాంటి హాని తీసుకురావని జిల్లా అటవీశాఖ అధికారి త్యాగరాజ్‌ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పేలుడు పదార్థాలు ప్రయోగించి చేపల వేట సాగిస్తుండటం నీటి కుక్కలకు ఉనికికి ప్రమాదకరమని ఆయన తెలిపారు.


Updated Date - 2022-01-18T09:33:23+05:30 IST