Haryana: రైతు ఆందోళనపై పోలీసుల దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-10-02T22:39:42+05:30 IST

రైతుల ఆందోళన విషయంలో హర్యానా పోలీసుల తీరుపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను హర్యానా సరిహద్దులో ఆపేసి వాటర్ కెనాన్లు ప్రయోగించడం, బాష్పవాయువు లాంటివి ప్రయోగించడం జనవరిలో సంచలనంగా మారింది...

Haryana: రైతు ఆందోళనపై పోలీసుల దౌర్జన్యం

చండీగఢ్: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహార్‌లాల్ ఖట్టర్ ఇంటి ముందు ఆందోళన నిర్వహిస్తున్న వేలాది మంది రైతుల పట్ల పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారు. రైతులపైకి వాటర్ కెనాన్లు ఉపయోగించి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రైతు ఆందోళన దృష్ట్యా ముఖ్యమంత్రి ఇంటిముందు పోలీసులు ముందుగానే బారీకేడ్లు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయమే సీఎం ఇంటికి చేరుకున్న రైతులు బారీకేడ్లను దాటే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించారు.


శుక్రవారం భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ శనివారం భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. తికాయత్ పిలుపు మేరకు హర్యానాలోని బీజేపీ ఎమ్మెల్యేల ఇంటి ముందు రైతులు నిరసనకు దిగారు. రాష్ట్ర రాజధాని మనోహర్‌లాల్ ఖట్టర్ ఇంటి ముందు వేలాది మంది రైతులు ఆందోళన నిర్వహించారు.


రైతుల ఆందోళన విషయంలో హర్యానా పోలీసుల తీరుపై మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను హర్యానా సరిహద్దులో ఆపేసి వాటర్ కెనాన్లు ప్రయోగించడం, బాష్పవాయువు లాంటివి ప్రయోగించడం జనవరిలో సంచలనంగా మారింది.

Updated Date - 2021-10-02T22:39:42+05:30 IST